మిమ్మల్ని ఫినిష్‌ చేసే రోజు వస్తుంది

26 Feb, 2020 05:21 IST|Sakshi
రోడ్‌ షోలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

రెండో రోజు కుప్పం పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు

సాక్షి, తిరుపతి: ‘‘తొమ్మిది నెలలపాటు నా గురించి ఎంత తవ్వినా బొచ్చు కూడా దొరకలేదు.. ఇప్పుడు కొత్తగా సిట్‌ వేశారు. ఐదేళ్లపాటు జరిగిన పనులన్నింటిపైనా విచారణ చేస్తారంట.. వీళ్లెవరూ నన్ను ఏమీ చేయలేరు.. మిమ్మల్ని ఫినిష్‌ చేసే రోజు వస్తుంది’’ అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర పదజాలంతో రాష్ట్ర సర్కారుపై మండిపడ్డారు. మంగళవారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో, మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే ఆ పథకాన్ని తాను కొనసాగించానని, అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తాను ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేసుకుంటూ పోతోందని వాపోయారు. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలో ప్రతీకారేచ్ఛ పెరుగుతోందని చెప్పారు. అమరావతి రెండు లక్షల కోట్ల ఆస్తి అని చెబుతూ.. మూడు రాజధానులు ఎక్కడా లేవని, జిల్లాకో రాజధాని.. అలా కాకపోతే మొబైల్‌ రాజధాని పెట్టండంటూ ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా గెలిచేది తామేనన్నారు. తన జీవితంలో ఏ సభలకు రానంతంగా కుప్పంలో ప్రజలనుంచి స్పందన వచ్చిందని కితాబిచ్చుకున్నారు. 

టీడీపీ ప్రభుత్వంలోనే రూ. లక్ష లంచం ఇచ్చాం 
కుప్పం నియోజకవర్గం విజిలాపురం కూడలిలో ప్రసంగించిన చంద్రబాబుకు.. సొంత పార్టీ కార్యకర్త నుంచే చేదు అనుభవం ఎదురైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తిట్టించే ప్రయత్నంలో భాగంగా మైక్‌ ఇచ్చి మాట్లాడమని చంద్రబాబు స్థానికులకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో వెంకటాచలం అనే రైతు మాట్లాడుతూ.. తన భూమి వివరాలను ఆన్‌లైన్‌లోకి ఎక్కించడానికి లక్ష రూపాయలు లంచం ఇచ్చానని చెప్పాడు. చూశారా తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు ఆ అభాండాన్ని ప్రస్తుత ప్రభుత్వంపై వేయడానికి సిద్ధమవుతుండగా.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సార్‌ అని వెంకటాచలం చెప్పాడు. దీంతో చంద్రబాబునాయుడుతో పాటు టీడీపీ నాయకులు షాక్‌కు గురయ్యారు. వెంటనే చంద్రబాబు కలగజేసుకొని అప్పుడు నాకు చెప్పాల్సింది అంటూ సలహా ఇచ్చారు. వెంటనే టీడీపీ నేతలు రైతు మైక్‌ను లాగేసుకున్నారు. రూ. లక్ష లంచం తీసుకున్న టీడీపీ నాయకుడు చంద్రబాబు పక్కనే ఉండటంతో ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.

సాక్షి రిపోర్టర్‌పై టీడీపీ మూకల దాడి
కుప్పం(చిత్తూరు జిల్లా): విపక్షనేత చంద్రబాబు కుప్పం పర్యటన న్యూస్‌ కవరేజిలో ఉన్న సాక్షి డెప్యూటీ చీఫ్‌ రిపోర్టర్‌ తిరుమల రవిరెడ్డిపై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. మంగళవారం రాత్రి శాంతిపురంలో చంద్రబాబు దాదాపు గంట పాటు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో రోడ్డుపై రెండు వైపులా వాహనాలు భారీగా ఆగిపోయాయి. అదే సమయంలో బస్సులో వేచి ఉన్న వి.కోటకు చెందిన వ్యక్తి ‘గంటల తరబడి రోడ్డుపై పంచాయితీ చేస్తున్నారు’ అని అనడంతో తెలుగు తమ్ముళ్లు అతడిపై దాడికి తెగబడ్డారు. ఈ దృశ్యాలను తన ఫోనులో రికార్డు చేస్తున్న తిరుమల రవిరెడ్డిపైనా దాడి చేశారు. పోలీసులు కలుగజేసుకుని ఆయనను కాపాడారు.

>
మరిన్ని వార్తలు