తెలుగుదేశం కకావికలం

19 Mar, 2019 04:36 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో చంద్రబాబు తత్తరబిత్తర 

ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులనే ఖరారు చేయలేని దయనీయ పరిస్థితి 

ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నా 141 స్థానాలకే ప్రకటన 

చంద్రబాబు సీట్లు ఖరారు చేసినవారిలోనూ ఓటమి భయం 

తీవ్ర ప్రజా వ్యతిరేకత వల్ల పలుచోట్ల పోటీకి నిరాకరిస్తున్న వైనం 

ఎంపిక చేసిన అభ్యర్థులపై టీడీపీలో వెల్లువెత్తుతున్న అసమ్మతి 

ఎంపీ స్థానాలు, మిగతా ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసేవారి కోసం ఇంకా వెతుకులాట 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం తథ్యమని ఇప్పటికే పలు సర్వేలు నిగ్గు తేల్చడం, తాజాగా వెలువడుతున్న సర్వే నివేదికల్లోనూ అదే విషయం స్పష్టమవుతుండడంతో తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్యానుగాలి స్పీడుకు నామినేషన్లకు ముందే కకావికలమై పోతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెలుపు తథ్యమని తేలడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సర్వేల మీద సర్వేలు.. జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నివేదికలు.. ఆరునెలల ముందే మొదలైన ఎంపిక కసరత్తు. ఇంత చేసినా టీడీపీ ఇప్పటికీ పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటివరకు 141 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అయితే వీరిలో పలువురు అభ్యర్థుల పట్ల ఆ పార్టీలో తీవ్ర అసమ్మతి వ్యక్తం అవుతుండటం గమనార్హం.

మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలకు, అన్ని ఎంపీ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించారు. ఇలావుండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం నేపథ్యంలో తెలుగుదేశం ప్రకటించిన జాబితాలోని ఎమ్మెల్యే అభ్యర్థుల్లో పలువురు పోటీకి విముఖత చూపిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్‌ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయడానికి నిరాకరించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరిపోయారు. వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా పోటీకి వెనుకంజ వేశారు. దీంతో ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డిని పోటీ చేయించాలని టీడీపీ అధిష్ఠానం చూస్తున్నా ఆయన కూడా ససేమిరా అంటున్నట్లు సమాచారం. పాణ్యం టిక్కెట్‌ను ఆశించిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డిని శ్రీశైలంనుంచి పోటీకి సంప్రదించగా ఆయన కూడా నిరాకరించారని చెబుతున్నారు. 

టీడీపీకి ముందే గుడ్‌ బై 
వాస్తవానికి అభ్యర్థుల ప్రకటనకు ముందే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై కొట్టారు. వైఎస్సార్‌ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ రాజంపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌పై పోటీకి దిగారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి భీమునిపట్నం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు కూడా టీడీపీని విడిచి వైఎస్సార్‌సీపీలో చేరారు.  

మంత్రులకు ముచ్చెమటలు 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం నేపథ్యంలో అధికారపార్టీలోని మంత్రులు సహా ఇతర అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టీడీపీపై తీవ్ర ప్రజావ్యతిరేకత, సొంతపార్టీలో అసమ్మతి వారికి మింగుడు పడటం లేదు. విశాఖపట్నం జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రజా వ్యతిరేకత, సొంతపార్టీలో అసంతృప్తి సెగలు నేపథ్యంలో అక్కడినుంచి వేరే చోటుకు బిచాణా ఎత్తేశారు. తన సామాజికవర్గమైన వెలమ కులానికి చెందిన వారికి టిక్కెట్లు రాకుండా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చిన గంటాపై మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడుతున్నారు. అయ్యన్నపాత్రుడి వియ్యంకుడు సవర రాంబాబు విశాఖ నార్త్‌లో ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతుండడంతో గంటాకు చెమటలు పడుతున్నాయి. అంతకుముందు.. తాను భీమిలి నుంచి పోటీ చేసి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‌ను ఓడిస్తానంటూ గంటా ప్రగల్భాలు పలికారు. చివరకు అక్కడినుంచి విశాఖ నార్త్‌కు పలాయనం చిత్తగించారు.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు టిక్కెట్‌ ప్రకటించారు. అయితే ఆ స్థానాన్ని ఆశించిన సీనియర్‌ నేత బొడ్డు భాస్కర రామారావు, ఆయన వర్గం చినరాజప్ప అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అవసరమైతే రెబల్‌గా పోటీకి దిగుతామంటూ హెచ్చరికలు పంపుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రజల ఓటుతో గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఇంతకుముందే ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలో ఎౖMð్సజ్‌ శాఖ మంత్రి జవహర్‌ను కొవ్వూరు నియోజకవర్గంలో సొంతపార్టీ నుంచే అసమ్మతి సెగలు చుట్టుముట్టాయి. చివరకు ఆయనకు టిక్కెట్‌ ఇస్తే కలసికట్టుగా ఓడిస్తామని ప్రకటించడంతో చంద్రబాబు ఆయన్ను కృష్ణా జిల్లా తిరువూరుకు పంపించారు. అక్కడ కూడా జవహర్‌కు అసమ్మతి తప్పడం లేదు. ఆ స్థానాన్ని ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు వర్గం జవహర్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టడమే కాకుండా సహకరించేది లేదని తెగేసి చెప్పేశారు. కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏటికి ఎదురీదుతున్నారు.

తీవ్ర ప్రజావ్యతిరేకతతో పాటు తన సొంత తమ్ముడు దేవినేని చంద్రశేఖర్‌ టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లాలో మంత్రి శిద్ధారాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గాన్ని ఆయనకు ఇవ్వకుండా ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి అనుకున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడంతో శిద్ధాను అక్కడ బరిలో నిలిపారు. దర్శి టిక్కెట్‌ కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఉగ్రనరసింహారెడ్డికి ఇస్తామనడాన్ని శిద్ధా వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో కనిగిరి నియోజకవర్గంలో అయితేనే తాను పోటీ చేస్తానని ఉగ్ర చెబుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఆదినారాయణరెడ్డి కడప లోక్‌సభ అభ్యర్థిగా ముందుగానే చేతులెత్తేశారు. చిరకాల ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కోసం తాను జమ్మలమడుగు అసెంబ్లీని వదులుకోవాలంటే రామసుబ్బారెడ్డితో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయించి దానిని తన కుటుంబానికి  కేటాయించాలని షరతు పెట్టారు. దీంతో రామసుబ్బారెడ్డిని రాజీనామా చేయించి, కడప లోక్‌సభకు ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు ఎంపికచేçస్తున్నారు.

ప్రస్తుతానికి ఇద్దరూ రాజీబాటలో ఉన్నట్లు ఇద్దరూ కనిపిస్తున్నా అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. కర్నూలు జిల్లాలో మంత్రి అఖిలప్రియ సొంత మేనమామ జగన్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిపోవడం టీడీపీకి షాక్‌ ఇచ్చింది. ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి ఫరూక్‌ నియోజకవర్గం  నంద్యాలలో అంతర్గత పోరాటం తారస్థాయిలో ఉండడంతో ఎటూ తేల్చలేదు. ఇదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తాను పోటీ చేయకుండా తన కుమారునికి పత్తికొండ స్థానాన్ని ఇప్పించారు. అయితే దీనిపైనా స్థానిక నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అనంతపురంలో మంత్రి పరిటాల సునీత తాను దూరంగా ఉండి తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను పోటీలోకి దింపారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి కాల్వ శ్రీనివాసులు టిక్కెట్‌ ఖరారుకు ముందే వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇదే నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి మేనల్లుడు దీపక్‌రెడ్డి తాను ఇండిపెండెంటుగా పోటీకి దిగుతానని ప్రకటిస్తున్నారు.  

ఎమ్మెల్యే అభ్యర్థులదీ అదే పరిస్థితి 
రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. అలాగే సొంతపార్టీ నుంచి కూడా అసమ్మతి వెంటాడుతోంది. కర్నూలు జిల్లా బనగానపల్లి సీటును బీసీ జనార్ధన్‌రెడ్డికి, శ్రీశైలం సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి, పాణ్యం వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియకు, డోన్‌కు కేఈ ప్రతాప్‌కు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సహకారంతో బీసీ జనార్దన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం చల్లా వైఎస్సార్‌సీపీలో చేరడంతో జనార్ధన్‌రెడ్డి పరిస్థితి సందిగ్ధంలో పడింది. పాణ్యం ఇన్‌చార్జి ఎరాసు ప్రతాప్‌రెడ్డిని కాదని గౌరు చరితారెడ్డికి కట్టబెట్టడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ ప్రభావం శ్రీశైలం, పాణ్యం రెండింటిపైనా పడనుంది. పత్తికొండ నుంచి ఉప ముఖ్యమంత్రి కుమారుడు కేఈ శ్యాంబాబును, ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ, ఆదోని నుంచి మీనాక్షి నాయుడు, మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వరరెడ్డిల పేర్లను ప్రకటించారు. ఆలూరులో ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ను కాదని కోట్ల సుజాతమ్మకు ఇవ్వడంతో వీరభద్రగౌడ్‌ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. పత్తికొండ, తుగ్గలి మండలాల్లో పట్టున్న తుగ్గలి నాగేంద్ర కేఈ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అనంతలోని కదిరిలో కందికుంట వెంకటప్రసాద్, అత్తార్‌చాంద్‌ బాషాల మధ్య గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి.

అనంతపురం పార్లమెంటు పరిధిలోని పలు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని జేసీ దివాకర్‌రెడ్డి పట్టుబడుతున్నారు. అనంతపురంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి బదులు వేరేవారికి టిక్కెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్‌  కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాల మధ్య వివాదం చోటుచేసుకుంది. కళ్యాణదుర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే హన్మంతరాయ కుటుంబానికి టిక్కెట్‌ ఇవ్వరాదని కొంతమంది ఏకంగా ర్యాలీలు, ధర్నాలు చేశారు. టిక్కెట్‌ ప్రకటించకున్నా హన్మంతరాయచౌదరి సోమవారం నామినేషన్‌ వేసేశారు. శింగనమల నియోజకవర్గం టిక్కెట్‌ ప్రస్తుత ఎమ్మెల్యే యామినీబాలకు కాకుండా శ్రావణికి ఇవ్వాలని జేసీ పట్టుబడుతున్నారు.
 
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే సుగుణమ్మకు సీటు రాదని ముందే చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మోహన్, వూకా విజయకుమార్, తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌ తదితరులకు బాబు మాట ఇచ్చారు. తీరా సుగుణమ్మకే సీటు ఇవ్వడంతో ఇప్పుడు వీరంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. శ్రీకాళహస్తిలో ఎస్‌పీవీ నాయుడును కాదని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు సుధీర్‌రెడ్డికి ఇవ్వడం వివాదాస్పదమయ్యింది. నాయుడితో పాటు గోపాలకృష్ణారెడ్డి భార్య, చిన్నకొడుకు కూడా సుధీర్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎస్పీవీ నాయుడికి సత్యవేడు, కాళహస్తిలపై పట్టు ఉండడంతో రెండుచోట్లా టీడీపీకి ఓటమి తప్పదని అంటున్నారు. నగరిలో అశోక్‌రాజును చంద్రబాబు ప్రోత్సహించారు. గత ఆరు నెలలుగా భాను, అశోక్‌రాజులు పోటీలు పడి కార్యక్రమాలు చేశారు. అయితే కమ్మ వర్గానికి చెందిన భానుకు  సీటు కేటాయించడంతో రాజులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పుంగనూరులో అనూషారెడ్డికి సీటు ఇవ్వడంతో ఇక్కడ రాజులు గుర్రుమంటున్నారు. పలమనేరులో 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఓడిపోయిన సుభాష్‌చంద్రబోస్‌కు ఈసారి కూడా అన్యాయం జరగడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.  

ఇక వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో గత ఎన్నికల్లో పోటీచేసిన ఓడిన విజయజ్యోతికి ఈసారి కూడా చుక్కెదురైంది. దీంతో ఆమె టీడీపీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన జయరాములుకూ చంద్రబాబు మొండిచేయి చూపించారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంతపార్టీ నేతలనుంచే అసమ్మతి ఎదురవ్వడంతో ఆమెను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు మార్చారు. అక్కడ కూడా ఆమెకు వ్యతిరేకత తప్పడం లేదు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మాజీ మంత్రి కిమిడి మృణాళినికి, ఆమె కుటుంబానికి టిక్కెట్‌ ఇవ్వరాదని స్థానిక టీడీపీ నేతలు ఆందోళనలు చేయడంతో ఆమె కుమారుడు నాగార్జునను చంద్రబాబు ఎంపిక చేశారు. అయితే దీనిపై తీవ్రంగా రగిలిపోతున్న వ్యతిరేకవర్గం నాయకుడు త్రిమూర్తులు రాజు రెబల్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భాంజ్‌దేవ్‌ను ఎమ్మెల్సీ సంధ్యారాణి తొలి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా టీడీపీ నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. కొండ్రు ఒంటెత్తు పోకడలు నచ్చక మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి వర్గంతో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వర్గం కూడా వ్యతిరేకంగా పనిచేస్తోంది. 

తేల్చుకోలేక తర్జనభర్జనలు 
పలు ఎంపీ సీట్లతో పాటు ఇంకా ప్రకటించని 35 అసెంబ్లీ సీట్లపైనా ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. విశాఖ ఎంపీ స్థానానికి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ పేర్లను పరిశీలిస్తున్నా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అనకాపల్లి సీటు కొణతాల రామకృష్ణ, వంగవీటి రాధాకృష్ణ, అడారి ఆనంద్‌ల మధ్య దోబూచులాడుతోంది. రాజమండ్రి సీటును మాగంటి రూపకివ్వాలని నిర్ణయించినా ఇంకా ప్రకటించలేదు. అమలాపురం, రాజంపేట, నంద్యాల ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయడంలో చంద్రబాబు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. నంద్యాల సిట్టింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి తాను రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీ అధినేత సతమతమవుతున్నారు. ఇక కర్నూలు అసెంబ్లీ సీటును టీజీ భరత్‌ కిస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి తిరుగుబాటు చేసే పరిస్థితి ఉండడంతో ఏంచేయాలో తేల్చుకోలేకపోతున్నారు. అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలోని అనంతపురం అర్బన్, మడకశిర, కళ్యాణదుర్గం అసెంబ్లీ సీట్లను తాను చెప్పిన వారికే ఇవ్వాలని జేసీ దివాకర్‌రెడ్డి పట్టుబడుతుండడంతో చంద్రబాబు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం, జనసేనతో రహస్య అవగాహన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై గతంలో ఎన్నడూ లేని గందరగోళం నెలకొందని టీడీపీ వర్గాలే వాపోతున్నాయి.   

ప్రకటించిన అభ్యర్థులను మార్చేందుకు కసరత్తు 
నర్సాపురం, నరసరావుపేట ఎంపీ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలనే దానిపై చంద్రబాబు గత పదిరోజులుగా మల్లగుల్లాలు పడినా ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు. ప్రస్తుతం ఈ స్థానాల కోసం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులను సైతం మార్చేందుకు కసరత్తు చేస్తుండడం గమనార్హం. నర్సాపురం ఎంపీగా పోటీ చేసేందుకు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఒప్పుకోకపోవడంతో క్షత్రియ సామాజికవర్గం నుంచి ఎవరినైనా పోటీ చేయించాలని పలువురి కోసం ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ నియోజకవర్గంతో సంబంధం లేని మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, రామరాజు పేర్లను పరిశీలించినా వారి వల్ల ఉపయోగం ఉండదని పునరాలోచనలో పడ్డారు. చివరకు తొలి జాబితాలో ఉండి అభ్యర్థిగా ప్రకటించిన అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ)ను ఇప్పుడు నర్సాపురం ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఆయన స్థానంలో ఉండి అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని రామరాజుకివ్వాలని చూస్తున్నారు.

నరసరావుపేట స్థానానికి సిట్టింగ్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఇస్తే ఓటమి ఖాయమని తేలినా ఆయన మాత్రం పట్టు వీడడంలేదు. అయినప్పటికీ రాయపాటి కుమారుడు రామారావుకు ఎమ్మెల్యే సీటిచ్చి ఆయన్ను పక్కకు తప్పించాలని చూస్తున్నారు. ఈ సమీకరణలో నరసరావుపేట ఎంపీగా తెనాలి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను పోటీ చేయించి ఆయన స్థానంలో రాయపాటి కుమారుడిని పోటీ చేయించాలని చూస్తున్నారు. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ అభ్యర్థిగా ఇప్పటికే మద్దాల గిరిని ప్రకటించగా ఆయన్ను నరసరావుపేట అసెంబ్లీకి మార్చాలని చూస్తున్నారు. బాపట్ల సిట్టింగ్‌ ఎంపీ మాల్యాద్రికి ఇచ్చిన తాడికొండ అసెంబ్లీ సీటును మళ్లీ అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు ఇచ్చేందుకు పునరాలోచన చేస్తున్నారు.  

కోడెల సీటునూ పెండింగ్‌లో పెట్టి...  
ఇలావుండగా సాక్షాత్తూ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును సత్తెనపల్లి నియోజకవర్గంలో వ్యతిరేకిస్తున్న పార్టీలోని ప్రత్యర్థివర్గం ఏకంగా ర్యాలీలు, నిరసనలూ చేపట్టింది. కుక్కనైనా గెలిపిస్తాం కానీ కోడెలను అభ్యర్థిగా అంగీకరించేది లేదని స్పష్టం చేయడంతో ఆ స్థానాన్ని చంద్రబాబు కొంతకాలం పెండింగ్‌లో పెట్టి తీవ్ర తర్జనభర్జనల అనంతరం చివరకు ప్రకటించారు. అయినా అసమ్మతి వర్గం ఆయన్ను ఓడించేందుకే సిద్ధమయ్యింది. ఈ స్థానాన్ని తన కుమారుడు రాయపాటి రామారావుకు ఇవ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. తాడేపల్లి గూడెంలో జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు టిక్కెట్‌ను ఆశించగా ఈలి నానిని చంద్రబాబు ప్రకటించారు. దీంతో బాపిరాజు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చింతలపూడిలో కర్రా రాజారావును ప్రకటించడంతో మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ వెస్ట్‌లో నాగుల్‌మీరాను కాదని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమార్తె షబానా ఖాతూన్‌కు టిక్కెట్‌ ఇవ్వడంతో ఆమెను ఓడించేందుకు వ్యతిరేకవర్గం చాపకింద నీరులా పనిచేస్తోంది. నందిగామలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు టిక్కెట్‌ ఇవ్వవద్దంటూ సొంతపార్టీ నేతలనుంచే వ్యతిరేకత వచ్చింది. అయినా 
అధినేత ఆమెనే అభ్యర్థిగా ప్రకటించడంతో అసమ్మతి భగ్గుమంటోంది. 

మరిన్ని వార్తలు