ప్రజల దృష్టి మరల్చడానికి నాటకాలు

19 May, 2020 04:51 IST|Sakshi

సీఎంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజం

పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తెచ్చి రాయలసీమకు నీరిచ్చామన్న మాజీ సీఎం

సాక్షి, అమరావతి: గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగిడిన సీఎం జగన్‌ ఇప్పుడు మళ్లీ ప్రజల దృష్టి మరల్చడానికి దొంగ నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. ఇద్దరం కలసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వారు గతంలో చెప్పారన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం పార్టీ సీనియర్‌ నాయకులతో ఆయన ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ఆయన ఏమన్నారంటే..  

► గతంలో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తెచ్చి రాయలసీమలో పంటలను కాపాడాం. ముచ్చుమర్రి లిఫ్ట్‌ స్కీమ్‌ పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు, బనకచర్లకు నీరు వాడుకోవచ్చు. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులన్నింటికీ నాంది పలికింది మేమే. 
► ఐదేళ్లలో 23 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం.  
► మాస్క్‌ అడిగినందుకే డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేశారు. తమ తప్పులు కప్పిపెట్టుకోడానికి కమిటీ వేసి మానసిక రోగిగా చిత్రించారు.  
► వలస కార్మికులను లాఠీలతో కొట్టిస్తారు, మళ్లీ వాళ్లే మానవత్వం చూపాలి అంటారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. 
► సీఎం జగన్‌కు చట్టంపై గౌరవం లేదు, రాజ్యాంగంపై విశ్వాసం లేదు. చట్టం ఎవరికైనా సమానమే. చట్టాన్ని ఉల్లంఘిస్తే కాపాడేందుకే కోర్టులు ఉన్నాయి. 
► కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్‌ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది. లాక్‌ డౌన్‌–2లో దేశంలో రోజుకు 14.3 శాతం కేసులు నమోదైతే, లాక్‌డౌన్‌–3లో రోజుకు 8.78 శాతం కేసులకు తగ్గాయి. కానీ మన రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. 
► బిల్డ్‌ ఏపీ స్కీమ్‌ను, సోల్డ్‌ ఏపీ చేశారు. 

మరిన్ని వార్తలు