ఎన్నికల పరీక్షలో చూసిరాతలు

7 Apr, 2019 01:47 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల చేసేవరకూ ఏపీ ముఖ్యమంత్రి ఎదురుచూపులు

అందులో పలు అంశాలను కాపీ కొట్టి, అప్పటికప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో మార్పులు

సాక్షి, అమరావతి: 40 ఏళ్ల రాజకీయ అనుభవం, దేశంలోనే సీనియర్‌ రాజకీయ నాయకుడినని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరికి తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి నానా అవస్థలు పడడం చూసి టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయి. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయకుండా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కోసం ఎదురు చూడడం ఆయనలోని అభద్రతా భావాన్ని, ఓటమి భయాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దాన్ని చూసి టీడీపీ మేనిఫెస్టోలో మార్పులు, చేర్పులు చేయడంపై సొంత పార్టీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పైకి బీరాలు పోతూ, ప్రగ ల్భాలు పలుకుతూ పక్క పార్టీ మేని ఫెస్టోలోకి తొంగిచూడడం దౌర్భాగ్యమని టీడీపీ సీనియర్‌ నాయకులే వాపోతున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని టీడీపీ మేనిఫెస్టో కమిటీ 10 రోజుల క్రితమే దాన్ని తయారు చేసి ఇచ్చినా చంద్రబాబు విడుదల చేయలేదు.

జగన్‌ మోహన్‌రెడ్డి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అందులోని అంశాలను కాపీ కొట్టాలన్న ఉద్దేశం తో పదిరోజులు ఆగారు. ఉగాది రోజున వైఎస్సా ర్‌సీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించి ముహూర్తం కూడా ప్రకటించడంతో అదేరోజు తాము కూడా మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు అనుకూల మీడియాకు లీకులి చ్చింది. కానీ, కచ్చితమైన సమయం మాత్రం చెప్పలేదు. శనివారం ఉదయం 10.30 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టో విడుదల చేసే వర కూ తమ మేనిఫెస్టో ఏ సమయంలో విడుదల చేసేదీ చెప్పకుండా కాసేపట్లో.. కాసేపట్లో అం టూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. వైఎస్సా ర్‌సీపీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత 11 గంటల సమయంలో టీడీపీ మీడియా విభాగం స్పందిం చింది. మధ్యాహ్నం 12.30 గంటలకు చంద్ర బాబు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలి పింది.

అప్పటివరకూ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను చంద్రబాబు ఉండ వల్లిలోని తన నివాసంలో కూర్చొని చూస్తూ గడిపారు. అనంతరం ఉగాది వేడుకల్లో పాల్గొని పావు గంటలో మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పి లోపలికి వెళ్లిన ఆయన గంట తర్వాత బయటకు వచ్చారు. అప్పటివరకూ వైఎస్సా ర్‌సీపీ మేనిఫెస్టోలోని అంశాలను పరిశీలించి, దాని ప్రకారం తమ మేనిఫెస్టోలో పలు మార్పు లు చేయడం గమనార్హం. విలేకరులకు టీడీపీ మేనిఫెస్టో కాపీని సైతం ఇవ్వలేకపోవడాన్ని బట్టి చూస్తే అందులో మార్పులు చేసినట్లు స్పష్టమైం ది. తమ మేనిఫెస్టోలో కొన్ని మార్పులున్నా యని, కొద్దిసేపట్లో ఇస్తామని టీడీపీ నేతలు చెప్పడం గమనార్హం. టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన  తర్వాత కూడా మీడి యా విభా గం బయటకు రానివ్వలేదు. రాత్రి 8 గంటల వరకూ పలు మార్లు రివై జ్డ్‌ వెర్షన్‌లను విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అప్పటికప్పుడు కాపీ కొట్టినవి ఇవే..
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను చూసి అప్పటికప్పు డు టీడీపీ మేనిఫెస్టోలో మార్పులు చేశారు. య నమల రామకృష్ణుడు రూపొందించిన మేనిఫె స్టోకి,  చంద్రబాబు విడుదల చేసిన మేనిఫె స్టోలోని అంశాలకు చాలా తేడాలున్నాయి. రైతు లందరికీ వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామనే అంశాన్ని ఆఖరి నిమిషంలో చేర్చారు. అలాగే వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో పేద యువతుల పెళ్లి కోసం రూ.లక్ష ఇస్తామని చెప్పగా, చంద్రన్న పెళ్లి కానుకను రూ.లక్షకు పెంచుతున్నట్లు టీడీపీ మేనిఫెస్టోలో పొందుపర్చారు. తొలుత మాది గల గురించి పట్టించుకోని చంద్రబాబు వైఎస్సా ర్‌సీపీని చూసి మాదిగ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇస్తున్న రూ.4 వేల పరిహారం రూ.10 వేలకు పెంపు, ప్రతి సంవత్సరం ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ క్యాలండర్, పరిశ్రమల్లో లభించే ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకే కేటాయింపు, పక్కా ఇళ్ల నిర్మా ణానికి సంబంధించి లబ్ధిదారులు తీసుకున్న బ్యాంకు రుణాల మాఫీ, అన్ని సామాజిక వర్గాలకు చెందిన పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా ఇవ్వడం, పౌరులం దరినీ యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌ కిందకు తీసుకురావడం, ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే చెల్లిం చడం, పిల్లలను బడికి పంపే మహిళలకు ‘అమ్మ ఒడి’ వంటి అంశాలన్నీ వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టినవే.

మరిన్ని వార్తలు