చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...

9 Dec, 2018 05:16 IST|Sakshi

ఎన్నికల ఫలితాలపై సీపీఎం అంచనా

టీఆర్‌ఎస్‌దే ప్రభుత్వమని విశ్లేషణ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్న తీరు.. ప్రజా కూటమిపై ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూపబోతోందని సీపీఎం అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని పేర్కొంది. మొదట్లో కాంగ్రెస్‌ కూటమికి అనుకూలంగా ఉండొచ్చునని భావించినా తెలంగాణ అనుకూల సెంటిమెంట్‌ పెరగడంతో ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. శనివారం మఖ్దూమ్‌ భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, బీఎల్‌ఎఫ్‌కున్న అవకాశాలను గురించి సమీక్షించారు.

పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, 17 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు హాజరయ్యారు. వివిధ వర్గాల ప్రజలకిచ్చే పింఛను డబ్బును పెంచడం, రైతుబంధు పథకం, సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వారి కోసం సంక్షేమ పథకాల అమలు, ఏదో ఒకరూపంలో లబ్ధి చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాలు టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాయని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావించినందువల్లే.. ఆ పార్టీకే మళ్లీ పట్టంగడుతున్నారని విశ్లేషించారు. మైనారిటీల ఓట్లు పెద్ద సంఖ్యలో పడటం కూడా టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశమన్నారు.

తెలంగాణ సెంటిమెంట్‌ మళ్లీ తెరపైకి...
తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, ఆయన వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణలో మరోసారి చంద్రబాబు వేలుపెడితే ఇక్కడి రాజకీయాలు, పరిస్థితుల్లో కూడా ప్రతికూల మార్పులొస్తాయనే ప్రజలు భావించారని అభిప్రాయపడింది. కూటమిని మొత్తం తన చుట్టే తిప్పుకోవడం, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడం మొదలుకుని, తానే ముందుండి నడిపించడం కూడా ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైందని అంచనా వేసింది. ఎన్నికలకు ముందు చివరి 4,5 రోజుల పాటు చంద్రబాబు నిర్వహించిన విస్తృత ప్రచారం, ప్రస్తావించిన అంశాలు కూటమిపై ప్రతికూల ప్రభావం చూపాయని అభిప్రాయపడింది. సీపీఎంగా పోటీచేసిన భద్రాచలం, మిర్యాలగూడలలో, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులున్న నారాయణ్‌పేట్, మధిరలలో కనీసం ఒక్కోస్థానంలోనైనా గెలిచే అవకాశాలున్నాయని భావిస్తోంది.  

>
మరిన్ని వార్తలు