మోదీ.. ఓ కేడీ

4 Apr, 2019 05:54 IST|Sakshi
గుంటూరు జిల్లా నరసరావుపేటలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

ఎన్నికల ప్రచార సభల్లో విరుచుకుపడిన చంద్రబాబు 

నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే

వినుకొండ(నూజెండ్ల)/నరసరావుపేట/సాక్షి, నెల్లూరు/ఆత్మకూరు/కనిగిరి: తెలుగు గడ్డపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆటలు ఇక సాగనీయబోమని, ఆయన ఓ కేడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు, ప్రకాశం జిల్లా కనిగిరి, గుంటూరు జిల్లా వినుకొండ, నరసరావుపేటలో ఆయన పర్యటించారు. ఆయా కార్యక్రమాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు తనకు ఏటీఎం లాంటిదని ప్రధానమంత్రి మోదీ చెప్పడం సిగ్గుచేటని, పోలవరం ఏటీఎంకు నగదు ఇవ్వకుండా అడ్డుకుంది ఆయనేకదా అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలసిన నిధులను మోదీ అపేయడంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.

ప్రధానిమోదీ, కేసీఆర్‌ కలిసి తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, తనను రక్షించుకోవాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని చంద్రబాబు ప్రజలను వేడుకున్నారు. నదుల అనుసంధానానికి కేసీఆర్‌ అడ్డు పడుతున్నాడని ఆరోపించారు. మోదీ, కేసీఆర్, జగన్‌మోహనరెడ్డి కలిసి కుట్రలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ గురించి మాట్లాడుతూ..ఆయన ఇక అత్తారింటికి వెళ్లడమే మిగిలి ఉందన్నారు. తనకు సహకరిస్తే సైకిల్‌పై ఎక్కించుకుని వెళతానని, అడ్డు తగిలితే సైకిల్‌ కింద తొక్కించుకుంటూ వెళతానని బాబు హెచ్చరించారు. మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్‌ పెట్టి అదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.షెడ్యుల్‌ తెగలకు యానాదుల  కోసం ఓ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు.  

ఎన్నికల్లో లబ్ధికోసమే నిధులు విడుదల 
అత్యవసర ఖర్చుల కోసం ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ’ ద్వారా కేటాయింపులు చేస్తారని, అయితే ఈ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అన్నదాత సుఖీభవ, పసుపు–కుంకుమ పథకాలకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ద్వారా నిధులు కేటాయించడం సరికాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఏవీ స్వామి హైకోర్టుకు నివేదించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిధులను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, ఇలాంటి చెల్లింపులు చేయడం ఓటర్లను ప్రభావితం చేయడమేనన్నారు. దీనిపై పిటిషనర్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు. అందుకు సంబంధించిన ఫిర్యాదు కాపీని కోర్టుకు సమర్పించారు. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ అభ్యంతరం తెలిపారు.

పిటిషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన విషయాన్ని చెప్పలేదని, ఫైల్‌లో అందుబాటులో ఉన్న కాగితాలను ఇలా నేరుగా ఇచ్చేయడం సరికాదన్నారు. అలా అయితే ఈ వివరాలతో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేస్తామని స్వామి చెప్పారు. దీంతో కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా, రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు పసుపు–కుంకుమ కింద ఏప్రిల్‌ 5న మూడో విడతగా చెల్లింపులు చేయడం సరికాదని, ఈ చెల్లింపుల నిమిత్తం నిధులను విడుదల చేయకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు