ఓడితేనే కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది

3 Apr, 2019 02:50 IST|Sakshi

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి

కేసీఆర్‌ నేలవిడిచి సాము చేస్తున్న తీరు ఎల్లకాలం సాగదు

ఫిరాయింపులతో తెలంగాణకు అప్రతిష్ట

తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌కు మద్దతు

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడితేనే ఆ పార్టీకి, అధినేత కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దానికి భిన్నంగా టీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చిన పక్షంలో కేసీఆర్‌ ఇంకా విజృంభించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను రాజకీయంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల మూడు ఎమ్మెల్సీ సీట్లలో ఓటమితో టీఆర్‌ఎస్‌ పునరాలోచనలో పడిందని, తమ వైఖరిలో, విధానంలో లోపాలున్నాయని గుర్తించిందన్నారు. ఈ ప్రతికూల ఫలితాలతోనే ఓ బాధిత రైతుతో సీఎం కేసీఆర్‌ నేరుగా మాట్లాడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందితే ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడంతో పాటు, సీఎం సచివాలయానికి కూడా వచ్చేందుకు మొగ్గుచూపుతారన్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షముంటేనే అధికారపక్షం ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలుకునే అవకాశం ఉంటుం దని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇవీ...

నియంతృత్వ పాలన సాగుతోంది...
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వ, గడీల పాలన కొనసాగిస్తోంది. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నతీరు తెలంగాణకు అప్రతిష్టను తెచ్చిపెట్టింది. పార్టీ మారిన వెంటనే టీడీపీ నేత నామా నాగేశ్వరరావుకు టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ టికెట్‌ ఇవ్వడం దారుణం. ఈ విషయంలో కేసీఆర్‌ తనకు తానే సాటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నేల విడిచి సాము చేస్తున్న తీరు ఎల్లకాలం సాగదు.

టీఆర్‌ఎస్, బీజేపీ వ్యతిరేకతే ఎన్నికల విధానం
మతోన్మాద బీజేపీ, ఫాసిస్ట్‌ ధోరణుల నరేంద్ర మోదీలను ఓడించి కేంద్రంలో లౌకికశక్తుల ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాం. జాతీయస్థాయిలో లౌకిక, ప్రజాస్వామ్య, వామశక్తుల వేదిక ఏర్పాటుకు ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతర పొత్తులకు అవకాశముంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అన్నిసీట్లకు పోటీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పరస్పర పోటీ నివారించాలని నిర్ణయించాం. మిగతాచోట్ల టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించగలిగే శక్తులకు మద్దతునివ్వాలని భావిస్తున్నాం. 

కాంగ్రెస్‌ తీరు మారలేదు...
లోక్‌సభ ఎన్నికల్లో గత్యంతరంలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతునిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించాలనే ప్రధాన లక్ష్య సాధనకుగాను, మేము పోటీచేయని చోట్ల కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించాం. 2014 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తున్నా కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు మాకు బదిలీ కాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని, పెద్దన్న వైఖరి ఉండొద్దని కాంగ్రెస్‌కు చెప్పాం. కూటమి సర్దుబాటు ఆలస్యం కావడంతో ప్రజల ఆలోచనావిధానం మారి ఆశించిన ప్రయోజనాలు లభించలేదు. రాజకీయ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. రెండు సందర్భాల్లో కాంగ్రెస్‌తో సీపీఐకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఫలితాలు వెలువడ్డాక కనీస సమీక్ష చేయాలన్న ధర్మాన్ని కాంగ్రెస్‌ పాటించలేదు. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వలోపాలు, బలహీనతలకు తోడు సమన్వయం కూడా సాధ్యం కాలేదు.

వామపక్షాలు బలపడాలి...
జాతీయ, రాష్ట్రస్థాయిల్లో వామపక్షాలు బలపడేందుకు ఢిల్లీ స్థాయిలో చర్చలు జరగాలి. వామపక్షాల ఐక్యతతోపాటు విధివిధానాల్లో స్పష్టత సాధించాల్సి ఉంది. కమ్యూనిస్టు పార్టీల పునాదులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఆత్మవిమర్శలతో ముందుకు సాగాల్సి ఉంది. 

ఐక్యకార్యాచరణలే మార్గం
రాష్ట్రస్థాయిలో ప్రజాసమస్యలపై పోరాటాలు, ఉద్యమాల ద్వారా కమ్యూనిస్టులు పూర్వవైభవాన్ని సాధించే అవకాశాలున్నాయి. సీపీఐ, సీపీఎం ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగితే తెలంగాణలో గతంలోని ప్రతిష్టను తిరిగి సాధించేందుకు అవకాశాలున్నాయి.

సీపీఎంతో సమన్వయం...
ఆయా అంశాలకు సంబంధించిన రాష్ట్రంలో సీపీఎంతో భిన్నాభిప్రాయాలుంటే.. కలిసి పనిచేయడం, సమన్వయం, చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. పరిస్థితులకు తగ్గ ట్టుగా వ్యవహరిస్తాం. అప్రజాస్వామికంగా, నియంతృ త్వంగా వ్యవహరించే అధికారపక్షానికి వ్యతిరేకంగా ముందుకు సాగుతాం. వామపక్ష ఐక్యత కోసం, పరస్పరం సహకరించుకుంటాం.

ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి
ఈ ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటాం. స్థానిక సమస్యలపై పోరాటాలు, ముఖ్యమైన అంశాలపై మిలిటెంట్‌ తరహా ఉద్యమాలకు సన్నద్ధం కావడంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నాం. పార్టీలో కిందిస్థాయి కేడర్, నాయకుల్లో కొంతమేర నిబద్ధత తగ్గిపోవడంతోపాటు అధికార, బూర్జువా పార్టీల ప్రలోభాలకు లొంగిపోయే బలహీనతలు బయటపడుతున్నాయి. దీనిని అధిగమిం చేందుకు మెరుగైన పనివిధానం, జవాబుదారీతనంతో వ్యవహరించేలా పార్టీలో మార్పులు తీసుకువస్తాం. ఇసుక, ఇతర సహజ వనరుల దోపిడీ, సాగు, తాగునీరు, విద్య, వైద్యం, ఇతర సమస్యలపై కిందిస్థాయి ప్రజలు, పార్టీ కేడర్‌ను చైతన్యవంతం చేసి ఉద్యమాలు, పోరాటాలకు సిద్ధమవుతాం.  

మరిన్ని వార్తలు