పార్టనర్స్‌ ముసుగు తొలగింది

2 Jan, 2019 03:10 IST|Sakshi

పవన్‌తో బంధాన్ని బయటపెట్టిన చంద్రబాబు వ్యాఖ్యలు

కలసి పోటీ చేస్తే తప్పేమిటన్న సీఎం..

ఆ వ్యాఖ్యల అంతరార్థమదే..

ఇద్దరి మధ్య బంధం కొనసాగుతున్నట్లేనంటున్న విశ్లేషకులు

పవన్, జగన్, మోదీ భాగస్వాములని బాబు ఎల్లో ప్రచారం..

గతకొద్ది రోజులుగా మారిన వ్యూహం..

పవన్‌ను ఏమీ అనవద్దని శ్రేణులకు సూచనలు

ఇప్పుడు అకస్మాత్తుగా బయటపడిన బాబు బండారం

గతంలో బీజేపీతో చెలిమి..కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కలసిరావాలని పిలుపు

ఇప్పుడు కాంగ్రెస్‌తో ఫ్రెండ్‌షిప్‌..బీజేపీకి వ్యతిరేకంగా పోరాడదామని వ్యాఖ్య

స్వార్థ రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబు పరమావధి

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ముసుగు తొలగిపోయింది. పార్టనర్స్‌ బంధం బట్టబయలయ్యింది. అంతా ఊహించినట్లుగానే ఎన్నికల ముంగిట్లో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తమ బంధం ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆయన మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. పవన్, తాము కలసి పోటీ చేస్తే జగన్‌మోహన్‌రెడ్డికి బాధ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించడాన్ని బట్టి ఇద్దరి మధ్య బంధం కొనసాగుతున్నట్లే భావించాలని విశ్లేషకులంటున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్, పవన్‌ భాగస్వాములని, ఇద్దరూ మోడీ చెప్పినట్లల్లా ఆడుతున్నారని విమర్శించిన చంద్రబాబు మంగళవారం ఒక్కసారిగా అసలు విషయాన్ని బయటపెట్టేశారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో మంగళవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రాజకీయాలపైనా మాట్లాడారు. జగన్‌ ఎవరితో ఉన్నారో, ఎవరితో వెళుతున్నారో చెప్పాలన్నారు.  జగన్‌–మోడీ–కేసీఆర్‌ మధ్య ఐక్యత ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోందన్నారు. ‘పవన్, మేము కలసి పోటీచేస్తే తప్పేమిటి’ అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు–పవన్‌ ఇద్దరూ పార్టనర్స్‌ కాబట్టే నాలుగున్నరేళ్లుగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా చంద్రబాబును ఆదుకోవడానికి పవన్‌ ముందుకు వస్తున్నారు.’ అన్న విమర్శలకు ఇపుడు బాబు వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. 

కొద్దిరోజులుగా మారిన సీన్‌..
జగన్, పవన్‌ బీజేపీతో కలసిపోయారని, మోదీ చెప్పినట్లల్లా ఆడుతున్నారని ఎల్లోమీడియా సహకారంతో చంద్రబాబు అండ్‌ కో ప్రచారం చేస్తూ వచ్చారు. జగన్, పవన్‌ రహస్య మిత్రులని కూడా చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. నిన్న కేసీఆర్‌ విమర్శలను తిప్పి కొడుతూ కేసీఆర్, జగన్‌ కలసి పోయారని, వారిద్దరూ మోదీ చెప్పినట్లల్లా ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇందులో పవన్‌ను మినహాయించారు. గత కొద్దిరోజులుగా పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అంతేకాదు పవన్‌ను ఏమీ అనవద్దని నాయకులకు, అధికార ప్రతినిధులకు అన్యాపదేశంగా సూచనలూ చేశారు. ఇక ఇపుడు పూర్తిగా ముసుగు తొలగించారు. పవన్, తాను కలసి పోటీచేస్తే జగన్‌కు ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావథి..
ఇపుడు ఇక రెండే కూటములున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా అందరూ తనతో కలసి రావాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అందరూ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తల్లి కాంగ్రెస్‌ పిల్ల కాంగ్రెస్‌ ఒకటేనని వైఎస్‌ఆర్‌పీపై విమర్శలు చేశారు. జగన్‌ కాంగ్రెస్‌తో కలసిపోయినట్లు ప్రచారం చేశారు. ఇపుడు తానే కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. చంద్రబాబు తాను ఎవరితో కలవాలనుకుంటే వారితో అందరూ కలసి రావాలని కోరుతుంటారని, తనకు అనుకూలంగా ప్రచారం చేయిస్తుంటారని అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టి లాభపడి నాలుగున్నరేళ్లు కాపురం చేసిన చంద్రబాబు ఇపుడు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టి లాభపడదామనుకుంటున్నారని విశ్లేషకులంటున్నారు. దానికి రాష్ట్ర ప్రయోజనాలని, దేశప్రయోజనాలనే ముసుగు వేస్తుంటారని వారు ఎద్దేవా చేస్తున్నారు.

నిజానికి తన అవినీతిని కప్పిపెట్టి తనను తాను రక్షించుకోవడం కోసమే బీజేపీ లేదంటే కాంగ్రెస్‌ పంచన చేరుతుంటారన్న విమర్శలున్నాయి. రాష్ట్రాన్ని వంచించిందంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన చంద్రబాబు నిస్సిగ్గుగా అదే పార్టీతో చేతులు కలిపారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిందిపోయి ప్రతిపక్ష పార్టీ నేతపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఇదంతా పొలిటికల్‌ డ్రామాలో భాగమేనని విశ్లేషకులంటున్నారు. పవన్, జగన్‌ ఒకటేనని ప్రచారం చేసిన చంద్రబాబు ఇపుడు మరోసారి పవన్‌తో కలసి పోటీచేస్తే తప్పేమిటని నిస్సిగ్గుగా అడుగుతున్నారు. 

మరిన్ని వార్తలు