ఓటమి భయంతోనే ముందస్తు: చాడ 

15 Aug, 2018 05:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలకు సంకేతాన్ని ఇస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బీజేపీతో చేసుకున్న లోపాయికారీ ఒప్పందం వల్లే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ మఖ్దూంభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను గద్దె దించుతామని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను కేసీఆర్‌ గాలికి వదిలి బర్రెలు, గొర్రెలు, చేపలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేవిధంగా ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. మహిళలు లేని మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. 

అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వరా? 
పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల హామీని అమలుచేయాలని అడిగేందుకు కేసీఆర్‌ అపాయింట్‌మెంటు కూడా ఇవ్వడం లేదని.. ప్రగతిభవన్‌కు వెళ్తే అరెస్టు చేశారని చాడ వెల్లడించారు. ముఖ్యమంత్రికి కనీసం పిలిచి మాట్లాడే సంస్కారం కూడా లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్బంధాలకోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ను అప్రజాస్వామికంగా సస్పెండ్‌ చేసి, కొత్తరకమైన కుట్రలకు తెరలేపారన్నారు. వివిధ పార్టీల నేతలను బెదిరించి, టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించుకుంటున్నారని ఆరోపించారు. సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి నినాదంతో వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు అన్నింటితో కలిపి టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు వేశామని, భావ సారూప్య పార్టీలతో పొత్తు ఉంటుందని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు