చంద్రబాబు ఇలా ఎందుకు చేశారు?: బొత్స

7 Feb, 2019 18:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ దివాళా తీసిందని  వైఎస్సార్‌ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు. 2 లక్షల 50 వేల కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టారని ధ్వజమెత్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌ నామస్మరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష కోసం టీడీపీ ప్రభుత్వం రైల్వేకు కోటి 38 లక్షల రూపాయల ప్రజాధనం చెల్లించిందని వెల్లడించారు. చంద్రబాబు సర్కారు తీసుకొచ్చిన కాపు రిజర్వేషన్ల బిల్లు మోసపూరితంగా ఉందన్నారు. పేద అగ్రవర్ణాల రిజర్వేషన్‌ను ఒక కులానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాపులకు ఐదు  శాతం కాదు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

వారం రోజుల పాటు జరిగిన శాసనసభ సభ సమావేశాల్లో తనను తాను పొడుగుకోవడానికే చంద్రబాబు సమయన్నాంతా వెచ్చించారని విమర్శించారు. టీడీపీని వ్యతిరేకించే సభ్యులను బెదిరించడానికి అసెంబ్లీని వేదికగా వాడుకున్నారని దుయ్యబట్టారు. తన రాజకీయ జీవితంలో ఇంత పొగరుగా ప్రవర్తించే సీఎంను చూడలేదన్నారు. అసెంబ్లీ ఔన్నత్యాన్ని చంద్రబాబు దిగజార్చారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టరాదని చెప్పిన చంద్రబాబు మరి ఏపీలో ఎలా పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టారని బొత్స సత్యనారాయణ నిలదీశారు.

మరిన్ని వార్తలు