నేను చూస్తా ఎలక్షన్‌ కమిషన్‌ ఏంటో

11 Apr, 2019 02:45 IST|Sakshi
సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిపై సీరియస్‌ అవుతున్న సీఎం చంద్రబాబు

సీఈవో ద్వివేదిపై చంద్రబాబు చిందులు

అంత ఈజీగా వదిలిపెట్టను

నేను టేకప్‌ చేశానంటే అంతే

నువ్వు క్లర్క్‌వా? ఈసీ పోస్టాఫీస్‌ కాదు

ఐదు నిమిషాలు ధర్నా డ్రామా.. అనుకూల మీడియా ఫొటోలకు ఫోజులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని బెదిరిస్తూ.. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తోకపత్రిక రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వంతపాడి ప్రభుత్వ ఉద్యోగులను నీచాతి నీచంగా అవమానించిన చంద్రబాబు.. పోలింగ్‌కు ముందురోజు, ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా శివాలెత్తిపోతూ ఎన్నికల ప్రధాన అధికారిపై బెదిరింపులకు దిగడంతో అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. బుధవారం సచివాలయంలోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు ఆయన కార్యాలయంలోనే ద్వివేదిపై చిందులు తొక్కి ఇష్టానుసారం మాట్లాడారు. ఎన్నికల సంఘం ఎవరి పక్షాన పనిచేయట్లేదని ద్వివేది వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా వినకుండా ఎన్నికల సంఘాన్ని మూసేయాలని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు చేతులు చూపిఊ్త ఇష్టానుసారం మాట్లాడుతున్న సమయంలో సీఈఓ జోక్యం చేసుకుని ‘మీరంటే మాకు గౌరవం ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు మాత్రమే మేము అమలు చేస్తున్నాము..’ అని చెప్పగా.. మీది పోస్ట్‌ ఆఫీస్‌ కాదు.. కేంద్రం ఎన్నికల సంఘం చెప్పినట్లు ఎలా చేస్తారని రెచ్చిపోయి మాట్లాడడంతో అక్కడున్న మిగతా అధికారులు నివ్వెరపోయారు. తాము ఒకరి తరఫున పనిచేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, ఎన్నికల నిర్వహణలో తాము నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని, తమపై ఎవరి ఒత్తిడి లేదని ద్వివేది చెబుతున్నా చంద్రబాబు వినలేదు. ప్రతిపక్ష నాయకుడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు పనిచేస్తారా అంటూ ఇష్టానుసారం బెదిరింపులకు దిగారు. ఎన్నికల సంఘాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. ఎన్నికలను అడ్డు పెట్టుకుని రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారా అని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చున్న వాళ్లు చెప్పినట్లు చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని, సీఎస్, డీజీ, ముగ్గురు ఎస్‌పీలను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించి తాను ఎవరినీ ఊరికే వదలనని, అందరి సంగతి చూస్తానని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చే పేరుతో వచ్చిన చంద్రబాబు ఇలా అడ్డగోలుగా మాట్లాడడంతో సీఈఓ సహా ఎన్నికల సంఘం అధికారులంతా నివ్వెరపోయారు.

ఐదు నిమిషాల ధర్నా డ్రామా 
అనంతరం బయటకు వచ్చి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మీడియా సమావేశం నిర్వహించారు. మొట్ట మొదటిసారి ఒక ముఖ్యమంత్రి సీఈఓకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పిన ఆయన అది నియమావళికి విరుద్ధమని తెలిసి చివర్లో పార్టీ అధ్యక్షుడిగా తాను మాట్లాడుతున్నానని చెప్పడం విశేషం. కొద్దిసేపటికే వెళ్లిపోయేందుకు కారెక్కుతుండగా కొందరు అనుకూల మీడియా ప్రతినిధులు.. కాసేపు ఇక్కడ కూర్చోవాలని, ఫొటోలు తీసుకుంటామని చంద్రబాబుకు సూచించారు. దీంతో ఆయన వెనక్కి వచ్చి సీఈఓ కార్యాలయం బయట మెట్లపై టీడీపీ నేతలతో కలసి ఐదు నిమిషాలు కూర్చున్నారు. దీన్నే ఎల్లో మీడియా చంద్రబాబు సీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారంటూ కొద్దిసేపు హడావుడి చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా నలుగురు ఒకేచోట గుమిగూడి ఉండకూడదనే నిబంధనను ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుటే చంద్రబాబు పరివారం తుంగలో తొక్కడం గమనార్హం. 

చంద్రబాబు సీఈఓను ఏమన్నారంటే..
– ఎవరు వెరిఫైంగ్‌ అథారిటీ అండీ. మీరు చూడాలి. లేదంటే వాళ్లు (ఎలక్షన్‌ కమిషన్‌) చూడాలి. 
– ఇక మీ ఆఫీస్‌ ఎందుకు? క్లోజ్‌ చేసేయండి. ఎలక్షన్‌ కమిషన్‌ ఎవరు?. నేను అడుగుతున్నా. 
– సరిగా కండక్ట్‌ చేయలేకపోతే. ఏకపక్షంగా చేయండి. మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్‌ చేసుకుంటారు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్స్‌. మేం అందరం ఇంట్లో పడుకుంటాం. 
– మేం అడిగేది ఏంటి? మీరు ఇండిపెండెంట్‌ ఆథారిటీ అవునా.. కాదా?. 
– ఢిల్లీ చెప్పినట్లు యాజ్‌ టీజ్‌గా మీరు ఎందుకు ఫాలో కావాలి? మీకు ఆత్మసాక్షి ఉందిగా. మీది పోస్ట్‌ ఆఫీస్‌ కాదు. మీకు అధికారాలు ఉన్నాయి. లేకపోతే రద్దు చేసేయమనండి. అందరినీ తీసేయమనండి. ఓ క్లర్కును పెట్టుకుని చేసేయమనండి. 
– మేం చూస్తాం. రేపు ఎలక్షన్‌ కమిషన్‌ ఏంటో. అంత ఈజీగా నేను వదిలిపెట్టను.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు