కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదో చూస్తా

23 Oct, 2018 04:25 IST|Sakshi

పోలవరానికి ఎటువంటి అడ్డంకులు లేవు

ఇక నుంచి మరింత ఒత్తిడి

మే 15 నాటికి గేట్ల ప్రక్రియ పూర్తి

పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వదో చూస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే అత్యధికంగా నిధులు వెచ్చిస్తూ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ప్రాజెక్టు పరిశీలనకు సోమవారం విచ్చేసిన ఆయన.. ప్రాజెక్టు 26వ గేటు కాంక్రీట్‌ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత రూ.9,877.32 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిందన్నారు. దీనిలో రూ.6,727 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మిగిలింది ఇంకా ఇవ్వాల్సి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సొమ్ములు రాబడతామని.. కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదో చూస్తామని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుత సీజన్‌లో పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు.  ఇక నుంచి మరింత ఒత్తిడి పెంచి పనులు వేగంగా ముందుకు నడిపిస్తామన్నారు.

డిసెంబర్‌ నాటికి గేట్లకు పూర్తి అనుమతులు పొందుతామని, అలాగే అప్పటికి వాటి పనులు ప్రారంభించి, మే 15 నాటికి గేట్ల ప్రక్రియ పూర్తిచేస్తామని సీఎం చెప్పారు. కేంద్రం నిర్వాసితులకు చేసిన న్యాయం కంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా న్యాయం చేస్తోందన్నారు. 29నాటికి బాధితులకు అన్ని రకాల సొమ్ములు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతకుముందు.. అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, రేడియల్‌ గేట్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని, డిసెంబర్‌ 10న వీటిని ప్రారంభించడానికి వస్తానన్నారు. కాగా, ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తామని సీఎం చెప్పారు. 

>
మరిన్ని వార్తలు