పేలని రెయిన్‌ గన్‌!

28 Mar, 2019 09:28 IST|Sakshi
శివన్న పొలంలో రెయిన్‌గన్‌ ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు(ఫైల్‌), గోదాముల్లో పంట సంజీవిని పరికరాలు

సాక్షి,అనంతపురం అగ్రికల్చర్‌: 2016 జూన్‌లో మంచి వర్షాలు పడ్డాయి. జూలైలో మోస్తరుగా వర్షం కురిసింది. అరకొర వర్షాలకు ఎలాగోలా జిల్లా రైతులు ఖరీఫ్‌లో 15.22 లక్షల ఎకరాల్లో వేరుశనగ, మరో 3.95 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు... మొత్తం 19.17 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అయితే ఎప్పటిలాగే పంట వేసిన తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. 20 లక్షల ఎకరాల ఖరీఫ్‌ కకావికలమైంది. పంటలన్నీ ఎండిపోయాయి.  రూ.వందల కోట్ల పెట్టుబడులు భూమిలో కలిసిపోయాయి. రూ.వేల కోట్ల పంట దిగుబడులు గాలిమేడలా కూలిపోయాయి. సీఎం చంద్రబాబు మాత్రం దీన్ని అంగీకరించలేదు. అనంతపురం జిల్లాను చూసి కరువే భయపడేలా చేస్తానంటూ బీరాలు పలికాడు. రెయిన్‌గన్లు సిద్ధం చేసినట్లు రైతులకు లేనిపోని ఆశలు కల్పించాడు. ట్యాకర్లతో నీళ్లు తోలించి ఎండిపోయిన పొలాల్లో పంట సంజీవిని రక్షకతడి ఇచ్చానంటూ నాటకం ఆడాడు. ఇతర జిల్లాల నుంచి రాత్రికి రాత్రి పరికరాలు తెప్పించారు. కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు నానా హడావిడి చేశారు. 

రూ.700 కోట్లు వృథా 
చంద్రబాబు ఆరు రోజుల డ్రామా తర్వాత ఏకంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి రైతులకు రూ.700 కోట్లు విలువ చేసే వేరుశనగ రక్షించానని గొప్పలు చెప్పేసి చేతులు దులుపుకున్నారు. రెయిన్‌గన్ల షోతో జిల్లాలో మకాం వేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ఈ డ్రామా వ్యవహారాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. అయితే రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు సీఎం వైఖరిపై దుమ్మెత్తిపోయడంతో రెయిన్‌గన్ల సినిమా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. రెయిన్‌గన్లు, ఇతర పరికరాలకు రూ.70 కోట్లు, నీటి తడులు ఇవ్వడానికి, ఇతరత్రా ఖర్చుల కింద మరో రూ.50 కోట్లు మంచినీళ్లులా ఖర్చు పెట్టేశారు.

కానీ... ఎకరా వేరుశనగ పంటను కాపాడలేకపోయారు. చివరకు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే వెళ్లి రెయిన్‌గన్లు ద్వారా నీటి తడులు ఇచ్చిన అమడగూరు మండలం గుండువారిపల్లిలో శివయ్య పొలం, గుమ్మగట్ట మండలం పూలకుంటలో నాగప్పకు చెందిన వేరుశనగను పొలం కూడా ఎండిపోగా..ఆ రైతులు గగ్గోలు పెట్టారు. మరోవైపు పంట సంజీవిని పరికరాల్లో 40 శాతం వరకు ఇప్పటికీ తెలుగు తమ్ముళ్ల చేతిలోనే ఉండిపోయాయి. అందులో కొన్ని అమ్ముకోగా, మరికొన్ని దాచిపెట్టుకున్నారు. మిగతా 60 శాతం పరికరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరించి గోదాముల్లో నిల్వ ఉంచగా అవి మరమ్మత్తులకు గురైనట్లు చెబుతున్నారు. 

అంతా బూటకం 
రక్షకతడి ఇచ్చి వేరుశనగ పంటను కాపాడుతానంటూ 2016 ఆగస్టు చివర, సెప్టెంబర్‌ మొదటి వారంలో సీఎం చంద్రబాబు చేసిన నాటకం బూటకమని రైతులు పెదవి విరిచారు. పంట సంజీవని కింద రూ.70 కోట్లు విలువ చేసే 6,426 రెయిన్‌గన్లు, 5,894 స్ప్రింక్లర్లు, 4,306 డీజిల్‌ ఇంజిన్లు, 4.11 లక్షల సంఖ్యలో హెడ్‌డీపీఈ పైపులు జిల్లాకు తెప్పించారు. ఇవన్నీ జూలై మూడో వారంలోనే జిల్లాకు చేర్చారు. కానీ... ఆగస్టు 21న రక్షకతడి ఇవ్వడం ప్రారంభించారు. అప్పటికే లక్షల ఎకరాల్లో వేరుశనగ ఎండుముఖం పట్టింది. కీలకమైన ఆగస్టులో 88.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 18.1 మి.మీ నమోదు కావడంతో పంట పొలాలు దెబ్బతిన్నాయి.  

రెండుసార్లు జిల్లా పర్యటనకు వచ్చినా 
పంటలు ఎండిపోతున్న సమయంలోనే సీఎం రెండు సార్లు జిల్లాలో పర్యటించారు. ఆగస్టు 6న ధర్మవరం, 15న స్వాతంత్య్ర వేడుకలకు హాజరైనా.... పంటల గురించి పట్టించుకోలేదు. తర్వాత ఆగస్టు 28న జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు.. రక్షకతడి పేరిట ఆరు రోజుల పాటు హంగామా చేశారు. పంట ఎండిపోయిన విషయం తెలియదన్నారు. నీళ్లు లేకున్నా చెరువులు, ఫారంపాండ్లు, బోరు బావుల నుంచి ట్యాంకర్లు, ఫైర్‌ ఇంజిన్లు, డీజిల్‌ ఇంజిన్ల ద్వారా రేయిన్‌గన్లు, స్ప్రింక్లర్లతో నీటి తడులు ఇచ్చి 4 లక్షల ఎకరాల వేరుశనగ పంటను కాపాడినట్లు కాకి లెక్కలతో బురిడీ కొట్టించారు. రక్షకతడి మాటున ఇన్‌పుట్‌సబ్సిడీ ఎగ్గొట్టాలని శతవిధాలా ప్రయత్నించినా... రైతులు, రైతు సంఘాలు, విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోయడంతో చివరకు వెనక్కితగ్గారు.   

‘‘2016 ఆగస్టు 27న రాత్రి అధికారులు, టీడీపీ నాయకులు మా ఇంటి దగ్గరకు వచ్చారు. రేపు సీఎం చంద్రబాబు నీ పొలంలోకి వస్తాడు..పొలం దగ్గరే ఫారంపాండ్‌ తవ్వుతామన్నారు. రాత్రికి రాత్రే జేసీబీతో గుంతతవ్వారు.. తెల్లారే సరికి ఫారంపాండ్‌ చుట్టూ పూలు అలంకరించారు. ఏర్పాట్ల పేరుతో నా పొలంలోని వేరుశనగ మొక్కలన్నీ తొక్కి పాడు చేశారు. సీఎం చంద్రబాబు నన్ను పిలిచి...శివన్నా పంట ఎండిపోతోందని బాధ పడుతున్నావా..? ఏం బాధ పడకు నిన్ను ఆదుకోవడానికే నేను వచ్చాను అన్నాడు.

వరుణ దేవున్ని నమ్ముకోవద్దు...నన్ను నమ్ము... వాన కురవకపోయినా నీ పంటను కాపాడుతా అన్నాడు. వెంటనే అధికారులు జనరేటర్‌ను ఆన్‌ చేశారు. సీఎం చంద్రబాబు పొలంలోకి వచ్చి అదేదో రెయిన్‌గన్‌ను ఆన్‌ చేసి నీటిని సరఫరా చేశాడు. నీ పంట చేతికొచ్చే దాకా నీటిని సరఫరా చేస్తామన్నాడు. నేను ఇంటికొచ్చి మధ్యాహ్న భోజనం తిని పొలం వద్దకు వెళ్లగానే ఫారంపాండ్‌లో వేసిన టార్ఫాలిన్‌ లేదూ, పొలంలోని గన్‌లు లేవు. పంటంతా ఎండిపోయింది. ఐదెకరాల్లో పంటకు పెట్టిన పెట్టుబడులు రూ 80 వేలకు 20 కేజీల వేరుశనగ కాయలు దిగుబడి వచ్చింది. సీఎం చంద్రబాబే  నా పొలంలోకి వచ్చినా నన్ను ఆదుకోకపోగా పంట నష్టం కూడా చేతికి ఇవ్వలేదు. ఇలాంటి సీఎంను ఎక్కడా చూల్లేదు ’’– శివన్న, రైతు, గుండువారిపల్లి, అమడగూరు మండలం   

మరిన్ని వార్తలు