నాలుగు రోడ్ల కూడలిలో చంద్రబాబు

10 Mar, 2018 19:30 IST|Sakshi
సీఎం చంద్రబాబు నాయుడు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు తెలుగుదేశం పార్టీ సభ్యులను ఉపసంహరించుకున్నారు. ఎందుకైనా మంచిదని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్నారు. ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు చేసిన రాజీనామాలను ఇదే అదనుగా కేంద్రం ఆమోదించింది.

అమరావతిలో కొత్త రాజధానిని నిర్మించడంలో, పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం నిందను కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపైకి నెడుతున్నారు. ఇలా చేయడం ద్వారా వచ్చే ఏడాది పార్లమెంట్‌తోపాటు రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన అలాగే లబ్ధి పొందారు. నాడు అడ్డగోలుగు తెలుగు రాష్ట్రాన్ని విభజించిన కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రానికిచ్చిన హామీలనేవీ నెరవేర్చలేక పోయిందంటూ విమర్శలు గుప్పించడం ద్వారా అంతో ఇంతో లబ్ధి పొందారు. ప్రస్తుతం ఆయనున్న పరిస్థితుల్లో ఆయన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఆయన ముందు నాలుగుదారులు ఉన్నాయి.

1. ఒంటరిగా వెళ్లడం
ఏ రాజకీయ పార్టీతోగానీ, కూటమితోగానీ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోవడం. ఇది కాస్త క్లిష్టమైనదైనప్పటికీ ఇందులో లాభం చేకూర్చే అంశాలున్నాయి. మోదీ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకోవచ్చు. ముఖ్యంగా సెక్యులర్‌ వాదినంటూ ఏడు శాతం ఓట్లు కలిగిన ముస్లింలను ఆకర్షించేందుకు కృషి చేయవచ్చు. రాయలసీమలోని 20 అసెంబ్లీ సెంగ్మెంట్లలో ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మెజారిటీ ముస్లింలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వైపు ఉన్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 2.07 శాతం మాత్రమే కనుక ఎన్నికలను ఒంటిరిగా ఎదుర్కోవడం ఎంతో రిస్క్‌ తీసుకోవడమే!

2. మూడో ఫ్రంట్‌ ఏర్పాటు చేయడం
కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం మరో అవకాశం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా సమాఖ్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందంటూ ముందుకు వచ్చారు. ఇప్పుడు కేసీర్‌ నాయకత్వంలోని ఫ్రంట్‌లో చేరవచ్చు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన వద్ద కేసీఆర్‌ మంత్రిగా పనిచేశారు. పైగా 1990వ దశకంలో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబే కీలకపాత్ర వహించారు. ప్రధాన మంత్రులుగా దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌లను అందించిన యునైటెడ్‌ ఫ్రంట్‌కు చాంద్రబాబు కన్వీనర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చీలిపోవడంతో లోక్‌సభ స్థానాల సంఖ్య కూడా 25కు పడిపోవడంతో జాతీయ రాజకీయాల్లో బేరానికి కూడా బలం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ ఫ్రంట్‌లో చేరడం అటుంచి, ఆయన్ని తనతో సమానంగా చూసేందుకు చంద్రబాబు ఇష్టపడరు.

3. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం
‘శత్రువు శత్రువు నా మిత్రుడు’ అనే సూత్రం ప్రకారం కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. హోదా కోసం పోరాటంలో కేంద్రంలోని బీజేపీని పూర్తిగా దూరం చేసుకొని, దానికి శత్రువైన కాంగ్రెస్‌ పార్టీని మిత్రునిగా చేసుకోవచ్చు. రాష్ట్రం విభజన జరగడానికి, తన రాష్ట్రానికి ఇన్ని కష్టాలు రావడానికి కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీయే కారణమంటూ ఇంతకాలం పొద్దస్తమానం చంద్రబాబు తిట్టిపోశారు. ఈ విమర్శలు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఆయన క్యారెక్టర్‌నే శంకిస్తారు. దానివల్ల నష్టమే జరుగుతుంది.

4. వామపక్షాలు, పవన్‌తో వెళ్లడం
సెక్యులరిజమ్‌ పేరుతో కమ్యూనిస్టు పార్టీలు, పవన్‌ కళ్లాణ్‌ జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో కమ్యూనిస్టు పార్టీలకు ఉనికి కూడా లేదు. అటు పశ్చిమ బెంగాల్, ఇటు త్రిపుర రాష్ట్రాలో ఘోరంగా ఓడిపోయి కేరళలో కష్టాలను ఎదుర్కొంటోంది. వామపక్షాల పొత్తు వల్ల ఎన్నికల్లో కలిసొచ్చేది ఏమీ ఉండదు. పవన్‌ కళ్లాణ్‌ ప్యాక్టర్‌ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు బాగానే కలిసి వచ్చింది. పవన్‌ కారణంగా కాపు ఓట్లు చంద్రబాబుకు పడ్డాయి.

ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పవన్‌ ఇప్పుడు జనసేన పార్టీ పేరుతో సామాజిక వేదికను ఏర్పాటుచేసి ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌ సీపీ, కాంగ్రెస్, జయప్రకాష్‌ నారాయణ్‌ అందరిని కలుపుకుపోతున్నారు. వారిలో రాజకీయంగా శత్రువులెవరో, మిత్రులెవరో తెలియదు. గత రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఆయన్ని తన శిబిరంలో కలుపుకోవచ్చు. కానీ పవన్‌ పార్టీకి ఇప్పటికీ ఓ రాజకీయ సిద్ధాంతంగానీ, స్వరూపంగానీ లేదు. ఆయనతో పొత్తు పెట్టుకోవడం అంటే ఈసారి లాభంకన్నా భారమే ఎక్కువ అవుతుంది.

మరిన్ని వార్తలు