సీనియర్లకు బాబు మొండిచేయి

21 Feb, 2019 16:42 IST|Sakshi

అమరావతి : రాజంపేట పార్లమెంటు స్థానంపై గురువారం సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్‌ నేతలు పసుపులేటి బ్రహ్మయ్య, పాలకొండ రాయుడికి చంద్రబాబు మొండిచేయి చూయించారు. రాజంపేట సీటు కోసం ప్రయత్నిస్తూ ఇటీవలే పసుపులేటి బ్రహ్మయ్య గుండెపోటుకు గురైన సంగతి తెల్సిందే. రాజంపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ నేతలతో సంప్రదింపుల అనంతరం రాజంపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడికి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి మేడా మల్లికార్జున్‌ రెడ్డే(రాజంపేట శాసనసభ స్థానం నుంచి). ఇటీవలే ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెల్సిందే.

అలాగే రాయచోటిలో పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న సీనియర్‌ నేత పాలకొండ రాయుడిని పక్కన పెట్టి ఈ సారి రమేష్‌ రెడ్డికి అవకాశం కల్పించారు. పీలేరు శాసనసభా స్థానం నుంచి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, పుంగనూరు నుంచి అనూష రెడ్డి, రైల్వే కోడూరు నుంచి నరసింహ ప్రసాద్‌లకు సీట్లు కేటాయిస్తున్న చంద్రబాబు వెల్లడించారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే మదనపల్లె, తంబాలపల్లె సీట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పార్టీ ఫిరాయించి వచ్చిన నేతలకు టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని జిల్లాలో సీనియర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటీవలే సీనియర్లు తమకు టిక్కెట్లు కేటాయించకపోతే ఇండిపెండెంటుగానైనా బరిలోకి దిగుతామని బాహాటంగా హెచ్చరించిన సంగతి తెల్సిందే.

మరిన్ని వార్తలు