పొత్తు కథ క్లైమాక్స్‌కు!

8 Sep, 2018 03:17 IST|Sakshi

తుది అంకానికి కాంగ్రెస్,టీడీపీ పొత్తు వ్యవహారం 

నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు 

కాంగ్రెస్‌తో జత కట్టడంపై టీటీడీపీ నేతలకు దిశానిర్దేశం 

కలసి పనిచేయడానికి సిద్ధమన్న ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కథ తుది అంకానికి చేరింది. శుక్రవారం ఇందుకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తమ్మీద ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారంపై శనివారం స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం హైదరాబాద్‌ వచ్చి తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానుండటం, టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు తెలుగుదేశంతో సహా అన్ని రాజకీయ పక్షాలు తమతో కలిసి రావాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ బహిరంగంగా ఆహ్వానం పలకడం వంటి పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అమరావతిలో పార్టీ సీనియర్లతో సమావేశమై కాంగ్రెస్‌తో పొత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. శనివారం హైదరాబాద్‌ వచ్చి ఆ దిశలో తెలంగాణ టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేసి వెళతారని, అనంతరం ఒకట్రెండు రోజుల్లోనే ఇరు పార్టీల రాష్ట్రస్థాయి నేతల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. కాగా, అన్నీ అనుకున్నట్టు జరిగితే చంద్రబాబు, ఉత్తమ్‌ శనివారమే భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. 

ఓ కన్ను.. ఇటువైపు 
తెలంగాణలో గత రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను తమ అధినేత చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్‌ ప్రకటన చేసిన తర్వాత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. అమరావతిలో అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం కూడా ఆయన ఎక్కువ సేపు తెలంగాణ రాజకీయాలపైనే దృష్టి సారించారు. అమరావతిలో మరోసారి పార్టీ సీనియర్‌ నేతలతో చర్చలు జరిపి, కాంగ్రెస్‌తో పొత్తుపై సంకేతాలిచ్చారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లేందుకు అవసరమైతే కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాల్సి వస్తుందని పార్టీ నేతలకు చంద్రబాబు తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తుపై పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడం కోసమే ఆయన శనివారం హైదరాబాద్‌ వస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

షెడ్యూల్‌ కంటే ముందుగానే...
కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు వ్యవహారంలో శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు ఇక లాంఛనమే అన్నట్టుగా అవి కనిపించాయి. గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన ఉత్తమ్‌.. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నియంత పాలనను అంతమొదించేందుకు అవసరమైన అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో కలిసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేయడం ఇందులో భాగమేనని తెలుస్తోంది. వాస్తవానికి శనివారమే రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరుగుతాయని భావించినా, ఇంకా ఆ దశకు అనుగుణంగా రాష్ట్రస్థాయి నేతలు సిద్ధం కాలేదని సమాచారం.

ఈ వ్యవహారంపై చంద్రబాబు నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత తీసుకున్న తర్వాత, మరోమారు రాష్ట్ర టీడీపీ నేతలు సమావేశమై కాంగ్రెస్‌ను చర్చలకు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారాన్ని ఖరారు చేయడానికే చంద్రబాబు అనుకున్న షెడ్యూల్‌ కంటే ముందుగా హైదరాబాద్‌ వస్తున్నారు. వాస్తవానికి, ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్‌ రావాల్సి ఉంది. అంతకు ముందు పార్టీ నేతలతో చర్చలు జరిపేందుకు ఉదయమే నగరానికి రానున్నారు. ఉదయం 10:15 నుంచి 11:45 వరకు లేక్‌వ్యూ అతిథిగృహంలో పార్టీ నేతలతో ఆయన సమావేశమవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.  

టీడీపీ ఆశిస్తున్న సీట్లు ఇవే 
కాంగ్రెస్, టీడీపీల పొత్తు వ్యవహారం చాలా రోజుల నుంచే జరుగుతోంది. రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా ఢిల్లీస్థాయిలో వయా అమరావతి నుంచి ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగాయి. హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు కొందరు టీడీపీ సలహాదారులతోనూ, ఓ సామాజిక వర్గానికి చెందిన పెద్దలతోనూ భేటీలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా 30 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలు కావాలని తొలుత టీడీపీ నుంచి ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత 25 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లు ఇవ్వాలని అడిగింది. అయితే, అన్ని సీట్లు ఇవ్వలేమని 15 అసెంబ్లీ, 1 లేదా 2 లోక్‌సభ స్థానాలు ఇస్తామన్న కాంగ్రెస్‌ ప్రతిపాదనకు టీడీపీ కూడా దాదాపు ఓకే చెప్పింది. శనివారం జరిగే చర్చల్లో ఏయే స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చేది ఖరారు కానున్నాయి.  

టీడీపీ కోరుతున్న అసెంబ్లీ స్థానాలు: కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, జూబ్లీహిల్స్, సత్తుపల్లి, కోరుట్ల, వనపర్తి లేదా దేవరకద్ర, మక్తల్, నిజామాబాద్‌ రూరల్, ఆర్మూరు, పరకాల, కోదాడ, జడ్చర్ల.  
లోక్‌సభ స్థానాలు: ఖమ్మం, ఆదిలాబాద్‌.

మరిన్ని వార్తలు