చంద్రబాబుకు యుద్ధం చేయడం రాదు..

27 Mar, 2018 15:56 IST|Sakshi

హోదా విషయంలో  చంద్రబాబు తప్పు చేసిన ముద్దాయి

వెన్నుపోటు తప్ప, యుద్ధం చేయడం రాదు

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం తప్పదు

సాక్షి, విజయవాడ : అఖిలపక్ష సమావేశం పేరుతో చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌  ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తప్పు చేసిన ముద్దాయి అని, ముద్దాయి పిలిస్తే అఖిలపక్షానికి ఎలా వెళ్తామని ఆయన సూటిగా ప్రశ్నించారు.  విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు లాంటి ముద్దాయి, దోషి, న్యాయమూర్తి స్థానంలో కూర్చుంటామంటే ఊరుకోం. నాలుగేళ్లుగా చంద్రబాబు డ్రామాలు ఆడారు. హోదా కోసం వైఎస్‌ఆర్‌ సీపీ అవిశ్వాసం పిలుపు నివ్వడంతో గతిలేక ఇప్పుడు కూడా హోదా అంటున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన అఖిలపక్షం... తప్పు చేసిన దోషి న్యాయమూర్తిగా సాక్షులను విచారించినట్లు వుంది. హోదా రానివ్వకుండా అడ్డుకున్న ముద్దాయి... ఈ రోజు హోదా కోసం అంటూ అఖిలపక్షానికి పిలిస్తే దానికి వైఎస్‌ఆర్‌ సీపీ ఎలా హాజరు అవుతుంది.

సింగపూర్‌ తరహా పోరాటం అన్న చంద్రబాబు హఠాత్తుగా అఖిలపక్షంతో కలిపి పోరాడతామని అంటున‍్నారు. గతంలో మీతో వున్న బీజేపీ, జనసేనలు మిమ్మల్ని విడిచిపెట్టాయి. అవే పార్టీలు ఇప్పుడు చంద్రబాబు అవినీతిపై విమర్శలు చేస్తున్నాయి. వాటికి జవాబు చెప్పుకోలేక చంద్రబాబు...వైఎస్‌ఆర్‌ సీపీపై విమర్శలు చేస్తున‍్నారు. వెన్నుపోటు తప్ప...యుద్ధం చేయడం చంద్రబాబుకు చేతకాదు. ఆయన జీవితమంతా వెన్నుపోట్లే. చంద్రబాబు ఒంటరిగా పోరాడే ధైర‍్యం లేని వ్యక్తి. ఎవరో ఒకరి తోడు లేకుండా అధికారంలోకి రాలేని వ్యక్తి. అటువంటి చంద్రబాబు ఎంపీ విజయసాయి రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ప్రధాని వ‍ద్దరకు వెళ్లి సీఎం రమేష్‌, సుజనా చౌదరి లాలూచీ పడ్డారు.

మా పార్టీ ఎంపీలు రాజీనామా, అవిశ్వాస తీర్మానం తేదీలను ప్రకటించారు. పార్లమెంట్‌ నిరవధిక వాయిదా పడితే తక్షణం ఎంపీలు రాజీనామాలు చేస్తామని అన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో స్పష్టమైన ప్రణాళికతో ప్రత్యేక హోదాపై పోరాడతాం. ఇక చంద్రబాబు అవిశ్వాసంపై తేలికగా మాట్లాడారు. తర్వాత ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. నేనే అవిశ్వాసం పెడతానంటూ ప్రకటించారు. మతతత్వ పార్టీ అని బీజేపీని విమర్శించిన చంద్రబాబు తర్వాత అదే పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు తాపత్రయం. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారు’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు