కరడుగట్టిన విలన్‌లా చంద్రబాబు

5 Jun, 2018 16:32 IST|Sakshi

ప్రకాశం జిల్లా: కరుడుగట్టిన విలన్‌లా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ప్రకాశం జిల్లాలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో వైఎస్సార్సీపీ అగ్రనేతలు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు భ్రమలు కల్పించి..పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అబద్దాలు ప్రచారం చేస్తూ చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు.

ఆత్మన్యూనత భావాన్ని వీడి పార్టీ గెలుపుకోసం కృషిచేయాలని పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీది ఒంటరి పోరేనని, వాళ్లతో వీళ్లతో పొత్తులు ఉంటాయనే ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. బూత్ లెవెల్ కన్వీనర్ల పాత్ర అమోగమని, ఏమరు పాటు వద్దు.. ప్రతి ఓటు విలువైనదని గుర్తెరగండని సూచించారు. వైఎస్‌ జగన్‌కి ప్రజల్లో ఆదరణ బాగా పెరిగింది..కష్ట పడితే విజయం తథ్యమని అన్నారు. పార్టీ అధినేత జగన్, నియోజక వర్గ ఇంచార్జి, బూత్ లెవెల్ కన్వీనర్లు, ఈ ముగ్గురే నా దృష్టిలో కీలకమైన వ్యక్తులని చెప్పారు. సరైన వ్యక్తులను బూత్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాలని సూచించారు. నవరత్నాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లండని చెప్పారు.

వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. బూత్ కన్వీనర్లు క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యేందుకు ఐక్యంగా కృషి చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జగన్‌కు 68 శాతం ప్రజల ఆదరణ ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని, దీన్ని ఓట్ల రూపంలో మలచడంలో బూత్ కమిటీలే కీలకమన్నారు. జిల్లాలో సహకార సంస్థలను నాశనం చేశారని, కో ఆపరేటివ్‌ బ్యాంకును నిలువు దోపిడీ చేశారని విమర్శించారు. డీసీఎంఎస్‌లో నిధులు నొక్కేసి అడ్రస్ లేకుండా చేశారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో కులమతాలకు అతీతంగా ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దారని అన్నారు.

వైస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..సింహం ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, జగన్ ఎవరి పొత్తు కోసం పాకులాడటం లేదని, అవకాశం పొత్తులు కోసం అర్రులు చాచేది చంద్రబాబు నైజమని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు