ఆస్పత్రి ఎదుట చంద్రబాబు హైడ్రామా

14 Jun, 2020 04:12 IST|Sakshi
గుంటూరు జీజీహెచ్‌ వద్ద మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు

నిబంధనల ప్రకారం రిమాండ్‌ ఖైదీని కలవకూడదు

కరోనా సమయంలో కలవడం అసలు సాధ్యమే కాదు

అన్నీ తెలిసినా ఆస్పత్రి వద్ద హడావుడి

సాక్షి, అమరావతి: జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఖైదీని కలవడం సాధ్యం కాదని.. అది నిబంధనలకు విరుద్ధమని తెలిసి కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి గుంటూరు జనరల్‌ ఆస్పత్రికి వెళ్లి అచ్చెన్నాయుడును కలుస్తానంటూ హంగామా చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలంటూ నిత్యం శ్రీరంగనీతులు చెప్పే చంద్రబాబు తనకు మాత్రం అవేమీ వర్తించవనే రీతిలో వ్యవహరించారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. తమ పార్టీ నాయకుడిని కలవడానికి అనుమతి ఇవ్వాలని జైళ్ల శాఖ ఉన్నతాధికారులను, ఆస్పత్రి సూపరింటెండ్‌ను టీడీపీ కార్యాలయం కోరింది. ఇందుకు నిబంధనలు ఒప్పుకోవని.. రిమాండ్‌ ఖైదీని కలవకూడదని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. అనుమతి తన పరిధిలోని అంశం కాదని, మెజిస్ట్రేట్‌ అనుమతి ఇస్తే కలవవచ్చని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కూడా స్పష్టం చేశారు. అయినా.. చంద్రబాబు నాయకులతో అచ్చెన్నాయుడు ఉన్న గదికి వెళతానని పోలీసులను కోరడం, వారు అనుమతి లేదనడం, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బయటకు పిలిపించి మాట్లాడటం.. ఇలా సుమారు గంట సేపు డ్రామా నడిపారు. ఆ తర్వాత ఆస్పత్రి ఆవరణలోనే మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రచారం కోసమే హడావుడి
రిమాండ్‌ ఖైదీని కలవకూడదనే నిబంధన 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడికి తెలియదా.. తెలిస్తే ఎందుకు వచ్చారని కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు టీడీపీ నేతలు ముసిముసి నవ్వులు నవ్వారు. నిబంధనల ప్రకారం కుదరదని తెలిసినా అనుమతి కోరడం.. లేదనిపించుకోవడం.. నిబంధనలు ఉల్లంఘించి మందీమార్బలంతో ఆస్పత్రికి రావడం వంటి మీడియాలో ప్రచారం కోసమే చేశారని టీడీపీ నేతలు కొందరు బహిరంగంగానే చెప్పడం గమనార్హం. ఏదో ఒక హడావుడి చేసి ప్రచారం పొందడం, ప్రజలను గందరగోళపరిచేలా పదేపదే వక్రీకరణ వ్యాఖ్యలు చేయడానికి ఆయన ఈ పర్యటన పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. 

అదే బాటలో లోకేష్‌
చంద్రబాబు కుమారుడు లోకేష్‌ కూడా శుక్రవారం రాత్రి అచ్చెన్నాయుడును కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్లినప్పుడు అక్కడికెళ్లి హంగామా సృష్టించారు. ఒకవైపు ఏసీబీ కోర్టు జడ్జి నివాసంలో నిందితుణ్ణి ప్రవేశపెట్టే ప్రక్రియ జరుగుతుండగా నిందితుణ్ణి కలుస్తానని లోకేష్‌ నాయకులతో కలిసి హడావుడి చేసి నవ్వుల పాలయ్యారు. జడ్జి నివాసంలో నిందితుణ్ణి కలవడానికి ఎవరైనా ప్రయత్నిస్తారా? అనుమతివ్వడం సాధ్యమా? ఇలా ఎందుకు చేశారంటే? మళ్లీ మీడియా.. ప్రచారం.. తమపై దౌర్జన్యం చేసేస్తున్నారని, ఏదో ఏదో జరిగిపోయిందని ప్రజల్లో అపోసహలు  సృష్టించడానికేనని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు గుంటూరు జనరల్‌ ఆస్పత్రిలో ఆడిన డ్రామానే అనంతపురంలో కొనసాగించడానికి లోకేష్‌ మళ్లీ సిద్ధమయ్యారు. ఆదివారం అనంతపురంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలవడానికి తనకు అనుమతివ్వాలని  కోరారు.  

మరిన్ని వార్తలు