మీ కుమ్ములాటలే కొంపముంచుతున్నాయ్‌

5 May, 2019 03:23 IST|Sakshi

ఎన్నికల సమీక్షలో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

పోల్‌ మేనేజ్‌మెంట్‌లో మనం వెనకబడ్డాం

అధికారంలోకి రావాల్సిన మనం ఆలోచించే పరిస్థితి వచ్చింది

బూత్‌లలో ఓట్లేయించలేని వారు రాష్ట్ర నేతలా?

సాక్షి, అమరావతి:  పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు, కుమ్ములాటలే టీడీపీ కొంప ముంచుతున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేతల్లో అనైక్యతతోపాటు పోల్‌ మేనేజ్‌మెంట్‌లో వెనుకబడి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కూడగట్టి ఎన్నికలకు వెళ్లకుండా ఇక్కడ మైకులు పట్టుకుని ఏవేవో మాట్లాడుతున్నారని శనివారం రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధి నేతలతో నిర్వహించిన ఎన్నికల సమీక్ష సమావేశంలో మండిపడ్డారు. ‘అధికారంలోకి రావాల్సిన మనం మీ అహం, మీ తీరుతో ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. మీరంతా సమష్టిగా వ్యవహరించకుండా ఇక్కడకు వచ్చి మైకుల్లో ప్రసంగాలు ఇస్తే ప్రయోజనమేంటి? పార్టీలో మీ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక, మీరు చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చా. మీరంతా కలిసి పనిచేస్తే ఈరోజు ఇలా గెలుపుపై ఆలోచించాల్సిన అవసరం వచ్చేది కాదు’అని పార్టీ నేతలతో చంద్రబాబు పేర్కొన్నారు. 

గోరంట్ల, ఆదిరెడ్డిపై ఆగ్రహం 
ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంపై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. బూత్‌ స్థాయిలో ఓట్లు వేయించలేని వారు రాష్ట్ర స్థాయి నేతలుగా చలామణి అయిపోతే ఎలా? అని నిలదీశారు. ఇలాంటి నాయకులను పెట్టుకుని నేనేం చేయాలి? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు