గవర్నర్‌ ఆదేశాలను స్వాగతిస్తున్నాం

23 Jul, 2020 06:04 IST|Sakshi

ట్విట్టర్‌లో చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకమని, ఆర్టికల్‌ 243కె (2)కి సార్థకత ఏర్పడిందన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్‌ చేశారు. కరోనా సమయంలో ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్‌ఈసీని తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని విమర్శించారు. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడటం ముదావహమన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు స్వస్తి చెప్పాలని, ఎస్‌ఈసీ తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నిమ్మగడ్డకు సౌకర్యాలు కల్పించాలి: యనమల
గవర్నర్‌ ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికల ప్రధానాధికారి కుర్చీలో కూర్చునేందుకు కావల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు