నేను మేనేజ్‌ చేస్తాగా!

30 Jan, 2020 03:41 IST|Sakshi

టీడీపీ ఎమ్మెల్సీలతో చంద్రబాబు

బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం 

ఢిల్లీలో పరిస్థితిని గమనించేందుకు ఓ బృందం ఏర్పాటైందంటున్న టీడీపీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాసన మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ ఎమ్మెల్సీలకు ధైర్యం నూరిపోసే ప్రయత్నాలను ప్రారంభించారు. తాను బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నానని, మండలి రద్దు కాకుండా మేనేజ్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన నమ్మబలుకుతున్నట్లు తెలిసింది. అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి వెళ్లిన తర్వాత ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీలు చర్చించుకుంటున్నారు. పార్లమెంట్‌ ముందుకు మండలి రద్దు అంశం రాకుండా ఉండేందుకు తమ అధినేత ప్రయత్నాలు సాగిస్తున్నా అవి ఎంత వరకూ ఫలిస్తాయోనని వారిలో సందేహం నెలకొంది. 

సుజనా ప్రస్తావించేలా పావులు..: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించిన చంద్రబాబు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు విడివిడిగా బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. మండలి రద్దు అంశాన్ని రెండు సభల్లో తమ ద్వారా గానీ, బీజేపీలోకి వెళ్లిన సుజనా లాంటి వారితోగానీ ప్రస్తావించే ఏర్పాట్లు చేశామని బాబు చెబుతున్నట్లు సమాచారం. ఒకవైపు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించడం మరోవైపు కేంద్ర పెద్దలపై ఒత్తిడి చేసేలా వ్యూహం రూపొందించినట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. 

బీజేపీ గూటికి టీడీపీ ఎమ్మెల్సీలు!..: అవసరమైతే తమ పార్టీకి చెందిన సగం మందికిపైగా ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపి వారి పదవులను కాపాడేలా చంద్రబాబు స్కెచ్‌ గీసినట్లు టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. తమ ఎమ్మెల్సీలు బీజేపీలోకి వెళ్లినా తన మాటే వింటారని అదే సమయంలో బీజేపీ బలం పెరిగినట్లు కనబడుతుందని చంద్రబాబు చెబుతున్నట్లు తెలిసింది. 

>
మరిన్ని వార్తలు