బీజేపీలోకి బాబు కోవర్టులు!

21 Jun, 2019 04:56 IST|Sakshi

కేసుల భయంతో చంద్రబాబు కొత్త నాటకం

పక్కా వ్యూహంతోనే కమలం గూటికి టీడీపీ రాజ్యసభ సభ్యులు

వెళ్లిన నలుగురూ చంద్రబాబు సన్నిహితులు, వ్యాపారవేత్తలే

బీజేపీలో చేరి ‘బాస్‌’ కోసం పనిచేసే వ్యూహం

బాబు తీరుపై మండిపడుతున్న మెజార్టీ టీడీపీ నేతలు

సాక్షి, అమరావతి: ఓవైపు ఎన్నికల్లో ఘోర పరాజయం.. మరోవైపు వెంటాడుతున్న కేసుల భయంతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సరికొత్త రాజకీయ నాటకానికి తెరతీశారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురిని తన కోవర్టులుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వ్యూహాత్మకంగా పంపించారు. అదీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహి తులైన ఎంపీలే బీజేపీలో చేరడం గమనార్హం. కేసుల నుంచి తనను కాపాడేందుకే చంద్రబాబు సొంత మనుషులను పక్కా వ్యూహంతో బీజేపీలోకి పంపారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా సాగించిన తన అవినీతి వ్యవహారాలపై విచారణ జరుగుతుందని ఆయన బెంబేలెత్తుతున్నారు. దీంతో తన మనుషులు బీజేపీలో ఉండటం అవసరమని గ్రహించి పక్కాగా కథ నడిపించారు. అయితే చంద్రబాబు రాజకీయ పన్నాగం బెడిసికొట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కుంది. తన స్వార్థం కోసం పార్టీ పుట్టి ముంచా రని టీడీపీ నేతలు, శ్రేణులు ఆయనపై మండిప డుతున్నాయి. గురువారం కాకినాడలో సమావేశమైన కాపు నేతలు తాజా పరిణామాలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మరోసారి సమావేశమై తమ దారి తాము చూసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.  

నావాళ్లు బీజేపీలో ఉండాలి...
అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుంది. అవినీతి వ్యవహారాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై నివేదిక తెప్పించుకుంది. తనతోపాటు తన కుమారుడు లోకేశ్‌పై కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయని చంద్రబాబుకు స్పష్టత రావడంతో బెంబేలెత్తారు. చంద్రబాబు అంచ నాలకు మించి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ, కేంద్రంలో బీజేపీ ఏకపక్షంగా ఘన విజయం సాధించాయి. దాంతో ఇక బీజేపీ తో సంబంధాల పునరుద్ధరణ సాధ్యం కాదని గుర్తించిన బాబు ప్రత్యామ్నాయ మార్గంగా వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితులను బీజేపీలో చేర్పించాలని నిర్ణయించారు. 

అందుకే ఆ నలుగురు...
యలమంచిలి వెంకట సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ చంద్రబాబుకు వ్యక్తిగతంగా సన్నిహితులు. బీజేపీలో తన కోవర్టులుగా ఉండేందుకు చంద్రబాబు వారిని పక్కాగా ఎంపిక చేసుకున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల వ్యాపార, ఆర్థిక  వ్యవహారాలన్నీ చంద్రబాబుకు బినామీలుగానే చేశారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 2010కు ముందు వారి గురించి రాష్ట్రంలో పెద్దగా తెలీదు. మరోవైపు గరికపాటి మోహన్‌రావు పూర్తిగా చంద్రబాబు తరపున రాజకీయ వ్యవహారాలు నెరుపుతుంటారు. లోకేశ్‌ను ‘తగిన విధంగా’ ప్రసన్నం చేసుకోవడం ద్వారానే టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ నలుగురు  వ్యాపారవేత్తలు కావడం, వారికి వ్యాపారాల పరంగా ఇబ్బందులు, ఆర్థిక నేరాల కేసులు ఎదుర్కొంటుండటం గమనార్హం. అందుకే ఆ నలుగురినే చంద్రబాబు ఎంపిక చేసి మరీ బీజేపీలోకి పంపించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక తన చేతికి మట్టి అంటకుండా అన్నట్టుగా టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరికకు ముహుర్తాన్ని కూడా చంద్రబాబు పక్కాగానే నిర్ణయించారనేది స్పష్టమవుతోంది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిన వెంటనే ఆ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. తనకు అత్యంత సన్నిహితులైన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరే సమయంలో తాను దేశంలో ఉండకూడదని చంద్రబాబు ముందస్తుగానే నిర్ణయించుకున్నారని, ప్రణాళిక ప్రకారమే చేరిక వ్యవహారం కొనసాగిందని టీడీపీ నాయకులు, శ్రేణులు కూడా అభిప్రాయపడుతుండటం గమనార్హం.  

వచ్చే నెలలో భేటీ అనంతరం కార్యాచరణ...
తిరుగులేని ప్రజాదరణ ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూకుడు, పనితీరు చూస్తుంటే మరో 10 – 15 ఏళ్ల వరకు ఆయన అధికారంలో ఉండటం ఖాయమని సమావేశంలో పాల్గొన్న నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీని నమ్ముకుని తాము మునగడం కంటే మరోదారి చూసుకోవాలని తీర్మానించారని తెలిసింది. దీనిపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరించాలని అభిప్రాయానికి వచ్చారు. సమావేశానికి హాజరు కాని మరికొందరు నేతలను కూడా పిలిచి వచ్చే నెలలో మరోసారి భేటీ అనంతరం రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని టీడీపీ కాపు నేతలు భావిస్తున్నారు.   

‘‘బాస్‌ చెప్పినట్లే చేశాం...’’
చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి యూరప్‌ పర్యటకు బుధవారం అలా వెళ్లారో లేదో... ఇటువైపు టీడీపీ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరుతున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. టీడీపీ అనుకూల మీడియాలో కూడా తాము అనుకున్న విధంగా కథనాలు వచ్చేలా జాగ్రత్త పడ్డారు. మరోవైపు పార్లమెంటులో కీలక స్థానంలో ఉన్న ఓ నేతతో దీనిపై ముందస్తుగానే చంద్రబాబు మంతనాలు జరిపారని తెలుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తన సన్నిహితుడు ఇందుకు సహకరించారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేయకుండా చంద్రబాబు ముందే కట్టడి చేశారు. ఇక బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు తమ సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాయలసీమకు చెందిన ఓ నేతను మాజీ మంత్రి ఒకరు సంప్రదించగా ‘బాస్‌ చెప్పినట్టే చేశాం. అక్కడ ఉన్నా మేం ఇక్కడి మనుషులమే కదా.. అంతా అనుకున్నట్లే జరుగుతోంది’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. గత కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరో నేత మాట్లాడుతూ ‘కేసులు బిగుసుకోకుండా చూసుకోవాలి... అందుకే అక్కడికి వెళ్తున్నాం... అన్ని అనుకున్నట్లుగా జరిగితే మళ్లీ నాలుగేళ్లకు వెనక్కి వస్తాం’ అని వ్యాఖ్యానించారని తెలిసింది.  కాకినాడలో గురువారం సమావేశమైన టీడీపీ కాపు నేతల సమావేశంలో ఈ అంశంపై వాడీవేడీ చర్చ సాగింది. చంద్రబాబు తీరుపై నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారని సమాచారం.

మరిన్ని వార్తలు