‘ప్రత్యేక హోదా కోసమే జగన్‌ కీలక నిర్ణయం’

14 Feb, 2018 12:21 IST|Sakshi

చంద్రబాబుకు, టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు

డ్రామాలు మావి కాదు..మీవి

ఎంపీల నిర్ణయాన్ని కించపరుస్తున్నారు

టీడీపీ-బీజేపీ కలిసి ప్రత్యేక హోదా అంశాన్ని భూస్థాపితం చేస్తున్నాయి

సీఎం మాటలు వింటుంటే బాధ కలుగుతుంది

పదవులు త్యజించడం డ్రామానా

సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పోరాటం మరిం‍త ఉధృతం చేయడం, పార్టీ ఎంపీల రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారని ఆయన అన్నారు. అంబటి రాంబాబు బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘జగన్‌ నిర్ణయాన్ని అనేకమంది స్వాగతించారు.

కానీ టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఎంపీలు తమ పదవులు తృణప్రాయంగా వదులుకుంటుంటే... వారిని కించపరచడం ప్రత్యేక హోదాను అవమానించడమే. బీజేపీ-టీడీపీ కలిసి ప్రత్యేక హోదాను భూస్థాపితం చేస్తుంటే...రాష్ట్రాభివృద్ధి కోసం మా ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం. ప్రధాని ప్రసంగం సమయంలో మా ఎంపీలు నిరసన తెలిపితే ...టీడీపీ ఎంపీలు మాత్రం మౌనంగా కుర్చీల్లో కూర్చున్నారు.

పదవులు త్యజించడం డ్రామానా, మీరు మాత్రం మంత్రి పదవులు మాత్రం వదులుకోరు. డ్రామాలు మావి కావు..మీవి. పార్లమెంట్‌ బయట మీ ఎంపీలు డ్రామాలు, లోపల ఎంపీ గల్లా జయదేవ్‌ డ్రామా, అది నాటకం కాదా?. ఒక్క క్షణం కూడా పదవులు వదులుకోలేని మనస్థత్వం చంద్రబాబుది. విబజన హామీలపై కోర్టుకెళ్తామంటూ చంద్రబాబు లీకులు ఇస్తున్నారు. కేంద్రంలో ఉండి కోర్టుకెళ్తామని డ్రామలెందుకు? మీ డ్రామాలు ఆరుకోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రం అన్యాయం చేస్తే మరి అదే కేంద్రంలో ఎందుకు మంత్రులుగా కొనసాగుతున్నారు. హోదా కోసం మేము అలుపెరగని పోరాటం చేస్తున్నాం.

మీలా కాదు...అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు చేయి చేయి కలిపి ముందుకు రావాలి. ప్రతి తెలుగు గుండె ఒక్కటిగా ముందుకు సాగుదాం. పోరాటం అంటే పిచ్చి వేషాలు వేయడం, గుండు చేయించుకోవడం కాదు. చంద్రబాబు చౌకబారు విమర్శలు మానుకో. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీరు కూడా మంత్రి పదవులకు రాజీనామాలు చేయండి. ప్రత్యేక హోదా కోసం అందరం పిడికిలి బిగిద్దాం. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా హోదాపై మా పోరు కొనసాగుతుంది. హోదా సాధించేవరకూ రాజీలేని పోరాటం చేస్తాం.’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు