4.17లక్షల కోట్లకు ఎగనామం..

5 Apr, 2019 07:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : అన్నదాత సుఖీభవ.. పసుపు కుంకుమ.. అంటూ ఎన్నికల ముందు హడావుడిగా కొత్త వరాలు ప్రకటిస్తున్న చంద్రబాబు.. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అటకెక్కించారు. రైతులకు రుణాలు మాఫీ చేసేశా.. యువతకు లక్షల ఉద్యోగాలు ఇచ్చా..  కాబట్టి జాబు రావాలంటే మళ్లీ మళ్లీ బాబు రావాలి.కోటిమంది చెల్లెళ్లున్న అదృష్టవంతుడిని నేనొక్కడినే... సొమ్ములు జమ చేస్తున్నా.. మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోండి.. మీ భర్త, పిల్లలను తీసుకొని రెండుమూడు రోజులు విహార యాత్రలకు వెళ్లండి. 

ఇప్పటికే చాలా చేశా.. ఇంకా చాలా చాలా చేస్తా.. ఇదీ చంద్రబాబు ఎన్నికల ప్రచార ధోరణి! మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చాలా చాలా చేశానని చంద్రబాబు చెబుతోందంతా నిజమేనా?! రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, చేనేత కార్మికులకు 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేమిటి? గత ఐదేళ్లుగా చంద్రబాబు చేసిందేమిటి? ఆయా వర్గాలకు ఎంత బాకీపడ్డారో చూద్దాం..

  • రైతులకు హామీ ఇచ్చిన విధంగా బేషరతుగా రుణ మాఫీ చేయకుండా కోటీæ 18లక్షల మంది రైతులకు.. చంద్రబాబు సర్కారు బాకీ రూ.1,62,000 కోట్లు ఉండగా.. రుణమాఫీ చేసేశా అనడం.. ఎన్నికల ముందు అన్నదాత సుఖీభవ అంటూ.. మళ్లీ మభ్య పెట్టేందుకు వెయ్యి, మూడువేలు విదిల్చడం కష్టాల్లో ఉన్న రైతులను అవమానించడం కాదా..?!అన్నది అన్నదాతలు లేవనెత్తుతున్న ప్రశ్న! 
  • హామీ ఇచ్చినట్లు  డ్వాక్రా మహిళల రుణం బేషరతుగా మాఫీ చేయనందుకు..సున్నా వడ్డీ చెల్లించనందుకు బాబు సర్కారు మొత్తంగా 93 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ. 28,500 కోట్లు బకాయి పడింది. వాస్తవం ఇలా ఉంటే.. ఐదేళ్లుగా పట్టించుకోకుండా.. ఇప్పుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమ (ఇది కూడా అప్పే) సొమ్ము జమ చేస్తున్నా.. విహార యాత్రలకు వెళ్లండి! అనడం ఏమిటన్నది అక్కచెల్లెమ్మల ఆవేదన!! 
  • జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు..ఉద్యోగం ఇవ్వకుంటే..రూ.2వేల నిరుద్యోగ భృతి అన్నారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు.  ఐదేళ్లుగా నిరుద్యోగ యువతకు నెలకు రెండు వేల చొప్పున .. మొత్తం కోటి 70 లక్షల మంది యువతకు చంద్రబాబు సర్కారు 1,97,200 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఉద్యోగాలు భర్తీ చేయకుండా... భృతి ఇవ్వకుండా...చంద్రబాబు ప్రభుత్వం తమను నిండా ముంచిందన్నది నిరుద్యోగుల నిరసన. 
  • చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తానని.. ప్రతి ఏటా రూ.1000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి.... నయాపైసా విదల్చకుండా చంద్రబాబు రాష్ట్రంలోని 1.15 లక్షల మంది చేనేత కార్మికులకు రూ.5474.50 కోట్లు బకాయి పడ్డారని నేతన్నలు పేర్కొంటున్నారు.
  • మా ఇంటి మహాలక్ష్మి పేరుతో ఆడ పిల్లలకు ఏడాదికి రూ.25 వేల చొప్పున.. ఐదేళ్లలో 16 లక్షల మంది ఆడ పిల్లలకు చంద్రబాబు సర్కారు రూ.4000 కోట్లు బకాయిపడింది. 
  • రాష్ట్రంలోని 14.55 లక్షల మంది విద్యార్ధుల పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ 6,800 కోట్ల బడ్జెట్‌ కేటాయించాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు ఏటా బడ్జెట్లో రూ.2800 కోట్లనే కేటాయిస్తోంది. అంటే.. ఏడాదికి రూ.4000కోట్ల చొప్పున ఐదేళ్లలో విద్యార్ధులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల బకాయి పడింది.  

ముఖ్యమంత్రి చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం లక్షలాది మంది రైతులు, డ్వాక్రా మహిళలు, యువత, చేనేత, విద్యార్ధులను, అప్పుడే పుట్టిన ఆడ పిల్లలను మోసం చేయడానికి ఉపయోగపడింది. అన్ని వర్గాలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆయన విస్మరించారు. తొలి సంతకాలకు కూడా విలువ లేకుండా దగా చేశారు. రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగ యువత, డ్వాక్రా మహిళలు, చేనేతలకు చంద్రబాబు సర్కారు లక్షల కోట్ల రూపాయలు బకాయి పడింది. 

కోటి 18 లక్షల మంది రైతులకు సర్కారు బాకీ రూ.1,62,000 కోట్లు   
అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం–2014 ఎన్నికల మేనిఫెస్టోలో, బహిరంగ సభల్లో చంద్రబాబు హామీ! 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. బాబు చేశానని చెబుతున్నది వడ్డీలకు కూడా సరిపోలేదన్నది వాస్తవం. ఆయన విదిల్చిన కొద్దిపాటి మొత్తం పోగా ఈ ఐదేళ్ల పదవీ కాలం ముగిసేసరికి.. ప్రస్తుతం రాష్ట్రంలోని 1,18,54,000 మంది రైతుల వ్యవసాయ రుణాలు రూ.1,50,000 కోట్లకు చేరాయి.

ఈ మొత్తం రుణాలపై ఏడు శాతం వడ్డీ వేసుకున్నా.. ఒక్క ఏడాదికి రూ.12,600 కోట్లు అవుతుంది. అంటే.. కోటి 18లక్షల మంది రైతులకు చంద్రబాబు సర్కారు రూ.1,62,000 కోట్లు  బకాయి ఉంది. ఇవేకాకుండా 35,24,549 మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.26,055 కోట్ల రుణం తీసుకున్నారు. చంద్రబాబు రుణమాఫీ నుంచి బంగారం రుణాలను తొలగించేశారు. దాంతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు వడ్డీ భారం ఎక్కువై అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

93 లక్షల మంది డ్వాక్రా మహిళలకు బకాయి రూ.28,500 కోట్లు 
‘డ్వాక్రా మహిళలందరికీ చెబుతున్నా.. మీ అప్పులన్నీ నేను మాఫీ చేస్తాను...బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు. మీరింక నిశ్చింతగా ఉండొచ్చు’–ఇదీ చంద్రబాబు 2014 ఎన్నికల సందర్భంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఊరూరా తిరిగి పదేపదే చెప్పింది. చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆయన మాటలు నమ్మిన లక్షలాది మంది డ్వాక్రా మహిళలు బ్యాంకులకు అప్పులు చెల్లించడం మానేశారు. డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని.. మాట మార్చడంతో డ్వాక్రా సంఘాల అప్పులు పెరిగిపోవడమే కాకుండా వడ్డీల భారం పడింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల రుణాలు రూ.21,479.40 కోట్లు ఉండగా.. ఆ అప్పులు అసలు, వడ్డీ తడిసిమోపెడై రూ.26,000 కోట్లకు చేరింది. అలాగే సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రూ.2500 కోట్లు చెల్లించలేదు. డ్వాక్రా మహిళల రుణం బేషరతుగా మాఫీ చేయనందుకు.. సున్నా వడ్డీ చెల్లించనందుకు చంద్రబాబు సర్కారు మొత్తం 93 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.28,500 కోట్లు బకాయి పడింది.  

1.70 కోట్ల మంది నిరుద్యోగులకు భృతి బకాయి రూ.1,97,200 కోట్లు
2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలంటూ’ ప్రచారం చేశారు చంద్రబాబు. ప్రతిసంవత్సరం ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ ప్రకటించి... ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని.. లేదంటే ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు చెప్పారు. 2014లో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న చంద్రబాబు 2018 అక్టోబర్‌ వరకూ.. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు.

ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో... తప్పనిసరి పరిస్థితిలో అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామంటూ సవాలక్ష నిబంధనలు పెట్టారు. రాష్ట్రంలో కోటి 70 లక్షల కుటుంబాల్లో ఒక్కో నిరుద్యోగి ఉన్నారనుకుంటే.. కోటి 70 లక్షల మంది నిరుద్యోగ యువతకు నెలకు రూ.2000 చొప్పున చంద్రబాబు సర్కారు 1,97,200 కోట్ల రూపాయలు బకాయి పడింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఖాళీలుండగా వాటిని భర్తీ చేయలేదు.   

1.15 లక్షల చేనేతలకు రూ.5474.50 కోట్లు బకాయి
చేనేత కార్మికులకు ఉన్న రూ.365 కోట్ల రుణాలన్నీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వారి రుణమాఫీకి ఎగనామం పెట్టారు. రుణమాఫీ చేయని కారణంగా.. రాష్ట్రంలోని 1.15లక్షల మంది చేనేత కార్మికుల అప్పు రూ.365కోట్లు గత ఐదేళ్ల వడ్డీతో కలుపుకొని మొత్తం రూ.474.50కోట్లకు చేరింది. ఎన్నికల ప్రణాళికలో చేనేత కార్మికులకు ప్రతీ సంవత్సరం బడ్జెట్‌లో రూ.1000కోట్లతో  ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

కాని గత ఐదేళ్లలో ఈ ప్రత్యేక నిధికి పైసా కేటాయించలేదు. ఈ విధంగా చూస్తే చేనేత కార్మికులకు కేటాయించాల్సిన ప్రత్యేక నిధి కింద గత ఐదేళ్లలో రూ.5000కోట్లు చేనేతలకు చంద్రబాబు ప్రభుత్వం బకాయిపడింది. మొత్తంగా రాష్ట్రంలోని 1.15 లక్షల మంది చేనేత కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.5474.50కోట్లు బకాయి ఉంది.  

16లక్షల మంది ఆడ పిల్లలకు బాబు బకాయి రూ.4000 కోట్లు
రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం బంగారు తల్లి పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మారుస్తూ..పుట్టిన ప్రతీ ఆడపిల్ల పేరిట రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తామని జీవో జారీ చేశారు. అయితే ఆ పథకాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదు. ఈ ఐదేళ్లలో ఒక్క ఆడపిల్లకు కూడా పైసా డిపాజిట్‌ చేయలేదు. రాష్ట్రంలో ప్రతీ ఏటా 3.20 లక్షల మంది ఆడ పిల్లలు జన్మిస్తున్నారని ఆసుపత్రుల గణాంకాలు చెబుతున్నాయి. దాని ప్రకారం చూస్తే.. ఏడాదికి రూ.25 వేల చొప్పున ఐదేళ్లలో 16 లక్షల మంది ఆడ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 కోట్లు బకాయిపడింది. 

విద్యార్థుల  ఫీజు బకాయిలు రూ.20వేల కోట్లు
విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తామంటూ.. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఒక్కో కోర్సుకు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు ఫీజురీయింబర్స్‌మెంటచేయాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు కేవలం రూ.35వేలు మాత్రమే ఇస్తోంది. రాష్ట్రంలోని 14.55 లక్షల మంది విద్యార్ధుల పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌కు రూ 6,800 కోట్ల బడ్జెట్‌ కేటాయించాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు ఏటా బడ్జెట్లో రూ.2800 కోట్లనే కేటాయిస్తోంది. అంటే.. ఏడాదికి రూ.4000కోట్ల చొప్పున ఐదేళ్లలో విద్యార్ధులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లు బకాయి పడింది. 

రూ.30వేలు ఎగ్గొట్టి.. రూ.10వేలు అప్పు ఇస్తావా?
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కలిసిపూడి గ్రామంలోని దేవి–1 డ్వాక్రా సంఘంలో పది మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వాళ్ల డ్వాక్రా సంఘం పేరిట ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి రూ.9,71,849 బ్యాంకు రుణం ఉంది. ఆ రుణంపై 12.5 శాతం వడ్డీ రేటు ప్రకారం–ఏడాదికి ఆ సంఘంలోని 10మంది సభ్యులు రూ.1,21,481 వడ్డీ రూపంలోనే కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
ఆ సంఘానికి జీరో వడ్డీ పథకం ఈ రెండున్నరేళ్లు కూడా అమలు చేసి ఉంటే.. సభ్యులు కట్టే వడ్డీ డబ్బులు మిగిలేవి.

ఆ సంఘంలోని పది మంది మహిళలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.12 వేల చొప్పున ఈ రెండున్నర ఏళ్లలో రూ.30 వేల దాకా మిగిలేవి. ఈ లెక్కన ఆ డ్వాక్రా సంఘానికి రూ.3 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన చంద్రబాబే.. ఎన్నికల సమయంలో ఆ సంఘంలోని పది మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.పది వేలు పసుపు–కుంకుమ (ప్రభుత్వ సర్క్యులర్‌ ప్రకారం ఇదీ అప్పే) పేరుతో ఇస్తున్నానని.. తానేదో గొప్పగా డ్వాక్రా మహిళలను ఆదుకున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ‘అన్న’ అని చెప్పుకుంటూ చెల్లెళ్లను ఇలా ఎవరైనా మోసం చేస్తారా చంద్రన్నా? అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. 

అప్పు 3లక్షలు.. వడ్డీతో కలిసి రూ.9.67 లక్షలైంది.. 
2014 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి తాము అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో ఆయనకే ఓట్లు వేశాం. ఆరునెలల్లోనే రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత మాట మార్చాడు. డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. దీంతో వడ్డీకి చక్రవడ్డీ కలిపి తడిసి మోపెడైంది. చెల్లించాల్సిన రూ. 3లక్షల అప్పు వడ్డీతో సహా కొండలా పేరుకుపోయింది. ప్రస్తుతం అసలు,వడ్డీ కలిపి రూ.9 లక్షల 67 వేలు చెల్లించాలని యూనియన్‌ బ్యాంక్‌ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.

చివరకు మా ఖాతాలో ఉన్న పొదుపు సొమ్ము రూ.19 వేలు కూడా జమ చేసుకున్నారు.  మా సంఘంలోని 9 మంది సభ్యులకు ఒక్కొక్కరిపై రూ.లక్ష అప్పు నెలకొంది. ఇంతపెద్ద మొత్తంలో రుణం సొమ్ము బ్యాంకుకు ఎలా చెల్లించాలో తెలియక మనోవేదనతో ఉన్నాం. యూనియన్‌ బ్యాంక్‌ నుంచి రుణాల సొమ్ము చెల్లించాలని రెండుసార్లు నోటీసులు అందుకున్నాం. ఆస్తులు జప్తు చేస్తామంటున్నారు. రుణమాఫీ అవుతుందని నమ్మించిన సీఎం చంద్రబాబు చివరకు మాఫీ చేయకుండా తీవ్ర అన్యాయం చేసారు. 
– జంపరంగి వనజ, ఉమానీలకంఠేశ్వర డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు, అడ్డుమండ, హుకుంపేట మండలం 

ఒక్క పైసా రుణమాఫీ కాలేదు  
నాకు గ్రామంలో 9 ఎకరాలు ఉంది. పంటల పెట్టుబడి కోసం మండల కేంద్రం గార్లదిన్నెలో కెనరా బ్యాంకులో  పట్టాదారు పాసుపుస్తకాలు తాకట్టు పెట్టి రూ. 50వేలు క్రాప్‌లోన్‌ తీసుకున్నా. 2014 ఎన్నికలప్పుడు 
బ్యాంకు రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ టీడీపీ ప్రభుత్వం రైతుకుఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదు. బ్యాంకు అధికారులను సంప్రదిస్తే నీకు రుణ మాఫీ కాలేదని, క్రాప్‌లోన్‌ వడ్డీ, అసలుతో కలిపి కట్టాలన్నారు. 
– రాజశేఖర్, బూదేడు, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా 

రూ.45వేలు అప్పు చేసి సర్టిఫికెట్లు తెచ్చుకున్నా.... 
నేను ఒంగోలులోని రావు అండ్‌ నాయుడు ఇంజనీరింగ్‌ కళాశాలలో.. 2012–2016 వరకూ చదివి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్నా. 2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ పధకం పడకేసింది. నాలుగేళ్లకు గాను రూ.1,45,000 ఫీజురీయింబర్స్‌మెంటు రావాల్సి ఉండగా.. కేవలం లక్ష రూపాయలు ఇచ్చారు. చివరి రెండేళ్లలో రూ.45వేలు విడుదల చేయలేదు. దీంతో కళాశాల యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుచేసి డబ్బులు తీసుకువెళ్లి కళాశాలలో కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకున్నా..  
– గోసుల రాజశేఖరరెడ్డి, ఆత్మకూరు(ఉలవపాడు మండలం)  

మరిన్ని వార్తలు