వ్యవస్థలను మోదీ నాశనం చేస్తున్నారు

24 Oct, 2018 04:25 IST|Sakshi

     ఇందిరాగాంధీ హయాంలోనూ ఈ పరిస్థితి లేదు 

     పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదు 

     రిజర్వేషన్ల విషయంలో సమస్యలున్నాయి.. 

    వాటిని పరిష్కరించాక పంచాయతీ ఎన్నికలకు వెళతాం

     విశాఖపట్నంలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు 

సాక్షి, విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. దివంగత ఇందిరాగాంధీ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. విశాఖలో ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వచ్చిన ఆయన మంగళవారం ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరికాదని, 500, 2000 రూపాయల నోట్ల వల్ల జనానికి ఇబ్బందులే తప్ప దేశానికి ఏమీ ప్రయోజనం చేకూరలేదని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. అప్పట్లో పెద్దనోట్ల రద్దుకు నేనే సిఫార్సు చేశానని చెప్పిన మీరు ఇప్పుడిలా మాట్లాడడమేమిటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను పెద్ద నోట్ల రద్దుని దశలవారీగా అమలు చేయాలని సూచించానంటూ చంద్రబాబు మాటమార్చారు.

ప్రధాని మోదీతో తనకు వ్యక్తిగత ద్వేషంగానీ, విభేదాలుగానీ లేవని, రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధానితో విభేదిస్తున్నానని చెప్పారు. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అమరావతి వచ్చి కూడా శ్రీకాకుళం జిల్లా తుపాను బాధితుల పరామర్శకు రాకపోవడం రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. తిత్లీతో శ్రీకాకుళం జిల్లాకు రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై సీఎం స్పందించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, కానీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని సమస్యలున్నాయని, అవి పరిష్కరించాక ఎన్నికలకు వెళతామని చెప్పారు. వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ ద్వారా వచ్చే సంవత్సరానికి రూ.500 కోట్ల పెట్టుబడితో 75 కంపెనీలు రానున్నాయని, వీటితో 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. 


పెద్ద నోట్ల రద్దుకు మద్దతుగా 2016 నవంబర్‌ 8న ట్వీట్‌ చేసిన సీఎం. తర్వాత రోజు పత్రికల్లో ప్రచురితమైన కథనం 

మరిన్ని వార్తలు