అదృష్టం కలిసొచ్చి మోదీ ప్రధాని అయ్యారు

18 Sep, 2018 05:25 IST|Sakshi

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: ‘‘అదృష్ణం కలిసొచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. సోమవారం సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ మోదీ కంటే తానే సీనియర్‌ అని ఎక్కువ కాలం సీఎంగా, ప్రతిపక్ష నేతగా పనిచేశానని చెప్పుకొచ్చారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఒత్తిడి పెంచడంతో తనపై కక్ష పెంచుకున్నారని, కేసీఆర్‌కూ తనకూ మధ్య అగాధం పెంచేందుకు ప్రయత్నించడంతో పాటు కేసులు వేయడం కూడా ప్రారంభించారన్నారు. తనకు మెచ్యూరిటీ లేదని ప్రధాని మాట్లాడటం దేనికి సంకేతం అంటూ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయకపోవడంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. తాను ‘యు’ టర్న్‌ తీసుకున్నానని ప్రధాని పేర్కొన్నారని అయితే తాను ‘రైట్‌’ టర్నే తీసుకున్నానని వివరించారు. వాస్తవాలను అంగీకరించలేని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో కూర్చోవడానికి అర్హులు కాదన్నారు. 10 సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ 14 వ ఆర్ధిక సంఘం అభ్యంతరం చెప్పిందని చెప్పి మాట తప్పిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా రూ.2736.99 కోట్లు విడుదల కావాల్సి ఉందని, డీపీఆర్‌ ఇచ్చిన తరువాత కూడా నిధులు విడుదల చేయడం లేదన్నారు. డిసెంబర్‌లోగా ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

తెలుగుజాతి కోసమే బాబ్లీపై పోరాడామని చంద్రబాబు చెప్పారు. తెలుగుజాతి కోసం కలిసుందామని టీఆర్‌ఎస్‌ను చాలా సార్లు కోరామని చంద్రబాబు పేర్కొన్నారు. మొన్నటి వరకు హోదాకు సహకరించిన టీఆర్‌ఎస్‌... ఎన్డీఏతో విడిపోగానే ఆ పార్టీ వైఖరి మారిందన్నారు. కాగా ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. చంద్రన్న పెళ్లికానుక అగ్రవర్ణ పేదలకూ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆ కానుక అందజేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు