మీరు ఓడిపోతే ఎలాగంటున్నారు

3 Feb, 2019 03:40 IST|Sakshi

మా పెట్టుబడుల మాటేమిటని విదేశీ పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు 

సర్వేలతో వైఎస్సార్‌సీపీ నేతలు సంబరపడుతున్నారు

నెలకు రూ.500 లెక్కన రైతులకు మోదీ ముష్టి ఇస్తారట

డ్వాక్రా మహిళలకు ఉచితంగానే రూ.10వేలు

కృష్ణాజిల్లా కేసరపల్లి పసుపు – కుంకుమ సభలో సీఎం చంద్రబాబు

సాక్షి, విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నోట ఓటమి మాట వచ్చింది. తాను విదేశాలకు వెళ్లినప్పుడు ‘ఈసారి ఎన్నికల్లో మీరు ఓడిపోతే మేము పెట్టిన పెట్టుబడులు ఏమవుతాయని’ చాలామంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని ఆయనన్నారు. ‘మా ప్రజలకు నేను అన్నీ చేస్తున్నాను.. ఓడిపోయే సమస్యే లేదు. తిరిగి అధికారంలోకి వస్తా’మని భరోసా ఇచ్చామని చెప్పారు. రేపు తమ ప్రభుత్వం వచ్చాకే పెట్టుబడి పెట్టేందుకు ఒకరిద్దరు వాయిదా వేసుకుంటున్నారన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో శనివారం పసుపు – కుంకుమ కార్యక్రమం జరిగింది. ఇందుకు ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో తాను వోక్స్‌ వ్యాగన్‌ పరిశ్రమను తీసుకురావడానికి ప్రయత్నించానని, అయితే.. 2004లో తాను ఓడిపోయిన తరువాత కాంగ్రెస్‌ నేతలు అక్కడ పనిచేసే అధికారులకు లంచాలు ఇచ్చి మొత్తం చెడగొట్టారన్నారు. ఇటువంటి నాయకులు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల వచ్చిన జాతీయ సర్వేలలో టీడీపీ ఓడిపోయే అవకాశం ఉందన్న అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు సర్వేలు చేయించి గెలుస్తామని పగటి కలలు కంటున్నారన్నారు. ‘నేను మీ కోసం ఐదేళ్లు కష్టపడ్డా.. ఈ అన్న కోసం 75 రోజులు కష్టపడమని కోరుతున్నా’నని సభను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. 

మోదీ నెలకు రూ.500 ముష్టి ఇస్తారట
తాను రైతులకు రూ.లక్షన్నర రుణమాఫీ చేస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ  నెలకు ముష్టి రూ.500 చొప్పున ఐదెకరాలలోపు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6వేలు ఇస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలుచేయకుండా.. చివరకు ఓటాన్‌ బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించారని ఆరోపించారు. ఈ గడ్డ మీద పుట్టిన వారు ఎవ్వరైనా కేంద్రానికి సహకరించినా.. ప్రజానీకానికి వ్యతిరేకంగా పనిచేసినా ఖబడ్డార్‌ అని బీజేపీ నేతల్ని హెచ్చరించానని చంద్రబాబు తెలిపారు. అలాగే, కోడికత్తి డ్రామా ఆడుతున్నారని, సిట్‌ ఇచ్చిన రిపోర్టునే ఎన్‌ఐఏ కూడా ఇచ్చిందన్నారు. హోదా ఇస్తామని కాంగ్రెస్‌ హమీ ఇవ్వడంవల్లే కాంగ్రెస్‌తో పనిచేస్తున్నామని చెప్పారు.

ఆటో, ట్రాక్టర్‌ డ్రైవర్లు టీడీపీకి పనిచేయాలి
కాగా, డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ కింద మూడు విడతలుగా చెల్లించనున్న రూ.10వేలు ఉచితమేనని, అప్పుగా కాదని సీఎం చెప్పారు. వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పింఛన్‌ను పదిరెట్లు పెంచామని చెప్పారు. ఆటోలకు, ట్రాక్టర్లకు లైఫ్‌ట్యాక్స్‌ రద్దు చేసినందున ఆటో, ట్రాక్టర్‌ డ్రైవర్లు టీడీపీకీ అనుకూలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జెడ్పీ చైర్మన్‌ గద్దె అనూరాధ తదితరులు పాల్గొన్నారు.  ఇదిలా ఉంటే.. తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసం వద్ద సన్మానం చేశారు. మీరు ఆటో నడుపుతుంటే తాను రాష్ట్రాన్ని నడుపుతున్నానని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లంతా తమ ఆటోలకు టీడీపీ పచ్చ జెండా కట్టుకుని తిరగాలన్నారు. 

మరిన్ని వార్తలు