కేంద్రాన్ని వదిలేది లేదు

19 Jan, 2019 03:43 IST|Sakshi

అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులా? 

రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసింది

కేసీఆర్‌ ఒక్క గిఫ్ట్‌ ఇస్తే మేం మూడు గిఫ్ట్‌లు ఇస్తాం

ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌ వైద్యసేవ పరిమితి పెంపు

ఎన్టీఆర్‌ యుగపురుషుడు సత్తెనపల్లిలో సీఎం చంద్రబాబు

సత్తెనపల్లి/సాక్షి, అమరావతి: రాష్ట్రానికి న్యాయం చేసేవరకు కేంద్రాన్ని వదిలేదిలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విభజన ద్వారా దగాపడ్డ రాష్ట్రానికి జాతీయ పార్టీ అండగా ఉండాలని భావించి ఆనాడు ఎన్డీఏలో భాగస్వాముల మయ్యామని.. మనకు న్యాయం చేస్తామంటే నమ్మామని, కానీ.. బీజేపీ ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో శుక్రవారం తారకరామ సాగర్, ఎన్టీఆర్‌ గార్డెన్‌లతోపాటు అభివృద్ధి చేసిన వావిలాల గోపాలకృష్ణయ్య ఘాట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ యుగపురుషుడని, ఆయనకు ఆయనే పోటీ తప్ప ఎవరికీ ఆయనతో పోలికేలేదని చెప్పారు. తెలుగు జాతి ఉన్నంతవరకు వారి గుండెల్లో ఉండే నాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. స్వాతంత్య్రం కోసం వావిలాల పోరాడితే, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ పోరాడారని కొనియాడారు. కేంద్ర నియంతృత్వం, రాష్ట్రాల హక్కులపై ఎన్టీఆర్‌ పోరాడారని గుర్తుచేశారు. తాము కూడా కేంద్రం సహకరించకపోయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఎక్కడా సంక్షోభం రాకుండా వ్యవసాయ, అనుబంధ రంగాలపై శ్రద్ధ పెట్టామని.. గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేశామని చంద్రబాబు అన్నారు. వచ్చే జూన్‌కల్లా గ్రావిటీతో పోలవరం నుంచి నీటిని తీసుకొస్తామని చెప్పారు.

అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులా?
కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రంలోని రైతులను రూ.24 వేల కోట్లతో రుణవిముక్తులను చేశామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి గాయం తగిలి బాధతో ఉంటే దానిపై కేంద్రం కారం చల్లి ఆనందించాలని చూస్తోందని విమర్శించారు. కేంద్రం చేసే అన్యాయాన్ని ప్రశ్నిస్తే సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. మోదీతో బాగున్నంత వరకు కేసీఆర్‌ కూడా మనతో బాగానే ఉన్నారని, మోదీతో విడిపోయాక కేసీఆర్‌ తనపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ ఏదో నాకు గిఫ్ట్‌ ఇస్తానని బెదిరిస్తున్నారని.. ఆయన ఒక గిఫ్ట్‌ ఇస్తే తిరిగి మూడు గిఫ్ట్‌లు ఇస్తాం తప్ప చేతకాని వాళ్లం కాదన్నారు. కేంద్ర హోంమంత్రి ఈరోజు కడపలో పర్యటిస్తున్నారని, ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసి మళ్లీ ఎందుకు వచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. కాగా, ఇప్పటివరకు రూ.2.50 లక్షలుగా ఉన్న ఎన్టీఆర్‌ వైద్యసేవ పరిమితిని ఏప్రిల్‌ నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని ఆయన ప్రకటించారు. అంతకుముందు సీఎం.. కేంద్రీయ విద్యాలయ భవనానికి, సత్తెనపల్లి–అచ్చంపేట మార్గంలోని ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొండమోడు–మాచర్ల రహదారి విస్తరణకు రూ.700 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు శ్రావణ్, శ్రీధర్, ఆంజనేయులు, ఎమ్మెల్సీ రామకృష్ణ, జెడ్పీ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్, నన్నపనేని రాజకుమారి, జేఆర్‌ పుష్పరాజ్, జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ స్పూర్తితో పనిచేయాలి 
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ కోసం అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎన్టీఆర్‌ వర్థంతి ఒక సంకల్ప దినమని, ఆయన ఆదర్శాలకు అందరూ పునరంకితం కావాల్సిన రోజన్నారు. ఎన్నికలకు ఇంకా వంద రోజులే ఉన్నాయని, ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలన్నారు. కోల్‌కతలో శనివారం జరగనున్న బీజేపీయేతర పార్టీల ర్యాలీకి తాను హాజరవుతున్నానని సీఎం తెలిపారు. జన్మభూమిలో వచ్చిన వినతులన్నీ పరిష్కరిస్తున్నామని, 2019–24 అభివృద్ధి ప్రణాళికలను రూపొందించామన్నారు.

>
మరిన్ని వార్తలు