రాష్ట్రాన్ని కొల్లగొట్టు..ఎన్నికల్లో పంచిపెట్టు

15 Dec, 2018 04:10 IST|Sakshi

ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఆర్థిక వనరుగా చంద్రబాబు

తనవల్లే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌లో బీజేపీ ఓడిపోయిందని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై సర్వత్రా విస్మయం

టీడీపీ ఉనికే లేని రాష్ట్రాల్లో బాబు ఎలా గెలిపించారు?.. కాంగ్రెస్‌కు అందించిన ఆ సహకారం ఆర్థికపరమైనదేనా?

సీఎం ప్రకటనలతో బలపడుతున్న అనుమానాలు

రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందన్న మాజీ సీఎస్‌ల వ్యాఖ్యలకు అద్దం పడుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు

తాను స్వయంగా ప్రచారంలో పాల్గొనడంతోపాటు టీడీపీ పోటీ చేసిన తెలంగాణలో ఫలితాలపై స్పందించని చంద్రబాబు

కేసుల నుంచి బాబుకు రక్షణ..ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆర్థిక సాయం.. ఇదీ డీల్‌

ఎన్నికలకు ముందు అమరావతిలో చంద్రబాబుతో గెహ్లోత్‌ భేటీ వెనక ఆంతర్యం ఇదే!

సాక్షి, అమరావతి బ్యూరో: కాంగ్రెస్‌ పార్టీతో సీఎం చంద్రబాబు మైత్రి బంధం వెనుక దాగిన అవినీతి బంధం బట్టబయలైంది! అవినీతి, కేసుల భయంతో అండ కోసం కాంగ్రెస్‌ను ఆశ్రయించిన చంద్రబాబు అందుకు ప్రతిఫలంగా ఆ పార్టీకి ఎన్నికల ఖజానా మాదిరిగా మారారు. తన వల్లే  రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఓడిపోయిందని చంద్రబాబు స్వయంగా ప్రకటించడం వెనుక అసలు మర్మం ఇదేనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేసిన తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు... మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చెందడం తన ఘనతేనని చెప్పుకోవడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. అసలు టీడీపీ ఉనికే లేని ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి చంద్రబాబు ఎలా కారణమయ్యారన్నది కీలక ప్రశ్నగా మారింది. 

ఆయన చేసిన కృషి.. కాంగ్రెస్‌కు డబ్బు సర్దటమే!
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు..   మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీగా నిధులు సమకూర్చడమే బీజేపీ ఓటమికి ఆయన వంతుగా చేసిన కృషి అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకనే ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకున్నారని తేటతెల్లమవుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు పొడిచినప్పుడే ఈ మేరకు ఆ పార్టీతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు – కాంగ్రెస్‌ అవినీతి బంధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

వ్యవస్థలను కుప్పకూల్చి దోపిడీ
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న అవినీతికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. రాజధాని ప్రాంత భూములు,  బినామీ సంస్థల బాగోతాలు,  సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భూముల ధారాదత్తం, ఐటీ ప్రాజెక్టులు, గనులు–ఇసుక క్వారీలు, సింగపూర్‌... ఇలా ఒకటేమిటి అన్ని విధాలుగా పంచభూతాలను 

కొల్లగొడుతూ అస్మదీయులకు కట్టబెడుతూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌ సంస్థలతో స్విస్‌ ఛాలెంజ్‌ విధానం ద్వారా భారీ అవినీతికి తెగించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేసి సహజ వనరులను దోపిడీ చేస్తూ దాదాపు రూ.3 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 

అవినీతిని నిర్ధారిస్తున్న ఉన్నతాధికారులు..
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శులుగా చేసిన ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయ కల్లం లాంటి ఉన్నతాధికారులే టీడీపీ సర్కారు అవినీతి బాగోతాన్ని సోదాహరణంగా ప్రజలకు వివరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజరికపు పోకడలతో రాష్ట్ర ప్రభుత్వం బరితెగించి అవినీతికి పాల్పడుతోందని వారు విమర్శించడం తెలిసిందే. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ అవినీతి బాగోతంపై పలువురు న్యాయస్థాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో టీడీపీ నేతల అవినీతి బండారం బట్టబయలవుతోంది. రాజధాని వ్యవహారాల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే ఆదాయపన్ను శాఖ సీబీఐకి సమాచారం కూడా ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూపీ లాగుతున్నాయి. 

కేసుల భయంతో కాంగ్రెస్‌ పంచన.. 
చంద్రబాబు అవినీతి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడం, వీటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించడంతో బీజేపీ – టీడీపీ సంబంధాలు దెబ్బతిన్నాయి.  కేంద్ర ప్రభుత్వం తన అవినీతి బండారాన్ని బయటపెట్టి కేసులు నమోదు చేస్తే జాతీయ స్థాయిలో తనకు కాంగ్రెస్‌ అండ అవసరమని చంద్రబాబు భావించారు. అందుకనే టీడీపీకి బద్ధ విరోధి అయిన కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ ఎన్నికలను సాకుగా చేసుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. తనకు తెలంగాణ ఎన్నికలు ముఖ్యం కాదని,  కేసుల నుంచి బయటపడేలా సహకరించాలని చంద్రబాబు కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని కోరినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతుండటం గమనార్హం. ఈమేరకు చంద్రబాబు, కాంగ్రెస్‌ల మధ్య డీల్‌ కుదిరినట్లు పేర్కొంటున్నారు.

అశోక్‌ గెహ్లోత్‌ వచ్చింది అందుకే..!
సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు అత్యంత విశ్వాసపాత్రుడైన రాజస్థాన్‌ కాంగ్రెస్‌  సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లోత్‌ నవంబర్‌ 10న అమరావతి వచ్చి చంద్రబాబును కలిశారు. అప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ లలో ఎన్నికల వేడి బాగా రాజుకుంది. రాజస్థాన్‌న్‌సీఎం కుర్చీని ఆశిస్తున్న అశోక్‌ గెహ్లోత్‌ ఎన్నికల కసరత్తులో తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి కీలక తరుణంలో కూడా ఆయన అమరావతి వచ్చి చంద్రబాబుతో ఆంతరంగికంగా భేటీ కావడం గమనార్హం. ముఖ్యమైన వ్యవహారంపైనే ఆయన ఏపీకి వచ్చారని తాజాగా వెలుగులోకి వచ్చింది. కేసుల భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడుతున్నారని కాంగ్రెస్‌ అధిష్టానం గుర్తించింది. జాతీయ స్థాయిలో తనకు అండగా ఉంటే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆర్థిక సహకారం అందిస్తానని చంద్రబాబు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే మూడు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు కింద బాబు డబ్బులు పంపేలా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. హఠాత్తుగా గెహ్లోత్‌ రాక వెనక ఆంతర్యం ఇదేనని పేర్కొంటున్నారు. 

నిధుల కొరతతో సతమతమైన కాంగ్రెస్‌.. 
కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో లేకపోవడం, 15 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు ఐదేళ్లుగా అధికారంలో లేని రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికలు రావడంతో ఆ పార్టీని నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. కేసుల భయంతో చంద్రబాబు తమ శరణుజొచ్చడంతో ఆ పార్టీ అధిష్టానం దీన్ని ఓ అవకాశంగా చేసుకుని ఎన్నికల కోసం నిధులు సమకూర్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.   

తెలంగాణాకే రూ.1,200 కోట్లు...! 
కాంగ్రెస్‌తో పొత్తుతో తెలంగాణలో టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేసింది. ఆ స్థానాల్లోనే కాకుండా తెలంగాణ అంతటా కాంగ్రెస్‌ ఎన్నికల వ్యయంలో సింహభాగాన్ని బాబు భరించారు. రాష్ట్ర మంత్రులు,  టీడీపీ కీలక నేతలు తెలంగాణలో తిష్టవేసి దాదాపు రూ.1,200 కోట్లు వెచ్చించినట్టు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మొదట్లో ఇది రూ.500 కోట్లుగా ప్రచారం జరిగినప్పటికీ వారం రోజులకుపైగా తెలంగాణలోని ప్రసార సాధనాల్లో పెద్ద ఎత్తున ప్రజా కూటమి తరపున ప్రకటనలు వెలువడటం,  కూటమి అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కింద డబ్బును సర్దటం లాంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే దాదాపు రూ.1,200 కోట్ల దాకా తెలంగాణ ఎన్నికల్లో బాబు ఖర్చు చేసినట్లు పేర్కొంటున్నారు. ఒక్క తెలంగాణలోనే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లారంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు ఆయన ఎన్ని వేల కోట్ల రూపాయలు పంపి ఉంటారో అనే చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. 

స్వల్ప మెజార్టీలతో గట్టెక్కిన కాంగ్రెస్‌ అభ్యర్థులు
తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ ముఖ్యనేతలు, చంద్రబాబు సన్నిహితులు అంతా మిగతా మూడు రాష్ట్రాల్లోనే మకాం వేశారు. హవాలా మార్గంలో అక్కడకు రూ. వేల కోట్లు తరలించారు. అప్పటివరకు అక్కడ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహం నిరుత్సాహంగా సాగింది. అయితే టీడీపీ నిధులు రావడంతోనే కాంగ్రెస్‌ జోరు పెంచింది. చివరి నిమిషంలో భారీ స్థాయిలో నిధులు వెదజల్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 109 సీట్లు గెలుచుకోగా... అంతకంటే కొంచెం ఎక్కువగా  కాంగ్రెస్‌ 114 సీట్లులో విజయం సాధించింది. చివరి నిమిషంలో అనుసరించిన వ్యూహంతో 32 స్థానాల్లో కాంగ్రెస్‌ వెయ్యి లోపు ఓట్ల మెజార్టీతో గెలిచి అధికారానికి చేరువైంది. గత ఎన్నికల కంటే బీజేపీకి 2 శాతం ఓట్లు పెరిగినప్పటికీ సీట్లు మాత్రం తగ్గడం వెనుక కాంగ్రెస్‌ చివరి నిముషంలో పాటించిన వ్యూహమే కారణమని విశ్లేషిస్తున్నారు. 

కేసుల నుంచి రక్షణకు కాంగ్రెస్‌కు కప్పం!
పోలింగ్‌కు ముందు టీడీపీ నుంచి భారీగా అందిన నిధులతోనే కాంగ్రెస్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌ను సమర్థంగా అమలు చేసింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోని గిరిజన ప్రాంతాలను ఎంపిక చేసుకుని టీడీపీ నిధులు పంపిణీ చేసినట్లు సమాచారం. ఆ ప్రాంతాల్లో సాధారణంగా వెచ్చించే ఎన్నికల వ్యయానికి దాదాపు మూడురెట్లు అధికంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈసారి ఖర్చు చేయడమే దీనికి నిదర్శనం అంటున్నారు. పోటాపోటీగా ఎన్నికలు జరిగిన ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అతికష్టం మీద గెలవడం వెనుక చంద్రబాబు నిధుల పంపిణీ వ్యవహారం కీలక పాత్ర పోషించినట్లు రెండు పార్టీల నేతలూ అంగీకరిస్తున్నారు. అనూహ్యంగా డబ్బు పంపిణీతో రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారాయని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రాన్ని కొల్లగొడుతూ అవినీతికి పాల్పడుతున్న టీడీపీ సర్కారు కేసుల నుంచి రక్షణ పొందేందుకు కాంగ్రెస్‌కు కప్పం కడుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు