బాబు మాటలన్నీ నీటి మూటలే: చేనేత కార్మికులు 

21 Mar, 2019 09:56 IST|Sakshi

అమలుకు నోచుకోని గత ఎన్నికల మేనిఫెస్టో

చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కుప్పలు తెప్పలుగా హామీల వర్షం కురిపించి.. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తకపోవడంతో చేనేతల బతుకులు అతుకు.. మెతుకు కరువై దుర్భరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాన్ని తలుచుకుని నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. 

సాక్షి, ప్రొద్దుటూరు :  జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాం నుంచి  ఆనవాయితీగా ఎక్కువ శాతం మంది టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం చేనేత కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. స్వయంగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు సైతం ప్రభుత్వం అమలు చేయలేదు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014 మే 4న ప్రొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్‌లో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. చేనేత ఐక్యవేదిక కన్వీనర్‌ అవ్వారు ప్రసాద్‌ చేనేత కార్మికులకు వర్క్‌షెడ్‌తో కూడిన ఇళ్లు మంజూరు చేయాలని కోరగా అందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అపెరల్‌ పార్కు కోసం కేటాయించిన 76.16 ఎకరాల స్థలాన్ని బదలాయించి మున్సిపల్‌ అధికారులు ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు. చేనేత కార్మికుల కోసం కేటాయించిన స్థలాన్ని ఇతరులకు ఎలా ఇస్తారని నేతన్నలు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది.  

ఈ హామీలు గుర్తున్నాయా బాబూ..!

  • చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు : ఎంతో మంది చేనేతలు గుర్తింపు కార్డులు లేక అవస్థలు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 22,142 మంది చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేశారు.
  • చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ : అసలు రుణాలే ఇవ్వలేదు. సొసైటీలకు మాత్రమే ఇచ్చారు. లబ్ధి పొందింది సొసైటీ నిర్వాహకులే. 
  • చేనేత కార్మికుల పిల్లలను చదివించేందుకు ప్రత్యేక ప్యాకేజీ, ఉచిత వైద్యం : అసలు అమలు కాలేదు. 
  • రూ.లక్షా 50వేలతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు ఏర్పాటు : చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం జరగలేదు. అసలు వర్క్‌షెడ్‌తో కూడిన ఇళ్లు ఏర్పాటు చేయలేదు. 
  • ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.లక్ష మేరకు సంస్థాగత రుణం :  అమలుకు నోచుకోలేదు. 
  • చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు : రుణాల ఊసే లేదు. 
  • రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు : జిల్లాలో అమలు కాలేదు.
  • ఉచిత ఆరోగ్య బీమా : గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐసీఐసీఐ లాంబార్డు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సహకారంతో 2005 నుంచి అమలు చేసిన ఆరోగ్య పథకం 2014 సెప్టెంబర్‌ 30తో ముగిసింది. తిరిగి ఈ పథకాన్ని అమలు చేయలేదు. 
  • చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి ముడిసరుకులను సరఫరా, మార్కెటింగ్‌ సౌకర్యాలను జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తాం. : ఈ విధానం అమలుకు నోచుకోలేదు. 
  • జిల్లాకు ఒక చేనేత పార్కును ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ, ఉపాధి : చేనేత పార్కు ఏర్పాటు చేయకపోగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ప్రొద్దుటూరులోని అపెరల్‌ పార్కు, మైలవరంలోని టెక్స్‌టైల్‌ పార్కు ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు.
  • సగం ధరకే జనతా వస్తాలు: జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ : గత ఐదేళ్లలో ఈ పథకం ఊసే లేదు. 
  • మగ్గాలకు ఉచిత విద్యుత్‌ : నేటికీ అమలుకు నోచుకోలేదు. విద్యుత్‌ చార్జీల భారంతో చేనేతలు అవస్థలు పడుతున్నారు. 
  • చేనేత ఉత్పత్తులపై ఆఫ్‌ సీజన్‌ సమయాల్లో రుణ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధర వచ్చేదాకా వాటిని నిల్వ ఉంచుకునే అవకాశం కల్పించడం. : ఈ పథకం అమలుకు నోచుకోలేదు. 
  • చేనేత పరిశ్రమల ఆధునికీకరణకు ప్రత్యేక విభాగం : ఏర్పాటు కాలేదు.  
మరిన్ని వార్తలు