నన్ను గెలిపించుకునే బాధ్యత మీపై లేదా?

29 Dec, 2018 04:36 IST|Sakshi

అనకాపల్లి మెగా గ్రౌండింగ్‌ మేళాలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

సాక్షి, విశాఖపట్నం: ‘‘ఇన్ని చేసిన నేను కూడా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కోవాలా? నన్ను మళ్లీ గెలిపించుకోవల్సిన బాధ్యత మీపై లేదా?’’ అంటూ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏ ముఖ్యమంత్రి చేయనంతగా తాను చేశానని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించానని చెప్పుకొచ్చారు. తాను చేసిన మేలులను ప్రజలు మర్చిపోతున్నారని.. ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పడిపోతున్నారని వ్యాఖ్యానించారు. తనను మళ్లీ గెలిపించుకోకపోతే అభివృద్ధి అంతా ఆగిపోతుందని, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలే నష్టపోతారని అసహనం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం అనకాపల్లి ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆదరణ– 3 మెగా గ్రౌండింగ్‌ మేళా సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ టీడీపీ కార్యకర్తలుగా మారాలని హుకుం జారీ చేశారు. చంద్రబాబునాయుడు ఆర్మీలో కానీ.. టీడీపీలోగానీ చేరాలని, తమ ప్రభుత్వం గెలుపుకోసం పని చేయాలని సూచించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష కట్టిందని, ప్రతిపక్ష పార్టీలతో లాలూచీ రాజకీయాలు చేస్తూ తనపై దాడులకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ కోసం మాట్లాడని వారు తనను విమర్శిస్తున్నారని, రాష్ట్రాన్ని ఆదుకోవల్సిన కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అయినా రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంపై రాజీలేని ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకే ఆదరణ పథకాన్ని మళ్లీ తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. తొలుత ఆదరణ పథకంతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు పనిముట్లు, రుణాలు పంపిణీ చేశారు. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీలో గానుగాటను పునఃప్రారంభించారు.

తుమ్మపాల వద్ద రూ.27 కోట్లతో నిర్మిస్తున్న ఆనకట్టకు శంకుస్థాపన చేశారు. ఈ సభలో మంత్రులు చినరాజప్ప, అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ పర్యాటక నగరం విశాఖపట్నమని, అలాంటి నగరంలో జపాన్‌ తరహా నాగరికత రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. జపాన్‌లో రోడ్లపై చెత్త వేయరని, ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయని, క్లీన్‌ సిటీగా పేరు తెచ్చుకున్న విశాఖలోనూ చెత్త కాగితాలు వేయొద్దని, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. శుక్రవారం సాయంత్రం సాగరతీరంలోని ఆర్కే బీచ్‌లో సీఎం విశాఖ ఉత్సవ్‌ను నగారా మోగించి ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు