‘హీరో అవుదామని చంద్రబాబు తాపత్రయం’

28 Mar, 2018 19:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : చట్టసభల్లో జరిగిన తీర్మానాలను గౌరవించే అలవాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేదని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై 2014 మార్చి 2న కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని, పార్లమెంట్లో స్వయంగా అప్పటి ప్రధాని ఈ మేరకు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రత్యేక హోదా కావాల్సిందేనని రెండు సార్లు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. వీటన్నింటికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా 2016 సెప్టెంబరు 8న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపారని అన్నారు.

చీకటి ఒప్పందాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఇప్పుడు అధికారం చేజారుతుందనే భయంతో ప్రత్యేక హోదా గళమెత్తి కొత్త పలుకులు పలుకుతున్నారని, అఖిలపక్షం అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని అన్నారు. ఈ డ్రామాతో తానే హీరో అవుదామని చంద్రబాబు తాపత్రయం పడుతున్నారని, కానీ ప్రజల దృష్టిలో మాత్రం రాష్ట్రానికి చేసిన అన్యాయానికి చంద్రబాబు విలన్‌గానే మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. అఖిలపక్షం భేటిలో 60 మంది కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో మాట్లాడారని చంద్రబాబు చెబుతున్నారని, ఆ ఆగ్రహం ఆయన మీదే అన్న విషయం బాబుకు అర్థం కావడం లేదని అన్నారు.

మూడు రాజకీయ పక్షాలు మినహా అందరూ అఖిలపక్ష భేటీకి హాజరయ్యారని చెబుతున్నారని, అందులో రెండు మీ మాజీ భాగస్వాములనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. అఖిలపక్ష భేటీని మూడు పార్టీలు బహిష్కరించినందుకు చంద్రబాబు ఏ మాత్రం సిగ్గపడటం లేదని, పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, గెలిపించుకునే సత్తా టీడీపీ లేదని విమర్శించారు. రాజ్యాంగ విలువలు పాటించని సభలో ప్రతిపక్షం ఎలా కూర్చుంటుందని ప్రశ్నించారు. ‘ప్రధానికి వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నమస్కారం చేస్తే తప్పు.. అదే టీడీపీ వెన్నుపోటు పొడిస్తే ఒప్పు.. ఇదీ చంద్రబాబు తీరు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌ కాళ్లు పట్టుకున్నారు. మట్టి, నీరు ఇచ్చినప్పుడు మోదీ కాళ్లు పట్టుకున్నారు. రాజకీయ లాభం కోసం ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకున్నారు. పోలవరం పనుల కోసం గడ్కరీ కాళ్లు పట్టుకున్నారు.’

మరిన్ని వార్తలు