డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు

17 Sep, 2018 05:19 IST|Sakshi

బాబ్లీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య

కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ అధికారంలోఉన్నది వారే

ఐదు నదులు అనుసంధానం చేస్తాం

వరద ముంపు నుంచి రాజధానికి రక్షణ

కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ప్రారంభం

సాక్షి, విజయవాడ: బ్యాంకులు దోచేసిన వారిని విదేశాలకు పంపేసి, బాబ్లీ కేసులో తనపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. బాబ్లీ కేసులో తమకు సంబంధం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చెబుతున్నారని, ప్రస్తుతం మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ ఏ పార్టీ ప్రభుత్వం ఉందని ప్రశ్నించారు. రాజధాని అమరావతిని వరద ముంపు నుంచి రక్షించేందుకు  మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని విజయవాడ సమీపంలోని సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్‌షాపు వద్ద సీఎం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబ్లీ విషయంలో తనకు  డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు.  

ఐదు నదులు అనుసంధానం చేస్తా
ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదుల్ని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న నదుల్ని కలిపి రాష్ట్రానికి నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 12 ప్రాజెక్టులు పూర్తి చేశామని, ఐదేళ్ల కాలంలో 45 ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా సాగుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కోండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మించడం ద్వారా రాజధాని ప్రాంతం వరద ముంపునకు గురికాకుండా కాపాడామని చెప్పారు. 22వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఇబ్బంది లేకుండా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం డిజైన్‌ చేశామని తెలిపారు.

మరిన్ని వార్తలు