చేయి కలుపుదాం

10 Sep, 2018 01:55 IST|Sakshi
ఎన్టీఆర్‌ భవన్‌లో పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకట్‌రెడ్డిలతో భేటీ అయిన రమణ, నామా నాగేశ్వర్‌రావు

     హస్తంతో దోస్తీకి టీటీడీపీ నేతలకు బాబు గ్రీన్‌సిగ్నల్‌

     కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు జరపాలని ఆదేశం 

     మూడు ఎన్నికల కమిటీలకు ఆమోదం

     మేనిఫెస్టో కమిటీ బాధ్యతలు దేవేందర్‌గౌడ్‌కు..

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు తెలంగాణ టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయి క్లియరెన్స్‌ ఇచ్చారు. శనివారం జరిగిన పార్టీ నేతల సమావేశాల్లో కాంగ్రెస్‌తో కలసి వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించిన బాబు.. ఆదివారం తన నివాసంలో జరిగిన సమావేశంలో పొత్తుపై మరింత స్పష్టతనిచ్చారు. ‘కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోండి. ఆ దిశగా చర్చలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోండి. మీరు ముందుకెళ్లండి. నేనున్నాను..’అని టీటీడీపీ చీఫ్‌ ఎల్‌.రమణతో పాటు ఇతర ముఖ్య నేతలకు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలను కలుపుకొని పోయే విషయంలో చొరవ తీసుకుని వ్యవహరించాలని సూచించారు.

చంద్రబాబు నుంచి పూర్తిస్థాయిలో ఆమోదం రావడంతో ఎల్‌.రమణ కూడా వేగంగా పావులు కదిపారు. వెంటనే కాంగ్రెస్, సీపీఐ, జనసమితి నేతలకు ఫోన్లు చేసి కలసి వెళ్లడం కోసం మాట్లాడుకుందాం రమ్మని ఆహ్వానించడం గమనార్హం. కాగా పార్టీ సమావేశంలో భాగంగా ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో, ప్రచార కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర నేతలు ప్రతిపాదించిన జాబితాకు కూడా బాబు ఆమోదం తెలిపారు. పార్టీ మేనిఫెస్టో తయారు చేసే బాధ్యతలను పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ టి.దేవేందర్‌గౌడ్‌కు అప్పగించారు. 

- ఎన్నికల సమన్వయ కమిటీ: ఎల్‌.రమణ, టి.దేవేందర్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు
- మేనిఫెస్టో కమిటీ: టి.దేవేందర్‌గౌడ్‌ (చైర్మన్‌), రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్సింహులు, అలీ మస్కతి, బండ్రు శోభారాణి 
- ప్రచార కమిటీ: గరికపాటి మోహన్‌రావు, సండ్ర వెంకటవీరయ్య, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, రమావత్‌ లక్ష్మణ్‌నాయక్‌

టీడీపీ–సీపీఐ పొత్తు ఖరారు 
వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేయాలని తెలుగుదేశం, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం ఇరు పార్టీల నేతలు ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఫోన్‌ చేసి ఆహ్వానించడంతో సీపీఐ నేతలు భవన్‌కు వచ్చి చర్చలు జరిపారు. భేటీ అనంతరం కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు.  

అందరితో మాట్లాడదాం: రమణ 
రమణతో పాటు పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అమరనాథ్‌బాబు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పార్టీ నేత పల్లా వెంకటరెడ్డి ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. గంట పాటు జరిగిన చర్చలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఇరు పార్టీలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. తమతో పాటు కాంగ్రెస్, ఇతర భావసారూçప్య పార్టీలను కలుపుకుని పోయేలా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలంటూ చర్చించడానికి బదులు అన్ని పార్టీలను పొత్తుకు ఒప్పించాలని.. ఆ తర్వాత సీట్లు, సర్దుబాట్లపై చర్చించాలని అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.  

కేసీఆర్‌ను గద్దె దింపుతాం: రమణ 
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపుతామని రమణ అన్నారు. కేసీఆర్‌కు రాజకీయ, నైతిక విలువల్లేవని విమర్శించారు. ఆయన కు సభలపై ఉన్న దృష్టి రైతులపై లేదన్నారు. రానున్న రోజుల్లో మహాకూటమి రాష్ట్రలో జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేడు, రేపు ఇతర పార్టీలతో కూడా చర్చిస్తామని.. కాంగ్రెస్‌కు ఇప్పటికే సమాచారం ఇచ్చామని వెల్లడించారు.  

గెలిచే స్థానాలే అడుగుతాం: చాడ 
కలసి వచ్చే అన్ని పార్టీలతో చర్చిస్తామని, మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. కేసీఆర్‌కు అధికారమే తప్ప రైతుల మీద ఆసక్తి లేదని విమర్శించారు. పోటీ చేయాల్సిన స్థానాలు ముఖ్యం కాదని, పోటీ చేసిన చోట గెలవాలని, చర్చల్లో గెలిచే స్థానాలే అడుగుతామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.  

నేడు కాంగ్రెస్‌తో చర్చలు! 
సోమవారం ఉదయం టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంతో టీడీపీ నేతలు సమావేశ మయ్యే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్, టీడీపీల మధ్య చర్చలు జరిగే అవకాశముంది. బంద్‌ నేపథ్యంలో ఒకవేళ సోమవారం చర్చలకు వీలు కాకపోతే మంగళవారం జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు