చంద్రబాబు రాష్ట్రానికి ప్రమాదకారి  

19 Jul, 2018 12:18 IST|Sakshi

దేశంలోనే అవినీతిపరుడు

సింగపూర్‌ కంపెనీలకు అమరావతి ధారాదత్తం

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు ధ్వజం

మందస శ్రీకాకుళం  : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకారి అని, దేశంలోనే అవినీతిపరుల్లో ఒకరని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. మందస పట్టణంలోని బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యుల శిక్షణ శిబిరంలో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్‌ కంపెనీలకు ధారదత్తం చేశారని, రూ. 21వేల కోట్ల పెట్టుబడి దుర్వినియోగంగా మారుతోందన్నారు.

రాష్ట్రాన్ని ఇతర దేశాల పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతున్నారని, దోచిన సొమ్ముతో రాబోయే ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు రూ. 5 వేలిచ్చి, మళ్లీ అధికారంలోకి రావడానికి ఇప్పట్నుంచే యత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి పేరిట మాయాజాలం చేస్తున్నారన్నారని, పేదల తిండికి లేకుండా ఉన్నారని, భూగర్భ డ్రైనేజీల పేరిట నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జీతాలు పెంపు, పథకాలు.. ఇతరత్రా ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

14వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్‌లు వ్యయం చేయలేని దుస్థితిలో ఉన్నారన్నారు. కేవలం నియంతలా చంద్రబాబు ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రాజ్యం వైఎస్సార్‌సీపీదేనని, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అని, ఇందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు.

పార్టీ మండలాధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్, పలాస బూత్‌ కమిటీల కన్వీనర్‌ సీదిరి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు మెట్ట కుమారస్వామి, డొక్కరి దానయ్య, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు