సీపీఐ బలోపేతానికి కృషి..

22 Feb, 2020 17:53 IST|Sakshi

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి

సాక్షి, ఆదిలాబాద్‌: తెలంగాణలో సీపీఐ పార్టీ బలహీనపడిందని.. కొత్త కార్యవర్గం, నాయకత్వ నిర్మాణం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తెలిపారు. మంచిర్యాలలో శనివారం ప్రారంభమైన సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కనీసం ఒక్క ఎమ్మెల్యే గెలవకపోవటం, అసెంబ్లీలో మా ప్రాతినిధ్యం లేకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం నిజాయితీ రాజకీయాలు చెల్లుబాటు కావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో  కీలక పాత్ర పోషించిన సీపీఐకి తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజాసమస్యలు, సంక్షేమ పథకాల అమల్లో లోపాలు ఎండగడుతూ ప్రజా పోరాటాలతో ప్రజల్లోకి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు.

సింగరేణి కార్మికుల్లో సీపీఐ పార్టీకి చాలా బలముందని, సింగరేణి గుర్తింపు ఎన్నికలను టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయం చేసిందని విమర్శించారు. అందుకే సింగరేణి ఏర్పాటు నుంచి బలంగా ఉన్న సీపీఐ కార్మిక సంఘం పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్మికుల్లో ఉన్న వ్యతిరేకత, అన్ని సంఘాల మద్దతుతో గత వైభవాన్ని చాటుతామన్నారు. ఎన్‌సీఆర్‌, ఎన్‌పీఆర్‌ల చట్టాలతో దేశ ప్రజల్లో కేంద్రం భయాందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు. కేంద్రలో ఎన్‌డీఏ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ ఉద్యమాలను రూపొందించే దిశగా రాష్ట్ర నిర్మాణ మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు ఫిబ్రవరి 24వరకు కొనసాగనున్నాయి.

చదవండి: కేసీఆర్‌కు వకాలత్‌ పుచ్చుకున్నారా?: చాడ

మరిన్ని వార్తలు