లబ్ధిదారులంతా టీడీపీ జెండా పట్టేలా వెంటపడండి

18 Mar, 2019 03:56 IST|Sakshi

పసుపు–కుంకుమ తీసుకున్న డ్వాక్రా మహిళలతో ప్రచారం చేయించండి 

కార్యకర్తలకు టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబు సూచన 

ఎవరు ఎక్కువ మెజార్టీ ఇస్తే వారికే ప్రాధాన్యమిస్తానని వెల్లడి 

సేవామిత్రలు రూపొందించిన ఏపీ ప్రజల డేటాను కేసీఆర్‌ దొంగిలించారని ఆరోపణ

విశాఖ సిటీ/విజయనగరం రూరల్‌/కాకినాడ సిటీ/ద్వారకాతిరుమల: ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసేలా కార్యకర్తలు కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. లబ్ధిదారులంతా టీడీపీ జెండా పట్టుకునేలా కార్యకర్తలు వారి వెంటపడాలన్నారు. విశాఖలో ఆదివారం జరిగిన టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఎన్నికలు ముగిసే వరకూ టీడీపీ కోసం పనిచేయాలన్నారు. పింఛన్‌దారులు, రైతులు తనకే ఓటు వేయాలన్నారు. కేసీఆర్‌ పిలుపునిస్తే ఆ రాష్ట్ర ప్రజలు 85 సీట్లు కట్టబెట్టారని.. ఇప్పుడు తాను పిలుపునిస్తున్నానని మొత్తం 175 సీట్లలో టీడీపీకి విజయం కట్టబెట్టాలన్నారు. సేవామిత్రలు రూపొందించిన ఏపీ ప్రజల డేటాను కేసీఆర్‌ దొంగతనం చేశారని ఆరోపించారు. 

స్వార్థం లేని రాజకీయాలు చేస్తున్నా!
కేంద్ర ప్రభుత్వం నిధులివ్వకపోయినా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని సీఎం చంద్రబాబు చెప్పారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో ఆదివారం జరిగిన టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. సమర్థులైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినట్లు చెప్పారు. తాను, అశోక్‌గజపతిరాజు స్వార్థం లేని రాజకీయాలు చేస్తున్నామన్నారు. పేదరికం లేని ఆరోగ్యదాయక సమాజం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ధనవంతులు, సామాన్యులు పార్టీకి అండగా నిలవాలని కోరారు. కాగా, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు పదేపదే రాజకీయం చేస్తూ మాట్లాడారు. వివేకా హత్యపై ప్రతిపక్షం సీబీఐ ఎంక్వైరీ కోరడంలో అర్థం లేదన్నారు. కొద్దిరోజుల్లో నిజాలు బయటకు వస్తాయన్నారు. ఇదిలాఉండగా, చీపురుపల్లిలో కిమిడి కుటుంబానికి టికెట్టివ్వడాన్ని నిరసిస్తూ ఆ నియోజకవర్గ నాయకులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. 

ఎవరు ఎక్కువ మెజార్టీ ఇస్తే వారికే ప్రాధాన్యం..
ఏ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ మెజార్టీ ఇస్తారో.. వారికే ప్రత్యేక ప్రాధాన్యమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 150కిపైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం జరిగిన ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. టీడీపీని కాపాడుతూ వచ్చింది కార్యకర్తలేనన్నారు. ఏప్రిల్‌ నెలలో ఓవైపు ఎన్నికలు, మరోవైపు పసుపు–కుంకుమ డబ్బులతో డ్వాక్రా మహిళలకు పండగలా ఉంటుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. కేసీఆర్‌కు బలుపు ఉంటే తగ్గిస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

అన్నీ మర్చిపోండి.. మళ్లీ గెలిపించండి
గత ఐదేళ్ల కాలంలో కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించలేదని చంద్రబాబు పేర్కొన్నారు. అన్నీ మర్చిపోయి మళ్లీ గెలిపిస్తే.. రుణపడి ఉంటానన్నారు. సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను, కేసీఆర్‌ను, ‘సాక్షి’ మీడియాను టార్గెట్‌ చేస్తూ చంద్రబాబు గంటన్నరపాటు ప్రసంగించారు. దీంతో సభకు హాజరైన సగం మందిలో అత్యధిక శాతం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే లేచి వెళ్లిపోయారు. అయినా కూడా చంద్రబాబు తన ప్రసంగాన్ని నిర్విరామంగా కొనసాగించారు.

కష్టపడి పార్టీని గెలిపిస్తే భవిష్యత్‌లో ఎక్కువ సమయం కార్యకర్తలకే కేటాయిస్తానన్నారు. ప్రజల్ని మీరు చూసుకుంటే.. మిమ్మల్ని నేను చూసుకుంటానంటూ కార్యకర్తలతో చెప్పారు. ఏ జిల్లాలో.. ఏ నియోజకవర్గంలో అధిక మెజారిటీ తెస్తారో అక్కడి కార్యకర్తలను గుర్తించి, వారికి సన్మానం చేసి అండగా ఉంటానన్నారు. పసుపు కుంకుమ డబ్బులు తీసుకున్న డ్వాక్రా మహిళలు ప్రచారం చేసేలా కార్యకర్తలు చూడాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా మహిళలు ప్రచారం చేస్తున్నదీ.. లేనిదీ తెలుసుకుంటానని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు