కోడెల వ్యతిరేక వర్గీయులదే పైచేయి

20 Mar, 2019 03:55 IST|Sakshi

నర్సరావుపేట టీడీపీ అభ్యర్థిగా చదలవాడ

నరసరావుపేట: నరసరావుపేట నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు పేరును ప్రకటించడంతో స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు వ్యతిరేక వర్గీయులదే పైచేయి అయింది. ముఖ్యంగా ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇందులో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తనను కనీసం నియోజకవర్గంలోకి రానీయకుండా ఏకపక్షంగా వ్యవహరించినందుకు కోడెల, అతని కుమారుడిపై రాయపాటి కక్ష తీర్చుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

తాను నరసరావుపేట ఎంపీగా మరోసారి పోటీ చేయాలంటే డాక్టర్‌ చదలవాడకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని రాయపాటి చంద్రబాబు వద్ద పట్టుబట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మూడు రోజుల క్రితమే డాక్టర్‌ చదలవాడను రాయపాటి, ప్రత్తిపాటి ఆశీస్సులతో కోడెల వ్యతిరేక వర్గీయులు కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి, వాసిరెడ్డి రవీంద్ర, చల్లా సుబ్బారావు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. చదలవాడ అభ్యర్థిత్వంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. నరసరావుపేటకు వచ్చిన చదలవాడ తనను హైకమాండ్‌ అభ్యర్థిగా ప్రకటించిందని మీడియాకు చెప్పారు. జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికైనా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్‌ చదలవాడకు టికెట్‌ ఇచ్చినట్లుగా కోడెల వర్గీయులు తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. అయితే డాక్టర్‌ చదలవాడ అభ్యర్థిత్వ నిర్ణయంపై కోడెల ప్రభావం లేకుండా అధిష్టానం వ్యవహరించింది. 

మరిన్ని వార్తలు