ప్రధాని రాకకు వ్యతిరేకంగా ర్యాలీ

24 Dec, 2018 03:03 IST|Sakshi

ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాలుగున్నరేళ్లు ఇబ్బంది పెట్టారు 

జనవరి ఒకటో తేదీన నిరసన ర్యాలీ చేస్తా 

ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి 

విభజన చట్టం, హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వస్తామంటున్నారని.. ఆయన ఎందుకు వస్తున్నారని.. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఎలా వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ చట్టం, సంబంధిత హామీల అమలుపై ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా అందులో పేర్కొన్న అంశాలపై ఆయన మాట్లాడుతూ.. చచ్చామో లేదో చూడ్డానికి ప్రధాని వస్తారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాలుగున్నరేళ్లు ఇబ్బందులు పెట్టారని ఆ విషయాలన్నీ తెలిపేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇది అసాధరణమైన అంశం.. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి జీవన్మరణ సమస్యని చెప్పారు. వాటి గురించి గట్టిగా అడిగితే అణగదొక్కాలని చూశారని అందుకే కేంద్రం నుంచి తాము బయటకు వచ్చామని చెప్పారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొదట చెప్పింది బీజేపీయేనని, కానీ.. అది ఇవ్వకుండా అమిత్‌ షా, బీజేపీ ఇతర నేతలు ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. రాజధానికి నిధులివ్వలేదని, లోటు బడ్జెట్‌ను భర్తీ చేయలేదని, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారని తెలిపారు. రాజధానికి శంకుస్థాపన చేసిన మోదీ.. చెంబు నీళ్లు, మట్టి ఇచ్చి వెళ్లారని, తాను పునాదులు వేసిన దానికీ నిధులివ్వలేదన్నారు. పటేల్‌ విగ్రహానికి రూ.2,500 కోట్లు ఇచ్చారని, ద్వారకాలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.27 వేల కోట్లు ఇచ్చారని, కుంభమేళాకు రూ.1,200 కోట్లు ఇచ్చారని.. కానీ అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లే ఇచ్చారని చెప్పారు. సింగపూర్‌కు విమానం కావాలని అడిగితే అడ్డంకులు సృషించారని, రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులను కూడా నియమించలేదన్నారు. షెడ్యూల్‌ 10 సంస్థల్లో ఒక్కటి కూడా సరిచేయలేదని తెలిపారు. ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కూర్చోబెట్టి ప్రధాని మాట్లాడలేదన్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండున్నరేళ్లు పోరాటం చేశామని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రానికి న్యాయం చేయాలని తాను పోరాటానికి దిగాక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి మద్దతిస్తున్నారని ఆరోపించారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్‌తో కలిశామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్, కవిత మొదట అడిగారని, కానీ.. తెలంగాణ ఎన్నికల్లో యూటర్న్‌ తీసుకున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎందుకు యూటర్న్‌ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ, ఈడీతో దాడులు చేయిస్తున్నారన్నారు. కడప ఉక్కు కర్మాగారం శంకుస్థాపనకు తామే సమాయత్తం అవుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గుజరాత్‌కు పన్నెండేళ్లపాటు సీఎంగా ఉన్న మోదీ ఆ రాష్ట్రానికి ఏమీ చేయకుండా నినాదాలతో కాలం గడిపారని బాబు విమర్శించారు. ఏపీలో బోలెడు మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు వస్తున్నారని, గుజరాత్‌లో ఎంతమంది ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో కూడా గుజరాత్‌ కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని, హైదరాబాద్‌ బంగారు గుడ్లు పెట్టే బాతని.. దాని వెనుక తన కృషి ఉందని అన్నారు.

అందరూ కలిసి టీడీపీపై కుట్ర 
ఎన్నికల్లో బీజేపీ టన్నుల కొద్దీ నిధులు ఖర్చు పెడుతోందని.. తమపై  కేసీఆర్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, పవన్‌కళ్యాణ్‌లతో పాటు బీజేపీ వాళ్లు కలిసి కుట్ర చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోకుండా నిరసన ర్యాలీ చేపడతానన్నారు. ఇది మోడీ పర్యటనకు వ్యతిరేకమా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సూటిగా సమాధానం చెప్పకుండా మోసం చేస్తున్న పార్టీని నిలదీయడానికే చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కాగా, వరుసగా మరో తొమ్మిది శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు.  

విభజన చట్టంపై అందరికీ వివరిస్తాం : ప్రవీణ్‌
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాష్‌ విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర విభజన చట్టం అమలు పరిస్థితిని అందరి దృష్టికి తీసుకెళ్తామన్నారు. భవన్‌లోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో మధ్యాహ్నం సినిమా ప్రదర్శన సందర్భంగా విరామం సమయంలో శ్వేతపత్రాన్ని పంచిపెట్టారు.  

>
మరిన్ని వార్తలు