నాకే పాఠాలు చెబుతారా!

22 Oct, 2019 05:05 IST|Sakshi

మాజీ సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ)/అమరావతి: రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న తనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాఠాలు నేర్పడం హాస్యాస్పదమని ప్రతిపక్ష నేత చంద్రబాబు  వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సీనియర్‌ నాయకుడైన దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డే నాకు ఒక లెక్క కాలేదు. చిన్న కుర్రాడివి నువ్వొక లెక్కా’ అంటూ విమర్శలు సంధించారు. ‘నీ రాజకీయాలు పులివెందులలో సాగుతాయి. రాష్ట్రమంతా ఇష్టమొచ్చినట్లు పాలిస్తానంటే కుదరదు.

రానున్న రోజుల్లో నీ లెక్క తేలుస్తా’ అని ధ్వజమెత్తారు. నవరత్నాలు ప్రజల పాలిట నవగ్రహాలుగా మారాయని, సచివాలయాలకు వైఎస్సార్‌సీపీ జెండా రంగులు వేయడం సరికాదని అన్నారు. గతంలో అభివృద్ధి చేసిన వాటిని కూల్చేయడం, రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఇరిగేషన్‌ పనులు నిలిపేయడం తప్ప వైఎస్‌ జగన్‌ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టలేదని విమర్శించారు. కాగా టీడీపీని యువరక్తంతో నింపడమే లక్ష్యంగా యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులు కేటాయిస్తామని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు