దొంగ ఓట్ల దొరబాబు

17 Mar, 2019 10:04 IST|Sakshi

నాడు, నేడు టీడీపీది అదే తీరు

2004 ఎన్నికలకు ముందూ ఇదే తరహా

పోకూరు గ్రామంలో 1270 ఓట్ల తొలగింపు

భీమవరంలో ఒకే ఇంట్లో 115 ఓట్లు సృష్టి

పేదలు ఓటేయడానికి వీల్లేకుండా పోలింగ్‌ బూత్‌ల మార్పు

కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో 64.53 లక్షల ఓట్ల తొలగింపు

నంద్యాల ఉప ఎన్నికలో 16 వేల ఓట్లు తొలగింపు ఆరోపణలు

ఎన్నికల్లో గెలవడం ముఖ్యం. ఎలాగన్నది అనవసరం. ఇదీ చంద్రబాబు సిద్ధాంతం. తలపడిన  ప్రతి ఎన్నికలోనూ ఏ తొండాట ఆడైనా సరే గెలవాలనే లక్ష్యంతోనే చంద్రబాబు వ్యవహరిస్తారనడానికి మొన్నటి నంద్యాల ఉప ఎన్నిక సహా గతంలోనూ ఎన్నో తార్కాణాలు. మరీ ముఖ్యంగా తాను సీఎంగా వ్యవహరిస్తూ ఎన్నికలకు వెళ్లినప్పుడల్లా బోగస్‌ ఓట్లు చేర్పించడమో, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓట్లను జాబితా నుంచి తొలగింపజేయడమో కొనసాగాయి. తాజా ఎన్నికల నేపథ్యంలో... 2004కు ముందు జరిగిన తతంగాన్ని ఓసారి çపరిశీలిస్తే తెలుగుదేశం గుట్టంతా తెలిసిపోతుంది. అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం నిబద్ధత, ప్రతిపక్షాలన్నీ ఏకతాటి పైకి వచ్చి ప్రశ్నించడంతో బాబు సర్కారు వెనక్కుతగ్గక తప్పలేదు. తాజాగా ప్రతిపక్ష పార్టీ అనుకూలుర ఓట్లను తొలగించడానికి... రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను ఐటీ గ్రిడ్స్‌ అనే సంస్థకు అందజేయడం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ నైజాన్ని చాటుతోంది.

బోగస్‌ ఓట్లు చేర్పింపు, ప్రత్యర్థి పార్టీల అనుకూలుర ఓటర్లను జాబితా నుంచి తొలగింపు, తప్పుడు ఫిర్యాదులు, అనుకూలమైన ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, పేదలు, బడుగు బలహీన వర్గాలను పోలింగ్‌కు రాకుండా అడ్డుకోవడం, దాడులు, దౌర్జన్యాలు వంటి వ్యవహారాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఇప్పుడు సైతం ప్రజా వ్యతిరేకత నిండుగా మూటగట్టుకున్న బాబు సర్కారు 2019 ఎన్నికల్లో గెలుపు అసాధ్యమనే నిర్ధారణకు వచ్చి దొంగ మార్గాలను ఎంచుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిని బలపరిచే ఆధారాలు, ఉదాహరణలను రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అవేంటంటే..!

పరిశీలనతో బట్టబయలు
1999 ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే, తాము బలంగా కనిపించినప్పటికీ ఎందుకు ఓడిపోయామా? అని ప్రతిపక్ష నేతలు ఆలోచనలో పడ్డారు. దీంతో బూత్‌లు/ గ్రామాల వారీ ఓట్ల సరళి పరిశీలనకు దిగారు. బోగస్‌ ఓట్లతో టీడీపీ గెలుపొందిందని గుర్తించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీలు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశాయి. బోగస్‌ ఓట్లతో గెలవాలన్నదే బాబు ప్లాన్‌ అని అప్పట్లో డి.శ్రీనివాస్, అసదుద్దీన్‌ ఒవైసీ, బీవీ రాఘవులు, సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు ఆరోపించారు. దీంతో ఎన్నికల సంఘాలు విచారణ చేపట్టాయి. దేశవ్యాప్తంగా జనాభాలో సగటున 62 నుంచి 68 శాతం ఓటర్లుండగా ఏపీలో మాత్రం 72.5 శాతం ఓటర్లున్నారని తేలడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ఘాంతపోయింది.

పోలింగ్‌ కేంద్రాల మార్పు మరో కుయుక్తి
తమకు మద్దతు ఇవ్వరనే అనుమానాలున్న వర్గాలకు చెందిన ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాలను అక్కడినుంచి మార్పించడం చంద్రబాబు సర్కారుకు అలవాటు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాల నివాస ప్రాంతాల వద్ద ఉండే కేంద్రాలను తరలించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. టీడీపీకి మద్దతుగా నిలిచే సామాజిక వర్గాల ఆవాసాల సమీపంలో కొత్తగా పాఠశాల భవనాలు, సామాజిక భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాలు కట్టించడం పోలింగ్‌ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేయడమనే కుటిల వ్యూహం నాడు కొనసాగింది.
 

నంద్యాల ఉప ఎన్నికలోనూ...
నంద్యాల ఉప ఎన్నికలో 16 వేల ఓట్లు గల్లంతయ్యాయని ఓటర్లు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. తమ ఓట్లు లేవంటూ పలువురు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆందోళనలకు దిగారు. తన అధికారంతో చంద్రబాబు... ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓటర్లను తొలగించారని భావిస్తున్నట్లు అక్కడి నాయకులు ‘సాక్షి’కి చెప్పారు.

బోగస్‌ ‘బాబో’తం
అప్పట్లో రాష్ట్రంలో 5.49 కోట్ల మంది ఓటర్లుండగా కొత్తగా హక్కు కోసం 54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో అధికం బోగస్‌వని తేలాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 7,88,417 మంది ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోగా 4.38 లక్షల దరఖాస్తులు అనర్హమైనవని తిరస్కరించారు. నాటి సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుతో పాటు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ బోగస్‌ దరఖాస్తులు పెద్దఎత్తున తిరస్కరణకు గురయ్యాయి. ఆ సమయంలో కూడా చంద్రబాబు... ‘అనర్హుల పేరిట ఓటర్ల పేర్లు తొలగిస్తే అడ్డు చెప్పండి. ఆందోళనలు చేయండని’ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి, ఎన్నికల సంఘం వద్దకు తన ఎంపీలను పంపి హడావుడి చేశారు. చివరకు ఈసీ 64.53 లక్షల బోగస్‌ ఓట్లను తొలగించింది. 28.86 లక్షల దరఖాస్తులను తిరస్కరించింది. ఈ బోగస్‌ బాబోతానికి పలువురు అధికారులు బలైపోవాల్సి వచ్చిందని, పదిమందిపైగా ఎమ్మార్వోలు సస్పెన్షన్‌కు గురయ్యారని కొందరు నాయకులు గుర్తు చేస్తున్నారు.

నరసరావుపేటలో అరాచకాలకు అంతే లేదు...
‘నరసరావుపేట నియోజకవర్గంలో బోగస్‌ ఓట్ల సంఖ్య అధికంగా ఉంది. వెంటనే విచారణ బృందాలను పంపి పరిశీలన చేయించండని’ మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి... ఆనాటి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అ«ధికారి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో 2,98,360 మంది జనాభా ఉంటే 2,24,602 మంది ఓటర్లున్నారని వివరించారు. జనాభాతో పోల్చితే... తురకపాలెంలో 99 శాతం (జనాభా 837, ఓటర్లు 836) ఓటర్లు, కండ్లగుంటలో 80, యల్లమందలో 93, కర్లగుంటలో 89 శాతం మంది ఉన్నారంటూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

12 సార్లు ఫిర్యాదులు చేశా 
కందుకూరు నియోజకవర్గంలో బోగస్‌ ఓట్లను గ్రామాలవారీగా గుర్తించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా తొలుత అంగీకరించలేదు. ఆధారాలు కావాలని 11సార్లు వెనక్కు పంపారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన కుటుంబంలో 22 మంది సభ్యులుండగా 80పైగా ఉన్నట్లు ఆధారాలు అందజేశా. చివరకు అంగీకరించి చర్యలకు ఉపక్రమించారు. అప్పటి కలెక్టర్‌... పోకూరు అనే గ్రామంలో స్వయంగా విచారించి 1,270 ఓట్లు బోగస్‌ ఓట్లను తొలగించారు. –మానుగుంట మహీధర్‌రెడ్డి, మాజీ మంత్రి 

వామ్మో కోడెల
ఎన్నికల క్రతువులో అన్యాయాలు, అక్రమాలు చేయడంలో కోడెల శివప్రసాదరావు దిట్ట. 1999 ఎన్నికల్లో నరసరావుపేటలో నాపై ఆయన గెలిచారు. కాంగ్రెస్‌కు బలమైన గ్రామాల్లోనూ ఓట్లు తగ్గడంతో ఏదో మోసం జరిగిందని గుర్తించా. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లను ఒకటికి పలుసార్లు కలిసి ఈ విషయాలనే వివరించా. అప్పటి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) జేఎం లింగ్డో స్పందించి... ఈసీ కమిషనర్‌ కేజేరావును నరసరావుపేట నియోజకవర్గ పర్యటనకు పంపారు. బోగస్‌ ఓట్లు తొలగింపును అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కానీ, లింగ్డో పట్టుదల వదల్లేదు. అనంతరం రాష్ట్రంలో 64.53 లక్షల బోగస్‌ ఓట్లు తీసేశారు. తరువాత జరిగిన 2004 ఎన్నికల ఫలితాలు ఏమిటో తెలిసిందే. – కాసు వెంకట కృష్ణారెడ్డి , మాజీ మంత్రి
ఉదాహరణలివిగో..

  • ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామంలో అప్పటి కలెక్టర్‌... 1270 బోగస్‌ ఓట్లను తొలగించారు. అదే రీతిలో నియోజకవర్గంలో పరిశీలింపజేసిన ఆయన 33 వేల ఓట్లు పైగా తీసేయించారు. కొండెపి నియోజకవర్గంలో 36 వేలు, కనిగిరిలో అంతకంటే ఎక్కువే దొంగ ఓట్లను తొలగింపజేశారు.
  • హైదరాబాద్‌ శివారు శేరిలింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1,51,000 మంది జనాభా ఉండగా ఓటర్లేమో 1,56,000 మంది నమోదయ్యే అవకాశాలను ఈసీ గుర్తించింది.
  • హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ ఎంఐజి కాలనీలోని 1061 నంబరు ఇంట్లో నాలుగు గదులుంటే... నమోదైన ఓటర్ల సంఖ్య మాత్రం 105.
  • నల్గొండ జిల్లాలో పాఠశాల విద్యార్థులు కూడా ఓటర్ల జాబితాలోకి ఎక్కారు. ఇందులో 4, 5వ తరగతి చదువుతున్న వారూ ఉండటం గమనార్హం.
  • భీమవరంలో ఒకే ఇంటి నెంబరు (27–17–55/1 అప్పటిది)లో 115 ఓట్లు ఉన్నాయి. అదే ఇంటినుంచి మరో 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఇంటిని నాటి కాంగ్రెస్‌ నాయకుడు గ్రంధి శ్రీనివాస్‌ పరిశీలించగా ఒక వృద్ధురాలు, మరో ముగ్గురు మాత్రమే నివాసం ఉంటున్నారు. ఇవన్నీ చంద్రబాబు సర్కారు హయాంలో జరిగినవే. నాడు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైనవే.

– నాగా వెంకటరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి 

మరిన్ని వార్తలు