మెట్రో ప్రారంభోత్సవానికి విపక్షాలను ఆహ్వానించకపోవడం దారుణం

30 Nov, 2017 02:56 IST|Sakshi

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌/హవేళిఘణాపూర్‌: మెట్రో రైల్‌ ప్రారంభించిన తీరు ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి అద్దంపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రారంభ కార్యక్రమానికి విపక్షాలను ఆహ్వానించకపోవడం దారుణమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో కేరళలోని కొచ్చిలో ప్రధాని మోదీ మెట్రోను ప్రారంభించగా ఆ కార్యక్రమానికి అక్కడి ప్రభుత్వం ప్రతిపక్షాలన్నింటిని ఆహ్వానించిందని వెల్లడించారు. మెట్రో రైల్‌ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి చార్జీలను తగ్గించాలని చాడ డిమాండ్‌ చేశారు.

మరోవైపు ‘సామాజిక తెలంగాణ–సమగ్రాభివృద్ధి’పేరుతో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట బుధవారం మెదక్‌ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చాడ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కుంభకోణాలకు కేరాఫ్‌గా మారిందని విమర్శించారు. కోట్ల రూపాయలు ఎగ్గొట్టినవారు విదేశాల్లో ఉంటే, రెండు వేల అప్పు చేసిన రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వస్తువుపై జీఎస్టీ విధించిన ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై ఎందుకు విధించలేదో చెప్పాలన్నారు. 

మరిన్ని వార్తలు