కేసులకు భయపడను!

16 Sep, 2018 05:15 IST|Sakshi

     ఎచ్చెర్ల సభలో సీఎం చంద్రబాబు

     కేంద్రాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు

     ఎనిమిదేళ్ల నాటి బాబ్లీ కేసు తిరగతోడి వారెంటు పంపారని విమర్శ

     నాగావళి నది వద్ద జలసిరికి హారతి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తాను కేసులకు భయపడనని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి కేసును తిరగదోడి అరెస్టు వారెంటు పంపించారని అన్నారు. తాను తగ్గి అడిగినా ప్రధాని మోదీ కనికరం చూపించలేదని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు శనివారం మధ్యాహ్నం వచ్చారు. తమ్మినాయుడుపేటలో నాగావళి నది వద్ద జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు పాల్గొన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పాత కుడి, ఎడమ కాలువల ఆధునీకరణకు రూ.195 కోట్లతో తలపెట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే టెక్కలి నియోజకవర్గంలో రూ. 23 కోట్లతో చిన్నసాన ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జిల్లాల కన్నా శ్రీకాకుళాన్ని బ్రహ్మాండమైన జిల్లాగా చేయడానికి పంతం పడతానన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆఖరి బడ్జెట్‌ వరకూ చూసి ఇక లాభం లేదనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. ఇక్కడో అవినీతి పార్టీ ఉందని, ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బయటకొచ్చి తనను తిడుతున్నారన్నారు. రాజధానికి, సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకులు పెడుతున్నారని ఆరోపించారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని వారికి ఎవరు చెప్పారన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధికి సహకరిస్తామని టీడీపీలోకి వస్తే, ప్రతిపక్షం అసెంబ్లీకి కూడా రావట్లేదని చెప్పారు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారని, ఇదెక్కడి న్యాయమో తనకు అర్థం కాలేదన్నారు. ‘బాబ్లీ ప్రాజెక్టు కడితే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఆప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో అక్కడికి వెళ్లాను. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టారు. కేసులు పెట్టబోమన్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు అరెస్టు వారెంటు పంపించారు. ఇదేమి కుట్ర. కేంద్రానికి నేనెందుకు భయపడాలి. బానిసలమా? పౌరులం కాదా? పన్నులు కట్టలేదా?’ అంటూ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు