అజిత్‌ వెనక్కి వస్తారు : సంజయ్‌ రౌత్‌

23 Nov, 2019 14:32 IST|Sakshi

ముంబై : ట్విస్టులకే ట్విస్టులు అన్నట్టు సాగుతున్న ‘మహా’రాజకీయాలు మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత శరద్‌ పవార్‌కు షాకిచ్చిన అజిత్‌ పవార్‌ కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ వారితో ప్రమాణం చేయించారు.
(చదవండి : బిగ్‌ ట్విస్ట్‌: సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణం)

అయితే, బ్లాక్‌మెయిల్‌ కారణంగానే అజిత్‌ పవార్‌ ఎన్సీపీ అధినేతకు వెన్నుపోటు పొడిచి బీజేపీతో చేతులు కలిపాడని శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. కాషాయ పార్టీ పంచన చేరిన ఎన్సీపీ సీనియర్‌ నేత ధనంజయ్‌ ముండే తమతో టచ్‌లో ఉన్నాడని చెప్పారు. ఆయన వెనక్కి తిరిగొస్తారని వెల్లడించారు. ఇక మహా ట్విస్టుకు కారణమైన అజిత్‌ పవార్‌ కూడా వెనక్కి తిరిగొచ్చే అవశాశముందని రౌత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాల వెనుక ఎవరెవరున్నారో..? శివసేన ఎడిటోరియల్‌ ‘సామ్నా’లో బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న అజిత్‌ పవార్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ పార్టీ నాయకత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎన్సీపీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
(చదవండి : మహారాష్ట్రలో రాజకీయ ప్ర​కంపనలు)

>
మరిన్ని వార్తలు