అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు

24 Jul, 2019 03:45 IST|Sakshi

ముగ్గురు డిప్యూటీ లీడర్ల సస్పెన్షన్‌ అన్యాయం 

మైకివ్వడంలేదు, అందుకే ప్రెస్‌మీట్లు పెడుతున్నా 

సయోధ్యకు స్పీకర్, విప్‌లు ప్రయత్నించట్లేదు 

మీడియా సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబు   

సాక్షి, అమరావతి : అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారని, తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే తమ పార్టీకి చెందిన ముగ్గురు డిప్యూటీ లీడర్లను సభ నుంచి సస్పెండ్‌ చేశారని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక రిసార్ట్‌లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీని నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. తన సీట్లోనే ఉన్న అచ్చెన్నాయుడిని గొడవ చేస్తున్నారంటూ సస్పెండ్‌ చేయడం అన్యాయమన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకే మైకు ఇవ్వడంలేదని అందుకే ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. సభలో సీఎం శాసిస్తుంటే స్పీకర్‌ పాటిస్తున్నారన్నారు. 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఒక ఇంటర్వ్యూలో, కదిరి బహిరంగ సభలో చెప్పారని.. రాష్ట్రమంతా ఈ విషయాన్ని చెప్పుకుంటూ తిరిగారని చంద్రబాబు తెలిపారు. ఆయన ప్రకటన చూసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆశపడి ఓట్లు వేశారన్నారు.

ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడంలేదని  ఆయన ప్రశ్నించారు. అలాగే, పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి 255 హామీలు ఇచ్చారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 67, ఇంకా అదనంగా ఇచ్చిన వాటితో కలిపి మొత్తం 592 హామీలు ఇచ్చారన్నారని తెలిపారు. వాటిని నిలబెట్టుకోవాలని అడుగుతున్నామన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే వారికి బడ్జెట్‌లో కేటాయింపులు ఎందుకు తగ్గించారో చెప్పాలన్నారు. బీసీ నాయకుడిని సస్పెండ్‌ చేసి బీసీ బిల్లు పెట్టారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయని, వారి వేధింపులు తట్టుకోలేక ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌ వేధింపులకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని చంద్రబాబు చెప్పారు.  

సలహాలిచ్చేందుకు అవకాశం ఇవ్వడంలేదు
అంతకుముందు.. అసెంబ్లీలో మీడియాతో చంద్రబాబు ముచ్చటిస్తూ.. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్పీకర్‌ కానీ, విప్‌లు కానీ ఎలాంటి ప్రయత్నం చేయట్లేదన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నామని, కానీ సలహాలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వడంలేదన్నారు. 

మరిన్ని వార్తలు