కాంగ్రెస్‌ సహకారం తీసుకుంటాం

26 Aug, 2018 03:14 IST|Sakshi

పొత్తుపై పరోక్షంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్య

యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటులో,మొన్నటి అవిశ్వాసంలో అడక్కుండానే కాంగ్రెస్‌ సహకరించింది

బ్రిటీష్‌ వారిపై పోరాడినట్లు బీజేపీపై పోరాటం

కర్నూలు ధర్మపోరాట సభలో సీఎం

సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ సీనియర్లు, పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారు. అవసరమైతే కాంగ్రెస్‌ సహకారం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం’ పేరుతో తెలుగుదేశం పార్టీ శనివారం కర్నూలు ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తమకు సహకరించిన సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటులో అడగకుండానే కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిందని, మొన్న బీజేపీపై అవిశ్వాస తీర్మానం సమయంలోనూ అడగకుండానే మద్దతు ప్రకటించిందని చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా ఇస్తామంటోందని కూడా ఆయన కాంగ్రెస్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అవసరమైనప్పుడు కచ్చితంగా సహకారం తీసుకుంటామని తేల్చి చెప్పారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందనే విషయం తమ పార్టీ నేతలకు సంకేతాలు పంపారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు. కర్నూలులో ఐఐఐటీ తరగతి గదులు ఇంకా ప్రారంభం కాలేదని, గిరిజన వర్సిటీని ఏర్పాటు చేసే ఉద్దేశం కూడా కేంద్రానికి లేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్‌ తీసుకున్నారని నరేంద్ర మోదీ తనను అంటున్నారని, ప్రత్యేక హోదా విషయంలో మోదీనే రాంగ్‌టర్న్‌ తీసుకున్నారని చెప్పారు. గతంలో బ్రిటీషువారిపై పోరాడామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీపై పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుమల వెంకన్న వడ్డీతో సహా వసూలు చేస్తారని, తిరుపతి సభ సాక్షిగా హామీ ఇచ్చిన మోదీ ఇచ్చిన హామీ అమలు చేయకపోతే వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక ఎంపీతో బీజేపీ కొత్త పార్టీ కూడా పెట్టిస్తోందని చంద్రబాబు చెప్పారు. 

ధర్మపోరాట దీక్ష వృథా..
సంక్షేమ పథకాలు కాకుండా దీర్ఘకాలిక ప్రాజెక్టులను చేపట్టాలని ఎంపీ దివాకర్‌రెడ్డి సభలో మాట్లాడుతూ సూచించారు. ఇక్కడున్న అందరూ చంద్రబాబును పక్కదారి పట్టిస్తున్నారని, తనకేం మంత్రి పదవి రాదని, చంద్రబాబు ఇచ్చేది కూడా లేదని, రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటానని చెప్పారు. ధర్మపోరాట దీక్షలు వృథా అని తేల్చి చెప్పారు. విభజనతో ఎక్కువగా నష్టపోయింది కర్నూలేనని, న్యాయం జరగలేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాజీ సుజనాచౌదరి, ఎంపీలు టీజీ వెంకటేష్, మాగంటి బాబు, నారాయణ, మురళీమోహన్, బుట్టా రేణుక, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు అఖిలప్రియ, దేవినేని ఉమా, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు