బాబు చేసిన పాపం..సర్కారు బడులకది శాపం

5 Apr, 2019 10:35 IST|Sakshi
మూతపడిన గంగమ్మ దేవాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాల

ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకోని ప్రభుత్వం  

విద్యార్థులు లేని కారణంగా ఐదేళ్లలో 

208 పాఠశాలలు మూత

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఇబ్బందులు  

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం, అన్ని పాఠశాలలకు మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేదికలెక్కిన ప్రతిచోట ఊపదంపుడు ఉపన్యాసాలను చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి చూస్తే మేడిపండు చందంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో çసరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం, సరైన మౌలిక వసతులు కల్పించలేక పోవడంతోపాటు పిల్లల చదువుపై అంతగా భరోసా ఇచ్చే పాలకులు కానీ అధికారులు గానీ లేరు.

ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. విద్యార్థులు లేని కారణంగా రేషనలైజేషన్‌ పేరుతో గత ఐదేళ్లలో జిల్లాలో 208 పాఠశాలలు మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక విద్య పిల్లల భవిష్యత్తుకు పునాది లాంటిది. అలాంటి పునాదిగా ఉండే ప్రాథమిక విద్యాలయాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మొక్కుబడులుగా మారాయి. దీంతో పేద వర్గాల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడుతున్న ప్రభుత్వ ప్రాథమిక  పాఠశాలలు ఈ రోజు పిల్లలు లేక కళావిహీనంగా మారాయి.

ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టని కారణంగా ఏటేటా మూతపడే స్కూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని పాఠశాలలు మూతపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉన్న ఊరిలో బడులు మూసేయడంతో పొరుగు ఊళ్లకు పిల్లలను పంపడం భారంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కాన్వెంటులకు పంపుకునే స్థోమత లేని తల్లిదండ్రులు  తమ పిల్లలు డ్రాపౌట్స్‌గా మారి బాల  కార్మికులుగా మారుతున్నారని ఆందోళన చెందుతున్నారు.  

2017 ఏడాదిలో 70 స్కూళ్లు 
జిల్లాలో 2017లో విద్యార్థుల సంఖ్య లేని కారణంగా 70 స్కూళ్లు మూతపడ్డాయి.  ఇందులో బి.మఠం మండలంలో 3 స్కూళ్లు, కాశినాయనలో 3, టి.సుండుపల్లెలో 6, వేములలో 4, ఒంటిమిట్టలో 3, బి.కోడూరులో 2, సీకే దిన్నెలో 2, చక్రాయపల్లెలో 2, చిన్నమండెంలో 2, కలసపాడులో 2 కమలాపురంలో 2, ఖాజీపేటలో 2, ఎల్‌ఆర్‌పల్లెలో 2, నందలూరులో 2, పెండ్లిమర్రిలో 2, రాయచోటిలో 2, సంబేపల్లెలో 2, సిద్దవటంలో రెండు పాఠశాలలతోపాటు పలు మండలాల్లో పలు పాఠశాలలు మూతపడ్డాయి.  

కనుమరుగవుతున్న పాఠశాలలు:
జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న  ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటంతో  రేషనలైజేషన్‌ పేరుతో 2015లో 136 పాఠశాలలు మూతపడ్డాయి. ఇందులో అట్లూరు మండలంలో 7 స్కూళ్లు, బి.మఠం మండలంలో 5, చక్రాయపేటలో 9, చిన్నమండెంలో 6, కడపలో ఒకటి, జమ్మలమడులో 3, కలసపాడులో 3, కొండాపురంలో 3, ఎల్‌ఆర్‌పల్లిలో 5, ముద్దనూరులో 5, మైదుకూరులో 6, పెనగలూరులో 8. పెండ్లిమర్రిలో 5, పులివెందులలో 3, పుల్లంపేటలో 8, రాజంపేటలో 6, రాయచోటి 3, కాశినాయనలో 3, సంబేపల్లెలో 5, సుండుపల్లెలో 8, వల్లూరులో 3 స్కూళ్లతోపాటు పలు మండలాల్లోని పాఠశాలలు మూతపడ్డాయి. 

రెండు హైస్కూళ్లు సైతం..
జిల్లాలో రెండు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలను కూడా విద్యార్థుల సంఖ్యలేని కారణంగా మూసివేశారు. ఇందులో రాయచోటి మండలంలోని బి. అంబవరం, కమలాపురం మండలంలోని సి. రాజుపాలెం మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలను మూసి వేశారు. 

53 ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాలలుగా డిమోషన్‌
ప్రాథమికోన్నత పాఠశాలలు మనుగడ సాగించడానికి ప్రధానం కారణం టీచర్ల కొరతే. 6, 7 తరగతులకు బోధించాల్సిన సబ్జెక్టు టీచర్లను నియమించకుండా ఒకరిద్దరితోనే నెట్టుకురావడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు ఆయా స్కూళ్లకు పిల్లలను పంపేందుకు విముఖత చూపారు. ఫలితంగా జిల్లాలో 53 ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా డిమోషన్‌ చేశారు. ఇందులో అట్లూరు మండలంలో 3 యూపీ స్కూళ్లు, చాపాడులో 3, చిట్వేల్‌లో 4, కొండాపురంలో 4, పుల్లంపేటలో 3, తొండూరులో 4, బద్వేల్‌లో 2, గాలివీడులో 2, గోపవరంలో 2, లింగాలలో 2, మైలవరంలో 2, పులివెందులలో 2, సంబేపల్లెలో 2తో పాటు పలు మండలాల్లో ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా డిమోషన్‌ చేశారు. 

ఏకోపాధ్యాయుడు ఉన్నపాఠశాలలు 485
జిల్లాలో 1 నుంచి 5వ తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలల్లో  ఏకోపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు 485 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రాథమిక విద్య బలోపేతం ఎలాగో పాలకులకు అధికారులకే తెలియాíల్సి ఉంది. ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వ్యక్తిగత కారణాల చేత సెలవును పెడితే మాత్ర ఈ పాఠశాలలకు సెలవులను ప్రకటించాల్సిందే. లేకుంటే పక్క గ్రామంలోని టీచర్లను పిలిపించుకుని పాఠశాలలను నిర్వహించాలి.  

డీఈఓ పూల్‌లో 256 మంది ఉపాధ్యాయులు
జిల్లాలో ఉన్న  ప్రాథమిక పాఠశాలలు రేషనలైజేషన్‌ పేరుతో మూతపడటంతో ఆయా పాఠశాలల్లో పనిచేసే 256 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం డీఈఓ పూల్‌లో ఉన్నారు. వీరందరు పని ఒక చోట చేస్తే వీరికి జీతం మరోచోట ఇవ్వాల్సిన పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం పుణ్యమా అని జిల్లాలో సర్కారు చదువుకు తీవ్ర విఘాతం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బడులు మూత..విద్యార్థులకు వెత
జమ్మలమడుగు: జమ్మలమడుగు పట్టణం కోటవీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆ పాఠశాల విద్యార్థులను సమీపంలో ఉన్న ఈడిగపేట పాఠశాలలో కలిపి  కోటవీధిలో ఉన్న పాఠశాలను మూత వేసేశారు. గంగమ్మదేవాలయం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలను, ఎస్టీలకోసం ఏర్పాటు చేసిన శబరి కాలనీలో ప్రాథమిక పాఠశాలను సైతం విద్యార్థులు లేరంటూ మూసివేశారు. మండల పరిధిలోని సలివెందుల, శేషారెడ్డిపల్లె, ఒంటిమిద్దె ప్రభుత్వ పాఠశాలలను మూత వేశారు. ఈడిగపేట ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మత్తులకు, నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించలేదు.

సరైన మౌలిక వసతులు లేకపోవడంతోనే 
ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడంతోనే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడంలేదు. పాఠశాలలో  ఏకోపాధ్యాయులు ఉండటంతో ఆయన సెలవు పెడితే ఆరోజు పాఠశాల  మూత పడాల్సి వస్తోంది. – ఎం. ఆంజనేయులు, దళిత కాలనీ,జమ్మలమడుగు.

పిల్లలు లేరని మూసేశారు
పిల్లలు లేరనే నెపంతో ఉన్న స్కూల్‌ను మూతవేశారు. దీంతో మా ఊరి పిల్లలు చదువుకోవడానికి రెండు కిలో మీటర్ల దూరం పొలాల వెంట తిరుగుతూ వెళ్లాలి. లేదంటే ప్రైవేట్‌ పాఠశాలకు పంపాలి. ప్రైవేట్‌ పాఠశాలకు పంపాలంటే వేలకు వేలు డబ్బులు చెల్లించాలి. అంత డబ్బులు మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి. జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితే మా పిల్లలకు చదువులు వస్తాయేమోనని ఆశగా ఉన్నాము.
– వి. రాజశేఖర్, చిన్నమండెం

పేదల బిడ్డలకు చదువు దూరం చేస్తున్నారు
పిల్లలకు తక్కువ ఉన్నారని పేరుపెట్టి పేద పిల్లలకు చదువు లేకుండా చేస్తున్నారు. ఇదేమని అడిగితే పిల్లలు తక్కువగా ఉన్నారు. ఇంత తక్కువ మంది పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు ఎలా వస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పిల్లల చదువు కోసం కూడా వేలకు వేలు అప్పులు చేయాలి. అదే ప్రభుత్వ పాఠశాలలు అయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ప్రభుత్వం మారితే కానీ మా పిల్లలకు చదువులు అబ్బే రకం కనిపించడం లేదు. – పి. శివ, కమ్మపల్లె 

ప్రైవేట్‌ పాఠశాలకు పంపుతున్నాము 
మా ఊరిలోని ప్రాథమిక పాఠశాల మూత పడటంతో వేరే గ్రామంలోని పాఠశాలకు వెళ్లాలంటే చాలా దూరం ఉంది. పిల్లలను చదివించుకోవాలనే ఆశతో వేరే గత్యంతరం లేక ప్రైవేట్‌ పాఠశాలకు పంపుతున్నాము. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వస్తే మా ఊరి బడి మళ్లీ తెరుచుకొంటుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. 

రామచంద్రయ్య, పాలంగొల్లపల్లె 

పడకేసిన ప్రభుత్వ విద్య
రాజంపేట: రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలో రెండు, ఒంటిమిట్ట మండలంలో ఐదు పాఠశాలలు, సుండుపల్లెలో రెండు , నందలూరులో ఒకటి, రాజంపేట మండలంలో నాలుగు పాఠశాలలను ఎత్తివేశారు. పాఠశాలల ఎత్తివేసిన ప్రాంతాల్లోని పేద విద్యార్ధులు పొరుగు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక చాలామంది బడి మానేసుకున్నారు. 

ప్రభుత్వ విద్యకు జగన్‌ భరోసా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తాను సీఎం కాగానే నవరత్నాలు పథకాన్ని అమలు చేయడంలో భాగంగా పేదవాడి విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా చూస్తానని, పేద వర్గాలకు ఉచిత విద్యను మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజన కోసం అదనంగా ప్రతి యేటా ప్రతి విద్యార్ధికి రూ.20వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు.  

ప్రభుత్వ విద్యకు మంగళం 

బద్వేలుఅర్బన్‌ : బద్వేలు మండలంలో 56 ప్రాథమిక పాఠశాలలు, 6 ప్రాథమికోన్నత పాఠశాలలు, మూడు ఉన్నత పాఠశాలలు ఉండగా గత విద్యా సంవత్సరంలో రెండు ప్రాథమిక పాఠశాలలు, ఈ విద్యా సంవత్సరంలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయి. గత ఏడాది తిప్పనపల్లె, నందిపల్లె పాఠశాలలు మూతపడగా, ఈ ఏడాది గుండంరాజుపల్లె, విజయరామాపురం, అయ్యవారిపల్లె, వనంపుల పాఠశాలలు మూతపడ్డాయి.

పిల్లలు చదువుకు దూరమవుతున్నారు 
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకు చూపి  గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను గత ఏడాది మూసివేశారు. దీంతో పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో పాఠశాల ఉన్నప్పుడు రోజూ బడికి పోయేవాడు. ప్రస్తుతం దూరం కావడంతో బడికి సక్రమంగా వెళ్లడం లేదు. గ్రామంలోని పాఠశాలను తిరిగి తెరిపిస్తే ఉపయోగం ఉంటుంది.– మౌనిక, విజయరామాపురం 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు