‘పరిషత్‌’ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు సిద్ధం 

31 Mar, 2019 05:17 IST|Sakshi

మే మొదటి వారంలో జెడ్పీ ఎన్నికలకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఏప్రిల్‌ 11న రాష్ట్రంలో తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ముగియగానే, రెండో వారంలో పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. మే నెల మొదటి లేదా రెండో వారంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవకాశమున్నట్లుగా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 27న జిల్లా పంచాయతీ అధికారులు చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా వార్డులు, పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తయింది. తుది జాబితా పూర్తయిన నేపథ్యంలో శనివారం మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ)ల పరిధిలోని ఎంపీటీసీ స్థానాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలతోపాటు జిల్లా ప్రజాపరిషత్‌ (జెడ్పీపీ)ల పరిధిలోని జెడ్పీటీసీ సీట్ల వారీగా ఓటర్ల జాబితాలను కొన్ని జిల్లాల్లో సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలను ఆయా జిల్లాల్లోని సంబంధిత మండల, జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయాల్లో ప్రదర్శించినట్టు సమాచారం.

ఈ ప్రక్రియ పూర్తి కాని జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి కల్లా అధికారులు తమ పనిని ముగించవచ్చని చెబుతున్నారు. 27న జిల్లాల్లోని పంచాయతీల వారీగా ప్రచురించిన ఓటర్ల తుది జాబితాకు అనుగుణంగా ఏప్రిల్‌ 7 నుంచి పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితాలు సిద్ధం చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ జాబితాల ఆధారంగా పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం చేసుకుని, అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌  సూచించింది. మండలాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను ఏప్రిల్‌ 20 కల్లా పూర్తిచేసుకోవాలని పేర్కొంది. పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ, సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నిక కమిషన్‌ , పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు