తమ్ముళ్లకు తలంటిన చంద్రన్న!

7 Jun, 2018 12:30 IST|Sakshi

ఇన్‌చార్జి మంత్రిగా, జిల్లా అధ్యక్షునిగా మిమ్మల్ని చేయడం....నేను చేసిన పెద్ద తప్పు

పార్టీని భ్రష్టుపట్టించారని మండిపాటు

ప్రొద్దుటూరులో బస్సులో ప్రత్యేక క్లాస్‌

కలిసి ఉండండీ లేదంటే ఏం చేయాలో తెలుసు

 లింగారెడ్డి, వరదలకు హెచ్చరికలు  

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో రోజురోజుకు దిగజారిపోతున్న తెలుగుదేశం ప్రతిష్ట.. నిత్యం నేతల గొడవలు.. ఎంత ప్రచారం చేపట్టిన ప్రజాభిమానం పొందడంతో విఫలం. నిఘావర్గాల నివేదికలు వెరసి తమ్ముళ్లకు చంద్రన్న తలంటారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు మండలం నాగాయపల్లె గ్రామదర్శిని వెళ్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ బయలుదేరింది. కొద్దిదూరం వెళ్లగానే బస్సు నిలిపేశారు. బస్సులో ఉన్నవారిని దింపేసి, ముందుసీట్లో ఉన్న సీఎం వెనుక వైపునకు వెళ్లారు. బస్సులోపలికి ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని పిలిపించారు. ప్రభుత్వ నిఘా వర్గాల నివేదికలను దృష్టిలో ఉంచుకొని మీ ఇద్దర్ని ఇక్కడ పదవుల్లో పెట్టడం తాను చేసిన పెద్ద పొరపాటు అంటూ సీఎం మండిపడ్డట్లు తెలుస్తోంది.

ప్రతి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు వర్గ విభేదాలు తీవ్రం అవుతుంటే మీరేం చేస్తున్నారు. పరిష్కరించాల్సింది పోయి, ఏదో వైపు మీరు మొగ్గు చూపుతూ పరిస్థితిని మరింత జఠిలం చేస్తున్నారని నిలదీసినట్లు సమాచారం. బద్వేల్‌లో ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ నేత విజయజ్యోతి ఇద్దరిని టార్గెట్‌ చేస్తే మీరు ఇచ్చే మేసేజ్‌ ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగులో గ్రూపు విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోయారు. ఒక వర్గానికి అనుగుణంగా పనిచేయడం ఏ మేరకు సబబు. పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు అంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు సంధించడంతో ఇద్దరు నాయకులు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేయబోగా, అతని కంటే అనుభవం లేదు. మీ అనుభవం ఏం ఏడ్చింది అనడంతో కిమ్మనకుండా ఉండిపోయినట్లు సమాచారం.

కలిసి పనిచేయండి..
ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహారం అయ్యాక ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డిలను బస్సులోకి పిలిపించినట్లు సమాచారం. ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలని, మీరు కలిసి పనిచేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసని బాబు ముఖాన్నే చెప్పినట్లు సమాచారం. లింగారెడ్డి ఏదో చెప్పబోయేందుకు ప్రయత్నించగా మంత్రి, జిల్లా అధ్యక్షుడు ఇద్దరితో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇకపైన విభేదాలంటూ రచ్చకెక్కితే సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. దాదాపు 15 నిమిషాలు బస్సులో ఇదే వ్యవహారం నడిచింది.

అక్కడ తమ్ముళ్లు..ఇక్కడ విద్యార్థులు
ప్రొద్దుటూరులో తమ్ముళ్లకు తలంటిన చంద్రన్న నవ నిర్మాణ దీక్షలో విద్యార్థులకు క్లాస్‌ తీసుకున్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వివరించేంత వరకూ ఓపిగ్గా సీఎం ప్రసంగం వీక్షించసాగారు. కేంద్రప్రభుత్వం, బీజేపీ నాయకత్వం, వైఎస్సార్‌సీపీ విమర్శించడం సాగిస్తుంటే విద్యార్థులు సీట్లుల్లోంచి లేచి వెళ్లిపోవడం ఆరంభించారు. ఇది గమనించిన పోలీసు అధికారులు విద్యార్థులను కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. నేను చేసే ప్రయత్నానికి మీరు మద్దతు ఇస్తారా...లేదా... ఇస్తే చప్పట్లు కొట్టండి...అంటూ పలుమార్లు విద్యార్థులతో అడిగి చప్పట్లు కొట్టించుకున్నారు. సీఎం ప్రసంగం పూర్తయ్యే సరికి సభలో దాదాపు 80 శాతం వెళ్లిపోయారు. కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయినప్పటీకీ ప్రసంగంలో మార్పులేదు. సీఎం చెప్పాలనుకున్న విషయాలన్నీ పూర్తిగా చెప్పేశారు. ప్రజాధనంతో కార్యక్రమం నిర్వహిస్తూ ఎన్నికల్లో ఓడించడండి అంటూ పిలుపునిచ్చారు. ఉన్నతాధికారుల సాక్షిగా రాజకీయ అంశాలకు వేధికగా నవనిర్మాణ దీక్ష నిలవడం విశేషం. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా